kamala selvaraj
-
సోదరి అభ్యంతరాలపై స్పందించిన సావిత్రి కూతురు
‘మహానటి’ విషయంలో జెమిని గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తక్కువ చేసి చూపించారని, ఇంకా ‘మహానటి’ టీంపై ఆమె పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు. ‘‘నా దృక్కోణంలో.. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కోణంలో ‘మహానటి’ సినిమా చూశా. నా సోదరి కమల మరో కోణంలో సినిమా చూశారు. ఆమె స్వతహాగా తమిళురాలు. ‘మహానటి’ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమాలాగే చూసిందామె. మా అమ్మను నాన్న అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. నాకు కమల అక్కకు మధ్య ఈ సినిమా వల్ల విభేదాలు రావాలని నేను కోరుకోవట్లేదు’’ అని చాముండేశ్వరి అన్నారు. ఆ కుటుంబాన్ని దూరం చేసుకోలేను.. తన తల్లి సావిత్రికి తండ్రే మద్యం అలవాటు చేశాడన్నది నిజం కాదని.. సినీ పరిశ్రమలో మద్యం తాగడం మామూలు విషయమని.. అలా తన తల్లికి కూడా అలవాటై ఉండొచ్చని.. ఐతే సినిమాలో తన తండ్రి తాగినపుడే తల్లి కూడా మద్యం తాగినట్లు చూపిస్తారని.. అలాగే ఆమె అలా తాగడం అదే తొలిసారని కూడా చెప్పలేదనే విషయాన్ని చాముండేశ్వరి గుర్తు చేశారు. తన తండ్రి నుంచి తనకు దక్కిన అతి పెద్ద ఆస్తి తన పెద్దమ్మ కుటుంబమే అని.. తన అక్కలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనన్నారు.. సినిమాలో అలిమేలుగా చూపించిన తన పెద్దమ్మ (బాబ్జీమా) తమకెంతగానో అండగా నిలిచిందని.. తన తండ్రి కుటుంబం మీద తనకు అపారమైన గౌరవం ఉందని.. అది కూడా తన కుటుంబమే అని చాముండేశ్వరి పేర్కొన్నారు. -
కమల సెల్వరాజ్ వ్యాక్యలకుపై స్పందించిన సావిత్రి కూతురు
-
జెమినీ గణేశన్ కుమార్తెల కలయిక
చెన్నై : నటుడు జెమినీ గణేశన్ కుమార్తెలు అందరూ కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను వాస్తవాలకు భిన్నంగా చూపించారని ఆయన కుమార్తెల్లో ఒకరైన కమలా సెల్వరాజ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన తండ్రిపై ఓ డాక్యుమెంటరీని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. కాగా జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్పవల్లి, సావిత్రి, జూలియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. జెమినీ గణేశన్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవితి స్వామినాధన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్ మొదటి భార్య అలిమేలు కుమార్తెలు. ఇక బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్ ...పుష్పవల్లి కుమార్తెలు కాగా వీరిలో మూడో భార్య సావిత్రి. ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీష్. వీరంతా ఒక్క తల్లి బిడ్డలు కాకపోయినా అందరూ అక్కాచెల్లెళ్లుగా ప్రేమాభిమానాలు కురిపించుకుంటారు. ప్రతి ఏడాది ఒక వేడుకలా అందరూ కలుసుకుంటారు. అలాంటి ఒక కలయిక శుక్రవారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. ఒకే వేదికపై జెమినీ గణేశన్ ఏడుగురు కుమార్తెలు కలిసి ఉన్న చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘మహానటి’కి కౌంటర్
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహానటి సినిమాతో ఈ ట్రెండ్ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్ తెరమీదకు రానుంది. అయితే ఆ బయోపిక్ మహానటి కి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రి వేదించినట్టుగా తాగుబోతుగా చూపించారని అది నిజం కాదని ఆమో వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెర మీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒక వైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటి వారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలబై నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
సావిత్రి గొప్పే.. మా నాన్న కాదా?
పిల్లలకు తండ్రంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి గొప్ప స్టార్ అయితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది.‘మహానటి’ సినిమా సావిత్రిని వర్తమానంలోకి తెచ్చింది.అలాగే జెమినీ గణేశన్‌ను కూడా. జెమినీ మీద తెలుగు సమాజంలో ఉన్న అపోహలను ‘మహానటి’ సినిమా దూరం చేసిందని అనుకునేవారు ఇప్పుడు ఉన్నారు. కానీ జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు.ఆమె తరఫు వాదన ఏమిటో విందాం. ► ‘మహానటి’ సినిమా విషయంలో మీ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ సినిమా గురించి మీ అభ్యం తరం ఏమిటి? మా నాన్నగారు సావిత్రమ్మను చూసి అసూయ పడినట్లుగా చూపించారు. మా నాన్నగారు పెద్ద స్టార్. శివాజీ గణేశన్, ఎం.జి.ఆర్‌లతో పాటు మా నాన్న కూడా స్టార్డమ్ చూశారు. అలాంటి వ్యక్తి సావిత్రమ్మను చూసి అసూయ పడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే సావిత్రమ్మ ఆకర్షణలో మా నాన్నగారు ఆమె వెంట తిరిగినట్లు చూపించారు. సావిత్రిగారు మా నాన్న వెంట తిరిగి ఉండొచ్చు కదా. అలాగే ఆమె మద్యానికి ఎలా బానిసయ్యారో ఎవరూ చెప్పలేరు. అందులో మా నాన్న ప్రమేయం ఉన్నట్టు చూపడం సరికాదు. ► ‘మహానటి’ సినిమా చూసి జెమినీ గణేశన్ మీద అపోహలు తొలిగాయని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అంటే మీ నాన్నను పాజిటివ్‌గా చూపించినట్టే కదా? నిజంగానే మా నాన్నగారు మంచి వ్యక్తే. అన్నేసి లవ్ సీన్స్ తీయడం ఎందుకు? సావిత్రిగారు గొప్ప స్టార్ అని ఎలివేట్ చేశారు. మా నాన్నగారు కూడా పెద్ద స్టార్. అది ఎలివేట్ చేసినట్లు అనిపించలేదు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదు. పైగా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. ► సినిమా విషయంలో మీ ఒపీనియన్ మీది.. సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారి ఒపీనియన్ ఆమెది.. ఈ సినిమా మీలో మనస్పర్థలు రావడానికి కారణం అవుతుందా? అస్సలు కాదు. మేమంతా చాలా బాగుంటాం. సినిమా విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది. అది మా పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించదు. మేమంతా ఎప్పటిలానే బాగుంటాం. ► సావిత్రిగారితో మీకున్న మెమొరీస్ గుర్తు చేసు కుంటారా? సావిత్రి గారిది చాలా లవింగ్, కైండ్ నేచర్. చాలా ఆప్యాయత చూపించేవారు మా మీద. ఎవరికైనా మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నా మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి అని మమ్మల్ని పరిచయం చేశాకే వాళ్ల పిల్లల్ని (విజయ చాముండేశ్వరి, సతీష్‌ను) పరిచయం చేసేవారు. నేను మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో సావిత్రిగారు విజిట్ చేసేవారు. నాకు హెయిర్ కట్ చేసేవారు. కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ ట్రావెల్‌ని ఎంజాయ్ చేశాం. ఆవిడ నైస్ పర్సన్. ► సావిత్రమ్మగారితో మీ అమ్మ అలమేలుగారి ఈక్వేషన్ గురించి? ఇంట్లో హింసిస్తున్నారంటూ అర్ధరాత్రి సావిత్రిగారు ఏడ్చుకుంటూ మా ఇంటికొస్తే మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు. సావిత్రిగారు కూడా మా అమ్మగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. మా అమ్మకి మేం నలుగురు కూతుళ్లం. పుష్పవల్లి అమ్మకు ఇద్దరు కూతుళ్లు. సావిత్రమ్మకు ఒక కూతురు, కొడుకు. పిల్లలందరం బాగుండేవాళ్లం. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మ, సావిత్రమ్మగారు.. మమ్మల్నందర్నీ సమానంగా చూసేవారు. ► ‘మా నాన్నగారు డిగ్నిఫైడ్ పర్సన్’ అని ఇంతకు ముందు మీరన్నారు. మరి కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయిలతో ఆయన ఎఫైర్స్ గురించి మీరేమంటారు? మా నాన్నగారు కావాలని ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చాలా హ్యాండ్సమ్ మ్యాన్. బాగా చదువుకున్నారు. స్టార్ హీరో. ఆయన చుట్టూనే అమ్మాయిలు తిరిగేవారు. నాన్నను ప్రేమించినవాళ్లంతా సింగిల్ ఉమన్. పుష్పవల్లిగారు, సావిత్రిగారు.. ఇద్దరూ పెళ్లి కానివాళ్లే. ప్లస్ మా నాన్నగారు తనకు పెళ్లయిన విషయాన్ని ఎవరి దగ్గరా దాచి పెట్టలేదు. పుష్పవల్లి అమ్మను నాన్న పెళ్లి చేసుకోలేదు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్లకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలే అని యాక్సెప్ట్ చేశారు. అంతేకానీ మా నాన్నగారు మ్యారీడ్ ఉమెన్ లైఫ్‌లోకి ఎంటరై, వాళ్ల కాపురాలను నాశనం చేయలేదు. ► సావిత్రమ్మగారిని పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మగారు పడిన బాధ మీకు తెలుసా? అప్పుడు మేం చిన్నపిల్లలం. ఏం జరుగుతుందో తెలియని వయసు. అయితే బాగా ఏడ్చేదని మాత్రం తెలుసు. మా ఇంటి పక్కన విజ్జీయమ్మ అని ఉండేవారు. ఆవిడ దగ్గర చెప్పుకుని బాధపడేవారు. అయితే పిల్లల దగ్గర తన బాధను చెప్పుకోలేదు. ► స్కూల్లో మీ ఇంటి విషయాల గురించి మీ స్నేహితులు అడిగేవారా? అలా జరుగుతుందని అమ్మకు తెలుసు కాబట్టి, ఎవరేం అడిగినా ‘మాకు తెలియదు’ అని చెప్పమన్నారు. ‘మీ నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకున్నారట?’ అని ఎవరైనా అడిగితే అమ్మ చెప్పమన్నట్లే ‘మాకు తెలియదు’ అనేవాళ్లం. ► విజయ చాముండేశ్వరిగారు మీ అమ్మగారి గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గురించి కూడా తప్పుగా చెప్పలేదు... అవును. నేనూ ఎవర్నీ విమర్శించడంలేదు. విజ్జీ నన్ను సొంత అక్కలానే అనుకుంటుంది. నేను నా సొంత చెల్లెలిలానే అనుకుంటాను. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. సావిత్రమ్మగారు మమ్మల్ని బాగా చూసినట్లే మా అమ్మగారు కూడా విజ్జీని, తన తమ్ముడు సతీష్‌ని బాగా చూసేవారు. మా అక్క రేవతి పెళ్లప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. అమ్మ నాలుగు గోడల మధ్య పెరిగిన వ్యక్తి. అంత మంది మధ్యలోకి రావడానికి ఆవిడ ఇబ్బందిపడ్డారు. అప్పుడు సావిత్రమ్మే అన్నీ చూసుకున్నారు. చాలామంది రేవతక్క సావిత్రమ్మ కూతురు అనుకున్నారు. ► సావిత్రమ్మగారు చనిపోకముందే విజయ చాముండేశ్వరిగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సతీష్ మీ ఇంట్లో ఉండేవారట? సావిత్రమ్మగారు చనిపోయాక ‘విజ్జీ అక్కతో ఉంటావా? నాతో పాటు ఉంటావా?’ అని నాన్నగారు సతీష్‌ని అడిగితే.. ‘మీతో ఉంటాను నాన్నా’ అన్నాడు. దాంతో నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారు సతీష్‌ని తన సొంత కొడుకులానే చూసుకున్నారు. మేం కూడా మా తమ్ముడనే అనుకున్నాం. సతీష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాన్నగారు ఏమీ అనలేదు. సతీష్‌కి కొడుకు పుడితే పుట్టు వెంట్రుకలు తీయించడానికి నేనే పళని గుడికి తీసుకెళ్లాను. మేమంతా అంత బాగుంటాం. ► మరి.. ముంబైలో సెటిలైన నటి రేఖ (పుష్పవల్లి కూతురు)గారితో మీరంతా టచ్‌లోనే ఉన్నారా? మేమంతా నెలకోసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. వీలు చేసుకుని ఆర్నెల్లకోసారి కలుస్తాం. ► సావిత్రిగారి ఆస్తుల్ని జెమినీగారు తీసుకున్నారని రూమర్ ఉండేది.. అది నిజం కాదు. నాన్నగారి ఆస్తిని ఆవిడ, ఆవిడ ఆస్తులను నాన్నగారు తీసుకోలేదు. అసలు మా నాన్నగారు తన పేరు మీద ఆస్తులు కొనేవారు కాదు. మా అమ్మ పేరు మీదనో, నానమ్మ పేరు మీదనో కొనేవారు. ► సావిత్రిగారు కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరే నాటికి ఆవిడకు ఆస్తులు లేవని చాలామంది చెప్పుకుంటారు... ఆవిణ్ణి చాలామంది మోసం చేశారు. నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్ ఇవ్వలేదు. ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఆస్పత్రిలో చేరాక మా నాన్నగారు చూసుకోలేదని చాలామంది అంటారు. అది నిజం కాదు. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా ఆయనే కట్టారు. ► సావిత్రిగారి అంత్యక్రియలు మీ ఇంట్లోనే జరిగాయి కదా? అవును. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మగారు దగ్గరుండి చేశారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ చివరి యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం మా అమ్మ దగ్గరుండి చేయించారు. ► ఫైనల్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ నటన, జెమినీగారిలా దుల్కర్ నటన మీకు నచ్చాయా? కీర్తీ సురేశ్ అచ్చంగా సావిత్రమ్మల్లా మౌల్డ్ అయ్యారు. దుల్కర్ బాగా యాక్ట్ చేశారు. అయితే నాన్నగారు అందగాడు. కళ్లతోనే చెప్పాలనుకున్న విషయాలను కన్వే చేసేవారు. ఆయనలాంటి అందగాడు, నటుడు రారు. ఆయనకు రీప్లేస్మెంట్ లేదు. ► సావిత్రిగారి జీవితం నాశనం కావడానికి ఆవిడే కారణం అంటారా? నా ఒపీనియన్ అదే. ఆమె కొంచెం యారోగెంట్‌గా ఉండేవారు. అలాగని మంచి మనిషి కాదని కాదు. అందరికీ సహాయం చేసేవారు. కానీ మొండి మనిషి. నాన్నతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. ఆయనకు దూరమయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను మోసం చేయడం మొదలుపెట్టారు. మోసపోవద్దని చెప్పడానికి వెళ్లిన నాన్నను నానా మాటలు అన్నారు. ఆవిడ జీవితం అలా కావడానికి ఆమే కారణం. ► మీ అక్కాచెల్లెళ్ల గురించి చెబుతారా? మా నాన్నగారు ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మమ్మల్ని బాగా చదివించారు. మేం నలుగురుం బాగా స్థిరపడ్డాం. మా అక్క రేవతి పెద్ద డాక్టర్, నేను కూడా డాక్టర్. చెల్లెలు జయలక్ష్మీ డాక్టర్, చిన్న చెల్లెలు నారాయణి మంచి జర్నలిస్ట్. మా అందరికీ చాలా మంచి పేరుంది. కమలా సెల్వరాజ్, అలమేలు, జెమినీ గణేశన్, రేవతి (పైన) నారాయణి, జయలక్ష్మి నానమ్మ, నాన్న, అమ్మ అలమేలు, ఒళ్లో జయలక్ష్మి (పై వరస) నారాయణి, రేవతిలతో కమల – ఇంటర్వ్యూ: డి.జి. భవాని – కర్టెసీ: సంజయ్, చెన్నై -
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
-
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
తమిళసినిమా: నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు సావిత్రి పాత్రలో నటించిన నటి కీర్తీసురేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి కూడా చిత్రం బాగుందని ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి భర్త జెమినీగణేశన్ కూతురు, ప్రముఖ వైద్యురాలు కమలాసెల్వరాజ్ ఆ చిత్ర యూనిట్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆమె బుధవారం ఒక వెబ్సైట్ విలేకరితో మాట్లాడుతూ నడిగైయిన్‌తిలగం చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ తీవ్రంగా ఆరోపించారు. తన తండ్రికి కళంకం ఆపాదించేలా చిత్రంలో చూపించారని అన్నారు. తన తండ్రి బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటిది ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడమేంటని ప్రశ్నించారు. తొలిప్రేమ సావిత్రిపైనేనా? నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రి పైనే అనేలా చిత్రీకరించారని, అయితే అంతకు ముందు తన తల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారని అన్నారు. అంటే తన తల్లిపై ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించారు. నాన్నే సావిత్రికి మద్యం అలవాటు చేశారా? అదే విధంగా తన తండ్రే సావిత్రికి మద్యం సేవించడం అలవాటు చేసిన తాగుబోతుగా చిత్రంలో చూపించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైయ్యానన్నారు. ఈ చిత్రంలో నాన్నను ప్రేక్షకులు అంగీకరించని నటుడిగా చిత్రీకరించారని, అలాంటప్పుడు ఆయనకు ప్రేక్షకులు కాదల్‌మన్నన్ ( ప్రేమరాజు) అనే పట్టం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సావిత్రి ప్రాప్తం చిత్రం చేయడానికి సిద్ధం అయినప్పుడు అంత పెద్ద నటి ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని తన తండ్రి వద్దని చెప్పారన్నారు. ఎందరో ప్రముఖ నటులతో నటించిన సావిత్రికి ఆ నటులు సహాయం చేసి కాపాడవచ్చుగా అని అన్నారు. కానీ తన తండ్రే సావిత్రిని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకున్నారు నాన్న గురించి చెప్పాలంటే తనను ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని అన్నారు. కుక్కను ఉసిగొల్పి గెంటేశారు ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్ చెప్పారు. -
చరిత్రకెక్కిన ఓ అమ్మ కథ
‘‘టెస్ట్‌ట్యూబ్ బే బీలలో ప్రపంచ స్థాయిలో నాది మూడో స్థానం కావడం, ఇప్పుడు ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తొలి టెస్ట్‌ట్యూబ్ తల్లిగా రికార్డులకెక్కడం అనిర్వచనీయ అనుభూతి. వైద్యరంగంలో చోటుచేసుకున్న ఒక అద్భుతంలో నేను భాగస్వామినన్న భావన మాటల్లో వర్ణించలేని ఆనందం. టెస్ట్‌ట్యూబ్ బేబీని పొందడం ద్వారా నా తల్లి, పుట్టడం ద్వారా నేను, నాకు పుట్టడం ద్వారా నా కుమార్తె.. ఇలా ముగ్గురం చరిత్రలో స్థానం సంపాదించుకోవడం రికార్డు.’’ - ఇరవైనాలుగేళ్ల క్రితం టెస్ట్‌ట్యూబ్ బేబీగా పుట్టి, ఇప్పుడు తానే బిడ్డకు తల్లైన కమలా రత్నం ‘కొద్దిమంది పెద్దల సమక్షంలో ఆ అమ్మాయి పెళ్లిని గుట్టు చప్పుడు కాకుండా జరిపించాం. అదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోపే ఆమె గర్భం దాల్చింది, ఈ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాం. ఎందుకంటే ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక అపూర్వఘట్టం. అందుకే అలా కాపాడుకోవలసి వచ్చింది’ అన్నారు చెన్నైలో జీజీ ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ కమలా సెల్వరాజ్. ఈ నెల మొదటి వారం దాకా ఆమె పడ్డ ఈ ఆందోళనలో ఎంతో అర్థం ఉంది. దాని వెనుక తల్లినీ, బిడ్డనూ కాపాడుకోవాలనే ఆర్ద్రత ఉంది. వైద్య చరిత్రలో తాను సాధించిన సువర్ణాధ్యాయాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఉంది. ఇంతకీ ఎవరా గర్భం దాల్చిన స్త్రీ? ఆమె తల్లి కావడం వైద్య చరిత్రలో ఎందుకు అపూర్వం? వీటికి జవాబు కోసం పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1980ల నాటి చివరి రోజులవి... వివాహమైన ప్రతి స్త్రీ లాగానే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన పొన్నా కూడా తల్లి కావాలనుకున్నారు. పెళ్లయి రెండు పదుల సంవత్సరాలు దాటుతున్నా పిల్లా పాపల కేరింతలకు ఆమె, ఆమె భర్త రామమూర్తి నోచుకోలేదు. ఎందరెందరో వైద్యులను సంప్రదించినా బిడ్డ కావాలన్న వారి కోర్కె నెరవేరలేదు. తమిళ సినీ దిగ్గజం ‘జెమినీ’ గణేశన్ (మహానటి సావిత్రి భర్త) అంటే రామమూర్తికి చిన్ననాటి నుండి ఇష్టం. ఆ ఇష్టమే ఆయన కోర్కె నెరవేరేందుకు కారణమైంది. ‘‘ఒక రోజు మా నాన్న జెమినీ గణేశన్ వచ్చి, రామమూర్తి, పొన్నా దంపతులను నాకు పరిచయం చేశారు’’ డాక్టర్ కమలా సెల్వరాజ్ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడే నేను ఆధునిక టెస్ట్‌ట్యూబ్ బేబీ విధానంపై శిక్షణ పొంది వచ్చాను. మా నాన్న కోర్కె, ఆ దంపతుల ఆశను నెరవేర్చాలని ఈ తొలి కేసును సవాలుగా తీసుకొని, సక్సెస్ చేశా. 1990 ఆగష్టు 1న రామమూర్తి, పొన్నా దంపతులకు టెస్ట్‌ట్యూబ్ విధానంలో ఆడబిడ్డ పుట్టింది. ప్రపంచంలోనే ఇది మూడో టెస్ట్‌ట్యూబ్ బేబీగా మెడికల్ కౌన్సిల్ గుర్తించింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు. వైద్య మేధ కృషి ఫలంగా ఆమె చేతుల్లో పుట్టిన కమలా రత్నం అణువంత తేడా కూడా లేకుండా సాధారణ యువతుల్లానే ఎదిగింది. యుక్తవయస్సుకు వచ్చిన కమలకు పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ‘‘టెస్ట్‌ట్యూబ్ బేబీకి పెళ్లి అనగానే అందరి దృష్టీ పడి, ఇబ్బందు లొస్తాయి. అందుకే రహస్యంగా పెళ్లి చేయాలని కోరాను. ముఖ్యమైన బంధువులు, మా కుటుంబం సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. కొద్ది నెలల్లోనే కమలా రత్నం గర్భం దాల్చిందని తెలుసుకుని ఎంతో సంతోషించాను. అయితే మళ్లీ మరో సవాల్. అందుకే, ప్రసవం అయ్యేవరకు ఎవరికీ చెప్పవద్దని షరతు పెట్టాను. టెస్ట్‌ట్యూబ్ బేబీగా ఇరవై నాలుగేళ్ళ క్రితం ఈ లోకంలోకి వచ్చిన కమలా రత్నం అప్పట్లో 2.5 కిలోల బరువుతో పుడితే, ఆమె కడుపున ఈ జూలై 10న పుట్టిన ఆడపిల్ల 2.8 కిలోల బరువుంది’’ అని ఈ డాక్టర్ నవ్వుతూ చెప్పారు. అప్పట్లో ప్రపంచంలోని తొలి తరం టెస్ట్‌ట్యూబ్ బేబీలలో ఒకరిగా రికార్డుల్లోకెక్కిన కమలా రత్నం ఇప్పుడు మాతృ త్వంతో, ఆ ఘనత సాధించిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా మరో కొత్త చరిత్ర లిఖించారు. ‘‘టెస్ట్‌ట్యూబ్ బేబీలు సాధారణ పిల్లలలా ఎదుగుతారా అని చాలామందికున్న అనుమానం పటాపంచలైంది. అన్నేళ్ళ క్రితం నా చేతుల్లో ఊపిరిపోసుకున్న టెస్ట్‌ట్యూబ్ బేబీ, ఇప్పుడు తల్లి కావడంతో నా ఆనందానికి అవధులు లేవు’’ అని ఆమె మెరుస్తున్న కళ్ళతో అన్నారు. అవును... ఓ బిడ్డకు ప్రాణం పోసి, ఇప్పుడు మళ్ళీ ఆ బిడ్డకు పుట్టిన మరో బిడ్డను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యురాలికి అంతకన్నా ఆనందం, ఆత్మతృప్తి ఇంకేముంటాయి! - కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై