చరిత్రకెక్కిన ఓ అమ్మ కథ | The famous story of a mother | Sakshi
Sakshi News home page

చరిత్రకెక్కిన ఓ అమ్మ కథ

Published Wed, Jul 16 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

చరిత్రకెక్కిన ఓ అమ్మ కథ

చరిత్రకెక్కిన ఓ అమ్మ కథ

‘‘టెస్ట్‌ట్యూబ్ బే బీలలో ప్రపంచ స్థాయిలో నాది మూడో స్థానం కావడం, ఇప్పుడు ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తొలి టెస్ట్‌ట్యూబ్ తల్లిగా రికార్డులకెక్కడం అనిర్వచనీయ అనుభూతి. వైద్యరంగంలో చోటుచేసుకున్న ఒక అద్భుతంలో నేను భాగస్వామినన్న భావన మాటల్లో వర్ణించలేని ఆనందం. టెస్ట్‌ట్యూబ్ బేబీని పొందడం ద్వారా నా తల్లి, పుట్టడం ద్వారా నేను, నాకు పుట్టడం ద్వారా నా కుమార్తె.. ఇలా ముగ్గురం చరిత్రలో స్థానం సంపాదించుకోవడం రికార్డు.’’

- ఇరవైనాలుగేళ్ల క్రితం టెస్ట్‌ట్యూబ్ బేబీగా పుట్టి, ఇప్పుడు తానే బిడ్డకు తల్లైన కమలా రత్నం
 
‘కొద్దిమంది పెద్దల సమక్షంలో ఆ అమ్మాయి పెళ్లిని గుట్టు చప్పుడు కాకుండా జరిపించాం. అదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోపే ఆమె గర్భం దాల్చింది, ఈ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాం. ఎందుకంటే ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక అపూర్వఘట్టం. అందుకే అలా కాపాడుకోవలసి వచ్చింది’ అన్నారు చెన్నైలో జీజీ ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ కమలా సెల్వరాజ్.

ఈ నెల మొదటి వారం దాకా ఆమె పడ్డ ఈ ఆందోళనలో ఎంతో అర్థం ఉంది. దాని వెనుక తల్లినీ, బిడ్డనూ కాపాడుకోవాలనే ఆర్ద్రత ఉంది. వైద్య చరిత్రలో తాను సాధించిన సువర్ణాధ్యాయాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఉంది. ఇంతకీ ఎవరా గర్భం దాల్చిన స్త్రీ? ఆమె తల్లి కావడం వైద్య చరిత్రలో ఎందుకు అపూర్వం? వీటికి జవాబు కోసం పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి.
 
1980ల నాటి చివరి రోజులవి... వివాహమైన ప్రతి స్త్రీ లాగానే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన పొన్నా కూడా తల్లి కావాలనుకున్నారు. పెళ్లయి రెండు పదుల సంవత్సరాలు దాటుతున్నా పిల్లా పాపల కేరింతలకు ఆమె, ఆమె భర్త రామమూర్తి నోచుకోలేదు. ఎందరెందరో వైద్యులను సంప్రదించినా బిడ్డ కావాలన్న వారి కోర్కె నెరవేరలేదు. తమిళ సినీ దిగ్గజం ‘జెమినీ’ గణేశన్ (మహానటి సావిత్రి భర్త) అంటే రామమూర్తికి చిన్ననాటి నుండి ఇష్టం. ఆ ఇష్టమే ఆయన కోర్కె నెరవేరేందుకు కారణమైంది.

‘‘ఒక రోజు మా నాన్న జెమినీ గణేశన్ వచ్చి, రామమూర్తి, పొన్నా దంపతులను నాకు పరిచయం చేశారు’’ డాక్టర్ కమలా సెల్వరాజ్ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడే నేను ఆధునిక టెస్ట్‌ట్యూబ్ బేబీ విధానంపై శిక్షణ పొంది వచ్చాను.  మా నాన్న కోర్కె, ఆ దంపతుల ఆశను నెరవేర్చాలని ఈ తొలి కేసును సవాలుగా తీసుకొని, సక్సెస్ చేశా. 1990 ఆగష్టు 1న రామమూర్తి, పొన్నా దంపతులకు టెస్ట్‌ట్యూబ్ విధానంలో ఆడబిడ్డ పుట్టింది. ప్రపంచంలోనే ఇది మూడో టెస్ట్‌ట్యూబ్ బేబీగా మెడికల్ కౌన్సిల్ గుర్తించింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
 
వైద్య మేధ కృషి ఫలంగా ఆమె చేతుల్లో పుట్టిన కమలా రత్నం అణువంత తేడా కూడా లేకుండా సాధారణ యువతుల్లానే ఎదిగింది. యుక్తవయస్సుకు వచ్చిన కమలకు పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ‘‘టెస్ట్‌ట్యూబ్ బేబీకి పెళ్లి అనగానే అందరి దృష్టీ పడి, ఇబ్బందు లొస్తాయి. అందుకే రహస్యంగా పెళ్లి చేయాలని కోరాను.

ముఖ్యమైన బంధువులు, మా కుటుంబం సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. కొద్ది నెలల్లోనే కమలా రత్నం గర్భం దాల్చిందని తెలుసుకుని ఎంతో సంతోషించాను. అయితే మళ్లీ మరో సవాల్. అందుకే, ప్రసవం అయ్యేవరకు ఎవరికీ చెప్పవద్దని షరతు పెట్టాను. టెస్ట్‌ట్యూబ్ బేబీగా ఇరవై నాలుగేళ్ళ క్రితం ఈ లోకంలోకి వచ్చిన కమలా రత్నం అప్పట్లో 2.5 కిలోల బరువుతో పుడితే, ఆమె కడుపున ఈ జూలై 10న పుట్టిన ఆడపిల్ల 2.8 కిలోల బరువుంది’’ అని ఈ డాక్టర్ నవ్వుతూ చెప్పారు.
 
అప్పట్లో ప్రపంచంలోని తొలి తరం టెస్ట్‌ట్యూబ్ బేబీలలో ఒకరిగా రికార్డుల్లోకెక్కిన కమలా రత్నం ఇప్పుడు మాతృ త్వంతో, ఆ ఘనత సాధించిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా మరో కొత్త చరిత్ర లిఖించారు. ‘‘టెస్ట్‌ట్యూబ్ బేబీలు సాధారణ పిల్లలలా ఎదుగుతారా అని చాలామందికున్న అనుమానం పటాపంచలైంది. అన్నేళ్ళ క్రితం నా చేతుల్లో ఊపిరిపోసుకున్న టెస్ట్‌ట్యూబ్ బేబీ, ఇప్పుడు తల్లి కావడంతో నా ఆనందానికి అవధులు లేవు’’ అని ఆమె మెరుస్తున్న కళ్ళతో అన్నారు. అవును... ఓ బిడ్డకు ప్రాణం పోసి, ఇప్పుడు మళ్ళీ ఆ బిడ్డకు పుట్టిన మరో బిడ్డను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యురాలికి అంతకన్నా ఆనందం, ఆత్మతృప్తి ఇంకేముంటాయి!

- కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్‌చార్జ్, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement