‘మహానటి’ విషయంలో జెమిని గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తక్కువ చేసి చూపించారని, ఇంకా ‘మహానటి’ టీంపై ఆమె పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు. ‘‘నా దృక్కోణంలో.. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కోణంలో ‘మహానటి’ సినిమా చూశా. నా సోదరి కమల మరో కోణంలో సినిమా చూశారు. ఆమె స్వతహాగా తమిళురాలు. ‘మహానటి’ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమాలాగే చూసిందామె. మా అమ్మను నాన్న అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. నాకు కమల అక్కకు మధ్య ఈ సినిమా వల్ల విభేదాలు రావాలని నేను కోరుకోవట్లేదు’’ అని చాముండేశ్వరి అన్నారు.
ఆ కుటుంబాన్ని దూరం చేసుకోలేను..
తన తల్లి సావిత్రికి తండ్రే మద్యం అలవాటు చేశాడన్నది నిజం కాదని.. సినీ పరిశ్రమలో మద్యం తాగడం మామూలు విషయమని.. అలా తన తల్లికి కూడా అలవాటై ఉండొచ్చని.. ఐతే సినిమాలో తన తండ్రి తాగినపుడే తల్లి కూడా మద్యం తాగినట్లు చూపిస్తారని.. అలాగే ఆమె అలా తాగడం అదే తొలిసారని కూడా చెప్పలేదనే విషయాన్ని చాముండేశ్వరి గుర్తు చేశారు. తన తండ్రి నుంచి తనకు దక్కిన అతి పెద్ద ఆస్తి తన పెద్దమ్మ కుటుంబమే అని.. తన అక్కలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనన్నారు.. సినిమాలో అలిమేలుగా చూపించిన తన పెద్దమ్మ (బాబ్జీమా) తమకెంతగానో అండగా నిలిచిందని.. తన తండ్రి కుటుంబం మీద తనకు అపారమైన గౌరవం ఉందని.. అది కూడా తన కుటుంబమే అని చాముండేశ్వరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment