కమలా సెల్వరాజ్
పిల్లలకు తండ్రంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి గొప్ప స్టార్ అయితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది.‘మహానటి’ సినిమా సావిత్రిని వర్తమానంలోకి తెచ్చింది.అలాగే జెమినీ గణేశన్‌ను కూడా. జెమినీ మీద తెలుగు సమాజంలో ఉన్న అపోహలను ‘మహానటి’ సినిమా దూరం చేసిందని అనుకునేవారు ఇప్పుడు ఉన్నారు. కానీ జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు.ఆమె తరఫు వాదన ఏమిటో విందాం.
► ‘మహానటి’ సినిమా విషయంలో మీ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ సినిమా గురించి మీ అభ్యం తరం ఏమిటి?
మా నాన్నగారు సావిత్రమ్మను చూసి అసూయ పడినట్లుగా చూపించారు. మా నాన్నగారు పెద్ద స్టార్. శివాజీ గణేశన్, ఎం.జి.ఆర్‌లతో పాటు మా నాన్న కూడా స్టార్‌డమ్ చూశారు. అలాంటి వ్యక్తి సావిత్రమ్మను చూసి అసూయ పడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే సావిత్రమ్మ ఆకర్షణలో మా నాన్నగారు ఆమె వెంట తిరిగినట్లు చూపించారు. సావిత్రిగారు మా నాన్న వెంట తిరిగి ఉండొచ్చు కదా. అలాగే ఆమె మద్యానికి ఎలా బానిసయ్యారో ఎవరూ చెప్పలేరు. అందులో మా నాన్న ప్రమేయం ఉన్నట్టు చూపడం సరికాదు.
► ‘మహానటి’ సినిమా చూసి జెమినీ గణేశన్ మీద అపోహలు తొలిగాయని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అంటే మీ నాన్నను పాజిటివ్‌గా చూపించినట్టే కదా?
నిజంగానే మా నాన్నగారు మంచి వ్యక్తే. అన్నేసి లవ్ సీన్స్ తీయడం ఎందుకు? సావిత్రిగారు గొప్ప స్టార్ అని ఎలివేట్ చేశారు. మా నాన్నగారు కూడా పెద్ద స్టార్. అది ఎలివేట్ చేసినట్లు అనిపించలేదు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదు. పైగా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది.
► సినిమా విషయంలో మీ ఒపీనియన్ మీది.. సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారి ఒపీనియన్ ఆమెది.. ఈ సినిమా మీలో మనస్పర్థలు రావడానికి కారణం అవుతుందా?
అస్సలు కాదు. మేమంతా చాలా బాగుంటాం. సినిమా విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది. అది మా పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించదు. మేమంతా ఎప్పటిలానే బాగుంటాం.
► సావిత్రిగారితో మీకున్న మెమొరీస్ గుర్తు చేసు కుంటారా?
సావిత్రి గారిది చాలా లవింగ్, కైండ్ నేచర్. చాలా ఆప్యాయత చూపించేవారు మా మీద. ఎవరికైనా మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నా మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి అని మమ్మల్ని పరిచయం చేశాకే వాళ్ల పిల్లల్ని (విజయ చాముండేశ్వరి, సతీష్‌ను) పరిచయం చేసేవారు. నేను మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో సావిత్రిగారు విజిట్ చేసేవారు. నాకు హెయిర్ కట్ చేసేవారు. కాశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ ట్రావెల్‌ని ఎంజాయ్ చేశాం. ఆవిడ నైస్ పర్సన్.
► సావిత్రమ్మగారితో మీ అమ్మ అలమేలుగారి ఈక్వేషన్ గురించి?
ఇంట్లో హింసిస్తున్నారంటూ అర్ధరాత్రి సావిత్రిగారు ఏడ్చుకుంటూ మా ఇంటికొస్తే మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు. సావిత్రిగారు కూడా మా అమ్మగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. మా అమ్మకి మేం నలుగురు కూతుళ్లం. పుష్పవల్లి అమ్మకు ఇద్దరు కూతుళ్లు. సావిత్రమ్మకు ఒక కూతురు, కొడుకు. పిల్లలందరం బాగుండేవాళ్లం. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మ, సావిత్రమ్మగారు.. మమ్మల్నందర్నీ సమానంగా చూసేవారు.
► ‘మా నాన్నగారు డిగ్నిఫైడ్ పర్సన్’ అని ఇంతకు ముందు మీరన్నారు. మరి కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయిలతో ఆయన ఎఫైర్స్ గురించి మీరేమంటారు?
మా నాన్నగారు కావాలని ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చాలా హ్యాండ్‌సమ్ మ్యాన్. బాగా చదువుకున్నారు. స్టార్ హీరో. ఆయన చుట్టూనే అమ్మాయిలు తిరిగేవారు. నాన్నను ప్రేమించినవాళ్లంతా సింగిల్ ఉమన్. పుష్పవల్లిగారు, సావిత్రిగారు.. ఇద్దరూ పెళ్లి కానివాళ్లే. ప్లస్ మా నాన్నగారు తనకు పెళ్లయిన విషయాన్ని ఎవరి దగ్గరా దాచి పెట్టలేదు. పుష్పవల్లి అమ్మను నాన్న పెళ్లి చేసుకోలేదు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్లకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలే అని యాక్సెప్ట్ చేశారు. అంతేకానీ మా నాన్నగారు మ్యారీడ్ ఉమెన్ లైఫ్‌లోకి ఎంటరై, వాళ్ల కాపురాలను నాశనం చేయలేదు.
► సావిత్రమ్మగారిని పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మగారు పడిన బాధ మీకు తెలుసా?
అప్పుడు మేం చిన్నపిల్లలం. ఏం జరుగుతుందో తెలియని వయసు. అయితే బాగా ఏడ్చేదని మాత్రం తెలుసు. మా ఇంటి పక్కన విజ్జీయమ్మ అని ఉండేవారు. ఆవిడ దగ్గర చెప్పుకుని బాధపడేవారు. అయితే పిల్లల దగ్గర తన బాధను చెప్పుకోలేదు.
► స్కూల్‌లో మీ ఇంటి విషయాల గురించి మీ స్నేహితులు అడిగేవారా?
అలా జరుగుతుందని అమ్మకు తెలుసు కాబట్టి, ఎవరేం అడిగినా ‘మాకు తెలియదు’ అని చెప్పమన్నారు. ‘మీ నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకున్నారట?’ అని ఎవరైనా అడిగితే అమ్మ చెప్పమన్నట్లే ‘మాకు తెలియదు’ అనేవాళ్లం.
► విజయ చాముండేశ్వరిగారు మీ అమ్మగారి గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గురించి కూడా తప్పుగా చెప్పలేదు...
అవును. నేనూ ఎవర్నీ విమర్శించడంలేదు. విజ్జీ నన్ను సొంత అక్కలానే అనుకుంటుంది. నేను నా సొంత చెల్లెలిలానే అనుకుంటాను. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. సావిత్రమ్మగారు మమ్మల్ని బాగా చూసినట్లే మా అమ్మగారు కూడా విజ్జీని, తన తమ్ముడు సతీష్‌ని బాగా చూసేవారు. మా అక్క రేవతి పెళ్లప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. అమ్మ నాలుగు గోడల మధ్య పెరిగిన వ్యక్తి. అంత మంది మధ్యలోకి రావడానికి ఆవిడ ఇబ్బందిపడ్డారు. అప్పుడు సావిత్రమ్మే అన్నీ చూసుకున్నారు. చాలామంది రేవతక్క సావిత్రమ్మ కూతురు అనుకున్నారు.
► సావిత్రమ్మగారు చనిపోకముందే విజయ చాముండేశ్వరిగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సతీష్ మీ ఇంట్లో ఉండేవారట?
సావిత్రమ్మగారు చనిపోయాక ‘విజ్జీ అక్కతో ఉంటావా? నాతో పాటు ఉంటావా?’ అని నాన్నగారు సతీష్‌ని అడిగితే.. ‘మీతో ఉంటాను నాన్నా’ అన్నాడు. దాంతో నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారు సతీష్‌ని తన సొంత కొడుకులానే చూసుకున్నారు. మేం కూడా మా తమ్ముడనే అనుకున్నాం. సతీష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాన్నగారు ఏమీ అనలేదు. సతీష్‌కి కొడుకు పుడితే పుట్టు వెంట్రుకలు తీయించడానికి నేనే పళని గుడికి తీసుకెళ్లాను. మేమంతా అంత బాగుంటాం.
► మరి.. ముంబైలో సెటిలైన నటి రేఖ (పుష్పవల్లి కూతురు)గారితో మీరంతా టచ్‌లోనే ఉన్నారా?
మేమంతా నెలకోసారి ఫోన్‌లో మాట్లాడుకుంటాం. వీలు చేసుకుని ఆర్నెల్లకోసారి కలుస్తాం.
► సావిత్రిగారి ఆస్తుల్ని జెమినీగారు తీసుకున్నారని రూమర్ ఉండేది..
అది నిజం కాదు. నాన్నగారి ఆస్తిని ఆవిడ, ఆవిడ ఆస్తులను నాన్నగారు తీసుకోలేదు. అసలు మా నాన్నగారు తన పేరు మీద ఆస్తులు కొనేవారు కాదు. మా అమ్మ పేరు మీదనో, నానమ్మ పేరు మీదనో కొనేవారు.
► సావిత్రిగారు కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరే నాటికి ఆవిడకు ఆస్తులు లేవని చాలామంది చెప్పుకుంటారు...
ఆవిణ్ణి చాలామంది మోసం చేశారు. నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్ ఇవ్వలేదు. ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఆస్పత్రిలో చేరాక మా నాన్నగారు చూసుకోలేదని చాలామంది అంటారు. అది నిజం కాదు. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా ఆయనే కట్టారు.
► సావిత్రిగారి అంత్యక్రియలు మీ ఇంట్లోనే జరిగాయి కదా?
అవును. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మగారు దగ్గరుండి చేశారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ చివరి యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం మా అమ్మ దగ్గరుండి చేయించారు.
► ఫైనల్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ నటన, జెమినీగారిలా దుల్కర్ నటన మీకు నచ్చాయా?
కీర్తీ సురేశ్ అచ్చంగా సావిత్రమ్మల్లా మౌల్డ్ అయ్యారు. దుల్కర్ బాగా యాక్ట్ చేశారు. అయితే నాన్నగారు అందగాడు. కళ్లతోనే చెప్పాలనుకున్న విషయాలను కన్వే చేసేవారు. ఆయనలాంటి అందగాడు, నటుడు రారు. ఆయనకు రీప్లేస్‌మెంట్ లేదు.
► సావిత్రిగారి జీవితం నాశనం కావడానికి ఆవిడే కారణం అంటారా?
నా ఒపీనియన్ అదే. ఆమె కొంచెం యారోగెంట్‌గా ఉండేవారు. అలాగని మంచి మనిషి కాదని కాదు. అందరికీ సహాయం చేసేవారు. కానీ మొండి మనిషి. నాన్నతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇన్‌కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. ఆయనకు దూరమయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను మోసం చేయడం మొదలుపెట్టారు. మోసపోవద్దని చెప్పడానికి వెళ్లిన నాన్నను నానా మాటలు అన్నారు. ఆవిడ జీవితం అలా కావడానికి ఆమే కారణం.
► మీ అక్కాచెల్లెళ్ల గురించి చెబుతారా?
మా నాన్నగారు ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మమ్మల్ని బాగా చదివించారు. మేం నలుగురుం బాగా స్థిరపడ్డాం. మా అక్క రేవతి పెద్ద డాక్టర్, నేను కూడా డాక్టర్. చెల్లెలు జయలక్ష్మీ డాక్టర్, చిన్న చెల్లెలు నారాయణి మంచి జర్నలిస్ట్. మా అందరికీ చాలా మంచి పేరుంది.
కమలా సెల్వరాజ్, అలమేలు, జెమినీ గణేశన్, రేవతి (పైన) నారాయణి, జయలక్ష్మి
నానమ్మ, నాన్న, అమ్మ అలమేలు, ఒళ్లో జయలక్ష్మి (పై వరస) నారాయణి, రేవతిలతో కమల
– ఇంటర్వ్యూ: డి.జి. భవాని
– కర్టెసీ: సంజయ్, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment