Chamundeswari
-
రాష్ట్రపతిగారూ మైసూరు దసరాకు రారండి!
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దసరా మహోత్సవ సమితి ఆహ్వానం పలికింది. గురువారం ఇన్చార్జ్ మంత్రి ఎస్.టి.సోమశేఖర్, ఎంపీ ప్రతాపసింహ, మంత్రి శశికళ జొల్లె తదితరులు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలిని ఆహ్వానించారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.45 గంటల నుంచి 10.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో చాముండిబెట్ట పైన ఉన్న చాముండేశ్వరి దేవి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా ఉత్సవాలకు నాంది పలుకుతారు. కాగా దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనుండడం ఇదే మొదటిసారి. సాధారణంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా సంబరాలకు శ్రీకారం చుట్టేవారు. వారంపాటు సాంస్కృతిక ప్రదర్శనలు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో బృహత్ వేదికపై సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు వారంపాటు వైభవంగా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నృత్య, గాన తదితర రంగాల కళాకారులు పాల్గొని ఆహూతులను అలరిస్తారు. 26న సీఎం బొమ్మై ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు. ఫల పుష్ప ప్రదర్శన మైసూరు వర్సిటీ ఉద్యాన వన విభాగం ఆధ్వర్యంలో 26 నుంచి ఫల పుష్ప ప్రదర్శన కనువిందు చేయబోతోంది. నగరంలోని కుక్కరహళ్లి చెరువు వద్ద ఏర్పాటవుతుంది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. దీనికి తోడు ప్యాలెస్ ఆవరణలోనూ ఫల పుష్ప అలంకరణ నిర్వహిస్తారు. త్వరలో 3 స్పెషల్ రైళ్లు మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే యాత్రికుల కోసం రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సెపె్టంబరు 30వ తేదీన చామరాజనగరకు రాకపోకలు సాగించే రైలు సర్వీసు ఆరంభమవుతుంది. అలాగే అక్టోబరు 5వ తేదీన బెంగళూరుకు రెండు రైలు సర్వీసులను ఆరంభిస్తారు. కాగా, చాముండి కొండ పైన ఉన్న మహిష విగ్రహం వద్ద సెపె్టంబర్ 25వ తేదీన మహిష దసరాను నిర్వహిస్తామని మాజీ మేయర్ పురుషోత్తం తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈసారి ఎవరు అడ్డుకున్నా జరిపి తీరుతామని అన్నారు. (చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనపై సుప్రీం) -
పెళ్లాడు.. ప్రేమించు
‘ప్రేమించు పెళ్లాడు’ రాజేంద్రప్రసాద్ హిట్ సినిమా. ‘పెళ్లాడు ప్రేమించు’.. ఇది సినిమా కాదు... రాజేంద్రప్రసాద్ లైఫ్ మూవీ! అవును.. సినిమాలే లైఫ్ అనుకున్న ఈ నట కిరీటి మొదట పెళ్లాడారు. తర్వాత.. పెళ్లాడినావిణ్ని ప్రేమాడారు. ‘అప్పు.. డే’ తెల్లారిందా అంటారీయన ‘అప్పుల అప్పారావు’ చిత్రంలో. ఎంతసేపు మాట్లాడినా.. మాటలింకా బాకీ ఉన్నట్లే అనిపించింది ఈ దంపతులతో కూర్చున్నంతసేపూ!! ఈ ఇంటర్వ్యూ చదివితే.. మీ లైఫ్ పార్ట్నర్తో మీరు మరింత ‘కేరింగ్’గా ఉండటం ఖాయం. మీ ఆవిడ పేరు విజయ చాముండేశ్వరి అనే విషయం తప్ప మీది లవ్ మ్యారేజా? ఎరేంజ్డా అనే విషయాలు చాలామందికి తెలియదు. అసలు మీ పెళ్లి ఎలా కుదిరింది? ఎప్పుడు? రాజేంద్రప్రసాద్: తనకీ నాకూ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మా చిన్నప్పుడే మేం అమ్మని కోల్పోవడం. మా ఇద్దరి ప్రేమ వయసు వల్లో లేకపోతే ప్యాషన్ వల్లో ఏర్పడింది కాదు. ‘కేరింగ్’ వల్ల. ఒకరి మీద ఒకరికున్న కేరింగ్ వల్ల మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది. చాము (భార్యని రాజేంద్రప్రసాద్ అలానే పిలుస్తారు) రమాప్రభగారి అక్క కూతురు. నేను రమాప్రభగారి ఇంటికి తరచూ వెళ్లేవాణ్ణి. చాము నాకు భోజనం పెట్టేది. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నది ఎందుకు నమ్మాలంటే రమాప్రభగారింటికి వెళ్తే ‘చామూనే నా భార్య’ అనే ఫీలింగ్ ఏర్పడేది. మరి.. నేను అడగడమేంటో.. వాళ్లు బెజవాడ వచ్చి మా నాన్నను అడగడం ఏంటో.. చేస్తే తప్పేంటి? అని ఆయన అనడం ఏంటో.. పెళ్లి అయిపోవడం ఏంటో? అన్నీ చకచకా జరిగిపోయాయి. 1980 సెప్టెంబర్ 5న మా పెళ్లి జరిగింది. చాముండేశ్వరి: మా పెళ్లి చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుళ్లో జరిగింది. ఆ తర్వాత వాణీ మహల్లో రిసెప్షన్ జరిగింది. మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? చాముండేశ్వరి: ఆయనే. రాజేంద్రప్రసాద్: వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడల్లా బాగా దబాయించేవాణ్ణి. డామినేట్ చేసేవాణ్ణి. ‘ఏంటయ్యా నువ్వు అలా దబాయిస్తావు. తనేమైనా నీ పెళ్లామా?’ అని వాళ్ల అమ్మమ్మ అనేది. దాంతో ‘నిజమేనేమో... నాకోసమే తనని దేవుడు పంపించాడేమో’ అనుకునేవాడ్ని. అలాగే పిల్ల ఎర్రగా బుర్రగా బావుంది అనుకున్నాను. ఓ రోజు డైరెక్ట్‌గా వెళ్లి ‘పెద్దావిడ అలా అంటోంది. నీకు ఓకేనా’ అని అడిగాను. ఓకే అంది. దబాయించినప్పుడు లైఫ్ మొత్తం ఇలాంటి దబాయింపులు ఉంటాయేమోననే భయం ఏమైనా? చాముండేశ్వరి: మేం ఇష్టపడ్డాం. పెద్దవాళ్లు అరేంజ్ చేశారు. రమాప్రభగారు బాగా సపోర్ట్ చేశారు. నిజానికి ఆయన ఎక్కువగా రమాప్రభగారినే దబాయించేవారు. ఆవిడేమో ‘నువ్వేంట్రా నీ బాధేంట్రా’ అన్నట్టు›ఈయన్ను చూసేవారు. రాజేంద్రప్రసాద్: రమాప్రభగారు నన్ను తమ్ముడిలా చూసుకునేవారు. ఓసారి ఫంక్షన్ పని మీద విజయవాడ వచ్చి, మీ ఇంటికి తీసుకెళ్లు అన్నారామె. ఇంటికి వెళ్లాక చాము, నా పెళ్లి గురించి డైరెక్ట్‌గా నాన్నగారిని అడిగేశారు. మా నాన్నగారు షాక్. మా పెద్దబ్బాయిని కూడా అడగాలన్నారు. ఇప్పుడేదో ఇన్నిన్ని మాట్లాడుకుంటున్నారు కానీ మేం ఒక్క రూపాయి కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. అయితే పెళ్లిరోజు శరత్‌బాబుగారు గోల్డ్ వాచ్, గోల్డ్ బ్రాస్లెట్ తీసుకొచ్చి పెళ్లి కదా వేసుకుంటే బావుంటుంది అన్నారు. వేసుకుంటే బావుంటుందా తీసుకుంటే బావుంటుందా అన్నాను. తీసుకొని వేసుకో అన్నారు. అప్పటికి గర్వమో, పొగరో తెలియదు కానీ తీసుకోలేదు. పోనీ.. పంచె, చొక్కా అయినా తీసుకోండి అన్నారు. అది తీసుకున్నాను.. సంప్రదాయం కదా. తాళిబొట్టు మావాళ్లు తీసుకున్నారు. అంతే.. ఏమీ తీసుకోకుండా జీవితాంతం కేరింగ్‌గా చూసుకోవాలనుకున్నాను. విజయ చాముండేశ్వరి: వాళ్లు మమ్మల్ని ఏమీ అడగలేదు. మేం వాళ్లను ఏమీ అడగలేదు. ప్రేమ చాలా రకాలు. ఆకర్షణలో పడి ప్రేమగా మారడం, స్నేహం ప్రేమగా మారడం, తొలి చూపులోనే ప్రేమ పుట్టడం... ఇలా. అయితే ‘కేరింగ్’తో మొదలయ్యే ప్రేమ వీటిన్నింటికన్నా బలంగా ఉంటుందంటారా? రాజేంద్రప్రసాద్: అవునని నా అభిప్రాయం. జనరల్‌గా ముందు ప్రేమలో పడి, ఆ తర్వాత కేర్ మొదలవుతుంది. మా ప్రేమ ‘కేరింగ్’తోనే మొదలైంది. మేం ప్రేమ కబుర్లు చెప్పుకున్నది లేదు. ‘ఈ అమ్మాయి మన జీవితంలోకి వస్తే బాగుంటుంది.. వచ్చాక జాగ్రత్తగా చూసుకోవాలి’ అనే ఫీల్‌తో మొదలైన ప్రేమ. తనకూ అదే ఫీల్. ఇలా ఒకరి ‘కేరింగ్’ గురించి ఇంకొకరు ఆలోచించుకునే ప్రాసె స్లో మొదలైన మా ప్రేమ చాలా బలమైనది. తెరపై నవ్వులు పంచే స్టార్ మీవారు. మరి.. రియల్ లైఫ్‌లో ఆయనకు కోపం వస్తుందా? రాజేంద్రప్రసాద్: ఎప్పుడైనా కోపం వస్తే ‘మీరు నటుడైతే అవ్వొచ్చు కానీ నన్ను పెళ్లి చేసుకున్నాకే పెద్ద స్టార్ అయ్యారు గుర్తుపెట్టుకోండి’ అంటుంది ఆవిడ. అక్కడ మనం కాస్త తగ్గాల్సి వస్తుంది. చాముండేశ్వరి: ఆయనకు భయంకరమైన కోపం వస్తుంది.. అప్పుడు కోపం తగ్గించుకోండి... మీకు చెడ్డ పేరు వస్తుంది అంటాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. కేరింగ్ నుంచి పుట్టిన ప్రేమ పెళ్లిదాకా వచ్చింది. మరి.. వైవాహిక జీవితం తర్వాత మీ గురించి ఆవిడ తీసుకున్న కేర్ గురించి? రాజేంద్రప్రసాద్: ఒక స్ట్రగుల్లో ఇద్దరం కలిశామేమో? అయినా కష్టం అనేది నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆవిడ కష్టం అనే మాటనే కొట్టిపారేస్తుంది. కష్టం అనేది ఎందుకు వస్తుంది? మనల్ని మనం నిరూపించుకోవడానికి వస్తుంది. నిరూపించుకోండని చెబుతూ నాలో స్ఫూర్తి నింపుతుంది. సహాయనటుడిగా ఏడాదికి 24 సినిమాలు, హీరోగా 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంవల్ల 365 రోజుల్లో 360 రోజులు నేనింట్లో ఉండటానికి కుదేరిది కాదు. అప్పుడు ఇంటి బాధ్యత తనే తీసుకుంది. ఒక్కరోజు కూడా ఆ బాధ్యత తాలూకు కష్టాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేదు. సక్సెస్ అయినా నాకు పొగరు రాకుండా చూసింది కూడా ఈవిడే. ఇప్పుడు కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ అంటా అని షేక్ హ్యాండ్ ఇస్తే ‘సరే. నెక్ట్స్ సినిమా ఏంటి?’ అని అంది. తను చాలా ప్రాక్టికల్. ఇది చేస్తే ఇది జరుగుతుంది.. అది జరుగుతుందని ఇప్పుడే టెన్షన్ పడటం దేనికి? అంటుంది. అలా టెన్షన్‌ని తీసిపారేస్తుంది. 365 రోజుల్లో 360 రోజులు షూటింగ్ చేస్తూ బిజీగా ఉండటంవల్ల తండ్రికి, పిల్లలకు ‘కమ్యూనికేషన్ గ్యాప్’ ఏర్పడే అవకాశం ఉందేమో... చాముండేశ్వరి: అవును. పిల్లలకు ఎక్కువ టైమ్ కేటాయించలేదనే చిన్న బాధ ఆయనకు ఉంటుంది. నాకంటే కూడా పిల్లలు ఎక్కువ ఫీల్ అవుతారు. ఆయనతో ఎక్కువగా మాట్లాడరు. ‘వెళ్లి మాట్లాడండిరా’ అంటే అప్పుడు పెద్దగా మాట్లాడేవాళ్లం కాదు కదా. ఇప్పుడేం మాట్లాడాలి అంటారు. రెండుమూడు నెలలు పిల్లల్ని చూడకుండా షూటింగ్ చేసిన రోజులున్నాయి. రాజేంద్రప్రసాద్: నా జీవితంలో బాధపడదగ్గ విషయం అది. అవుట్డోర్ షూటింగ్‌ల్లో ఉన్నప్పుడు, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు బాధపడి ఉంటానో లెక్కేలేదు. జీవితం చేతివేళ్లలానే. అన్ని వేళ్లూ ఒకేలా ఉండాలంటే కుదరదు. ఒకటి తక్కువ.. ఒకటి ఎక్కువ ఉండాల్సిందే. దేవుడు సృష్టి అది. కెరీర్ ఎక్కువగా ఉంది కాబట్టి.. పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్సయ్యాను. నేను ఇప్పుడు పిల్లలతో ‘ఇలా వచ్చి కూర్చుని సరదాగా మాట్లాడొచ్చు కదా’ అంటుంటాను. ఇన్నేళ్లు ఇలా అలవాటుపడ్డారు. ఇప్పుడు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను, చాము ఒక డెసిషన్కి వచ్చాం. అదేంటయ్యా అంటే ‘ఇక ఈ జన్మకింతే’ అని. ఇప్పుడు ఆ బాధ అంతా మా మనవరాలితో తీర్చుకుంటున్నాను. చాముండేశ్వరి: మా అమ్మాయి ‘నాన్న మాతో ఎప్పుడూ ఇలా సరదాగా లేరు. మనవరాలితో హ్యాపీగా ముచ్చట్లు చెబుతున్నారు’ అంటుంది. అప్పుడు అంత తీరిక లేదు.. ఇప్పడు కాస్త తీరిక దొరుకుతోంది అంటాను. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయింపబడతాయన్నారు. మీ ఫ్యామిలీ లైఫ్ ‘హెవెన్’ అనుకోవచ్చా? రాజేంద్రప్రసాద్: అంతే. 1982లో వైకుంఠ ఏకాదశి రోజున మా పెద్దబ్బాయి బాలాజీ పుట్టాడు. 85లో విజయదశమి రోజున గాయత్రి పుట్టింది. పెళ్లయ్యాక నేను ఆర్టిస్ట్‌గా పెరిగా. బాలాజీ పుట్టాక బిజీ ఆర్టిస్ట్ అయ్యాను. గాయత్రి పుట్టాక హీరో అయ్యాను. అందుకే నా భార్య, నా ఇద్దరు పిల్లలు నా జీవితంలో సమ్‌థింగ్ స్పెషల్. నటుడిగా ఐయామ్ హ్యాపీ. ఫ్యామిలీ మేన్గానూ హ్యాపీ. భార్యాపిల్లలు తన లైఫ్‌లో సమ్‌థింగ్ స్పెషల్ అన్నారు రాజేంద్రప్రసాద్‌గారు. మరి మీరు? చాముండేశ్వరి: ఏడాది మొత్తం షూటింగ్స్‌తో గడిపేసేవారు. అయినా ఏనాడూ ఫ్యామిలీకి ఏ లోటూ చేయలేదాయన. ఎప్పుడైనా మేం మిస్సవుతున్నాం అంటే పిల్లల్ని తీసుకొని లొకేషన్‌కు రమ్మనేవారు. ఓసారి మా పక్కింటి ఆవిడ మా పనివాళ్లతో నన్ను ఉద్దేశించి, ‘ఆవిడ రాజేంద్రప్రసాద్‌గారి రెండో భార్యా? అని అడిగింది. ఆ విçషయం నాతో చెబితే ‘అవును అనకపోయావా’ అన్నాను. ఆవిడ అలా అనుకోవడానికి కారణం ఉంది. ఉదయం నుంచి రాత్రివరకూ ఎక్కడో షూటింగ్లో ఉండేవారాయన. రాత్రి ఫ్లయిట్‌కి వచ్చి మర్నాడు మార్నింగ్ ఫ్లయిట్‌కి వెళ్లిపోయేవారు. రాజేంద్రప్రసాద్: నేను షూటింగ్లో ఉంటే, ఫోన్ చేసి ‘పక్కింటావిడ ఇలా అడిగింది. కావాలంటే ఇంకో పెళ్లి ట్రై చేసుకోండి’ అంది. నీతోనే చస్తున్నాను అని నవ్వేశాను. చాముండేశ్వరి: మేం హైదరాబాద్ వచ్చాక కూడా మా పిల్లల్ని మీరు మొదటి భార్య పిల్లలా? రెండో భార్య పిల్లలా? అని కొందరు అడిగారు. రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ బాగుంటుంది. ఆయన నటించిన సినిమాల్లో మీకు నచ్చినవి? రాజేంద్రప్రసాద్: అందరూ నన్ను కామెడీ కింగ్ అంటారు. తనకేమో నా కామెడీ నచ్చదు. చాముండేశ్వరి: అవును. అయితే ఆయన చేసిన ‘ఎర్ర మందారం, ఆ నలుగురు’ సినిమాలు ఇష్టం. ఆ సినిమాల్లో ఆయన యాక్టింగ్ అద్భుతం. రాజేంద్రప్రసాద్: నా కామెడీని ఇష్టపడేవాళ్లు మన ఇంటి మీదకు వస్తారు జాగ్రత్త (నవ్వుతూ). తెరపై కామెడీ చేసే మీరు బయట కొంచెం కఠినమేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజమా? రాజేంద్రప్రసాద్: మా నాన్న స్కూల్ టీచర్. దానివల్ల ఇంట్లో వాతావరణం సీరియస్‌గా ఉండేది. నాక్కూడా అదే వచ్చిందేమో. జీవితంలో దేని మీదా కచ్చితమైన అభిప్రాయంతో ఉండొద్దు. ఉంటే... కుంగిపోయే చాన్స్ ఉందని చామూ చెబుతుంది. పెళ్లయ్యేనాటికి ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటి? రాజేంద్రప్రసాద్: పెళ్లయ్యే రోజుకి నా సంపాదన ‘సున్నా’. ఫుడ్ కోసం డబ్బింగ్‌లు అవీ చెబుతుండేవాణ్ణి. అలా అని ఇంటి దగ్గర ఏం లేకపోవడం కాదు. మా పెద్దన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్. తన దగ్గర డబ్బులు తీసుకుని ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని కొన్ని డబ్బులు తీసుకున్నాను. ‘సినిమాలు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెద్దాయన (ఎన్టీ రామారావుగారు) వెనక తిరుగుతున్నావు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అయినా అన్నయ్య దగ్గర నెలకు ఐదువందలు తీసుకుంటున్నావట. తాగి తందనాలు ఆడుతున్నావా?’ అన్నారు మా నాన్నగారు. అలిగి మద్రాస్ వెళ్లిపోయాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకూ ఎవరి దగ్గరా రూపాయి తీసుకోలేదు. నా పర్సనాలిటీకి వెంటనే వేషాలు వచ్చే చాన్స్ లేదు. పుండరీకాక్షయ్యగారి దయవల్ల ‘మేలుకొలుపు’ అనే సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పాను. అతను తమిళ హీరో. తనకి రకరకాల వాయిస్‌లు ట్రై చేశారు. ఆఖరికి యస్. జానకిగారితోనూ చెప్పించారు. కుదర్లేదు. అప్పటికి నా ప్రయత్నాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అందరినీ చివరిసారి కలుద్దామని పుండరీకాక్షయ్యగారి ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన ‘ఇంట్లో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకు తున్నానే’ అని డబ్బింగ్ థియేటర్‌కి తీసుకువెళ్లారు. ఫట్‌మని డైలాగ్ చెప్పేశాను. అప్పటికి సరిగ్గా భోజనం చేసి మూడు నెలలుపైనే అయింది. ఏం కావాలి? అని ఆయన అంటే, ‘భోజనం పెడితే చాలు. డబ్బింగ్ చెబుతా’ అన్నా (చెమర్చిన కళ్లతో). ‘నీకు బుద్ధి ఉందా? భోజనం మానేయడం ఏంటి? నాన్న తిడితే ఏం? అని’ మందలించారు. ఆ రోజు నుంచి ఏ హీరోకి పడితే ఆ హీరోకి డబ్బింగ్ చెప్పేవాణ్ణి. డబ్బింగ్ చెప్పడంతో వచ్చిన డబ్బుతో చైన్నైలో ఇల్లు కూడా కట్టాను. మీ ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా...? చాముండేశ్వరి: ఆయన ప్రతిదీ సమస్యగా చూస్తారు. సమస్య కాదిది.. జీవితం అంటాను నేను. ఈ సమస్య రాకపోతే మీ సామర్థ్యం ఎలా తెలుస్తుంది? అంటాను. మా ఇద్దరి ఆలోచనా విధానాలు రెండు ధోరణులు. రాజేంద్రప్రసాద్: ఆలోచనల గురించి పక్కన పెడితే ఇన్నేళ్లు పని చేసినా, ఇంత రిలాక్డ్స్‌గా, ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నానంటే తనే కారణం. నటుడిగా నవ్వించే రాజేంద్రప్రసాద్‌గారు వృత్తిపరమైన ఆటుపోట్లను సీరియస్‌గా తీసుకుంటారా? చాముండేశ్వరి: చాలా ఫీల్ అవుతారు. ఓసారి జస్ట్ నాలుగైదు నెలలు సినిమాలకు బ్రేక్ వచ్చింది. అప్పుడు టెన్షన్ పడ్డారు. ‘ఈ గ్యాప్కే కంగారుపడితే ఎలా? ఈజీగా తీసుకోవాలి?’ అన్నాను. రాజేంద్రప్రసాద్: ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ ముందు ఆ గ్యాప్ వచ్చింది. అప్పుడు రాధిక, కుట్టి పద్మిని నా కోసం సీరియల్స్ రెడీ చేసి, మా ఇంటికి వచ్చి, ‘చామూ.. ఇప్పుడు సీరియల్స్ వేవ్ బాగుంది’ అని అడ్వాన్స్ చెక్ ఇచ్చి వెళ్లారు. నేను ఇంటికొచ్చాక ‘మీతో పెద్ద సీరియల్ ప్లాన్ చేశారట. చేస్తే పోతుందన్నారు’ అని చెప్పింది. కానీ నా జీవితాన్ని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చెప్పేది ఏంటంటే.. నేనొక పాయింట్ మీద సీరియస్‌గా బాధపడ్డానంటే ఆ తర్వాత ఏదో గొప్పది జరుగుతుంది. అప్పుడు వచ్చినదే ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. ఆ సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశా. అయితే ఇక హీరోగా మనం డ్యూయట్లు పాడటానికి, ఫైట్లు చేయడానికి పనికి రాము, ఇది కరెక్ట్ కాదని అర్థమైంది. అప్పుడు సీరియస్‌గా ఆలోచిస్తున్న టైమ్‌లో వచ్చిన సినిమా ‘ఆ నలుగురు’. ఆ సినిమాతో నటుడిగా నా గౌరవం పది రెట్లు పెరిగింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యాను. మీకు నట వారసులు లేరనే ఫీలింగ్? చాముండేశ్వరి: మా అబ్బాయి బాలాజీ హీరో కాలేదనే బాధ ఉంది. అయితే మా మనవరాలు (కూతురు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని) ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మా అబ్బాయి పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ... ‘ఎఫ్ 2’లో భర్త పాత్ర భార్య ఏమన్నా ‘అంతేగా’ అని తలూపుతుంది.. మరి మీవారు? చాముండేశ్వరి: ఆయనేం అలా కాదు. నేను అంతేగా.. అంతేగా టైపు భార్యని. రాజేంద్రప్రసాద్: అంతేగా.. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఒకరంటే ఒకరికి ‘కేరింగ్’ ఉంది. అంతేగా చామూ.. అంతేగా. – డి.జి. భవాని ‘ఇలా డ్రెస్ చేసుకో బాగుంటుంది’ అని మీవారు చెబుతారా? చాముండేశ్వరి: ఆయనకు కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. ఇదిగో ఈ ఇంటర్వ్యూకి ఈ బ్లూ, పింక్ కాంబినేషన్ శారీ కట్టుకోమన్నది ఆయనే. మీకు చీరలు కొని తెస్తుంటారా? తెస్తారు. కేరళ వెళ్లినప్పుడు అక్కడి ఫేమస్ చీరలు తెస్తారు. ఇంకా ఎక్కడికెళితే అక్కడి చీరలు తెస్తుంటారు. మీ ఆవిడ టేస్ట్‌కి తగ్గట్టు కొంటారా? రాజేంద్రప్రసాద్: నా టేస్ట్‌కి తగ్గట్టే కొంటా. తనకు నచ్చేవి తెచ్చినప్పుడు కాంప్లిమెంట్స్.. లేకపోతే... ఇక చెప్పేదేముంది? మీకో విషయం తెలుసా.. మా ఆవిడ మంచి టైలర్. మీవారికి షర్టులు కుడుతుంటారా? చాముండేశ్వరి: లేదండీ.. నాకు లేడీస్‌కి మాత్రమే కుట్టడం వచ్చు. మా ఆయన కూడా లేడీస్ టైలరే.. రాజేంద్రప్రసాద్: అవునవును.. సినిమాలో లైడీస్ టైలర్నే కదా (నవ్వుతూ). బాగా ఇష్టపడి తినే వంటలు ఏంటి? చాముండేశ్వరి: ఆయనకు రోటిపచ్చళ్లు ఉంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు. రాజేంద్రప్రసాద్: మా అమ్మగారు చనిపోయేటప్పుడు ‘వాడికి రోటి పచ్చళ్లు ఇష్టం. అవి చేసి పెట్టండి’ అని మా పెద్దక్కయ్యతో అన్నారట. మా ఆవిడది మదనపల్లి సైడ్. ఆకు కూరలు, పుల్ల కూరలని వీళ్ల స్టైల్ కూరలు వేరే ఉంటాయి. చాముండేశ్వరి: నేను రోటి పచ్చళ్లు నేర్చుకున్నాను కానీ పాలకూరలు నేర్చుకోలేకపోయా. పాలకూరలన్నీ ఆయనే వండుతారు. రాజేంద్రప్రసాద్: మా పెద్దక్కయ్య దగ్గర పాలకూరలు నేర్చుకున్నాను. షూటింగ్ లేకపోతే ‘ఇవాళ పాలకూర’ చేయండి అని అడుగుతారు. ఒక్కోసారి నేనే అడిగి మరీ బీరకాయ పాలకూర, సొరకాయ పాలకూర చేస్తాను. చాముండేశ్వరి: చాలా బాగా చేస్తారు. -
సోదరి అభ్యంతరాలపై స్పందించిన సావిత్రి కూతురు
‘మహానటి’ విషయంలో జెమిని గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తక్కువ చేసి చూపించారని, ఇంకా ‘మహానటి’ టీంపై ఆమె పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు. ‘‘నా దృక్కోణంలో.. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కోణంలో ‘మహానటి’ సినిమా చూశా. నా సోదరి కమల మరో కోణంలో సినిమా చూశారు. ఆమె స్వతహాగా తమిళురాలు. ‘మహానటి’ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమాలాగే చూసిందామె. మా అమ్మను నాన్న అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. నాకు కమల అక్కకు మధ్య ఈ సినిమా వల్ల విభేదాలు రావాలని నేను కోరుకోవట్లేదు’’ అని చాముండేశ్వరి అన్నారు. ఆ కుటుంబాన్ని దూరం చేసుకోలేను.. తన తల్లి సావిత్రికి తండ్రే మద్యం అలవాటు చేశాడన్నది నిజం కాదని.. సినీ పరిశ్రమలో మద్యం తాగడం మామూలు విషయమని.. అలా తన తల్లికి కూడా అలవాటై ఉండొచ్చని.. ఐతే సినిమాలో తన తండ్రి తాగినపుడే తల్లి కూడా మద్యం తాగినట్లు చూపిస్తారని.. అలాగే ఆమె అలా తాగడం అదే తొలిసారని కూడా చెప్పలేదనే విషయాన్ని చాముండేశ్వరి గుర్తు చేశారు. తన తండ్రి నుంచి తనకు దక్కిన అతి పెద్ద ఆస్తి తన పెద్దమ్మ కుటుంబమే అని.. తన అక్కలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనన్నారు.. సినిమాలో అలిమేలుగా చూపించిన తన పెద్దమ్మ (బాబ్జీమా) తమకెంతగానో అండగా నిలిచిందని.. తన తండ్రి కుటుంబం మీద తనకు అపారమైన గౌరవం ఉందని.. అది కూడా తన కుటుంబమే అని చాముండేశ్వరి పేర్కొన్నారు. -
కమల సెల్వరాజ్ వ్యాక్యలకుపై స్పందించిన సావిత్రి కూతురు
-
అమ్మ మళ్లీ పుట్టింది
పునరపి జననం. పునరపి మరణం. జీవితం ఒక చక్రం. మన చేతిలో గీతల్లాగే కాలచక్రంలోనూ గీతలుంటాయి. వేగంగా తిరుగుతున్న చక్రం మధ్యలో మసక కనపడుతుంది. చక్రం ఆగినప్పుడే ఆ గీతలు కనపడతాయి. సావిత్రి జీవితం చక్రంలా తిరిగినన్ని రోజులు మసకే కనిపించింది. అది ఆగినప్పుడే ఆ గీతల కొలతలు మొదలయ్యాయి. ‘మహానటి’ సినిమా.. లేని గీతలు చెరిపేసి, మిగతా గీతలను రాయి మీద గీసింది. మహానటి ఒక మహా నిజం చెప్పింది. సావిత్రి మళ్లీ పుట్టింది... అంటోంది విజయ చాముండేశ్వరి. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సుమారుగా 30కోట్లతో నిర్మించిన ఈ సినిమా బిజినెస్ బాగుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా శాటిలైట్ రైట్స్ సుమారు 20 కోట్లపైగా పలుకుతున్నాయని సమాచారం. ఇక సినిమా టోటల్ షేర్ 75కోట్లకు చేరుకుటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘మహానటి’ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా..సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరీతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది ? నాకు టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లి వచ్చినట్టుగా అనిపించింది. అమ్మతో పాటు మళ్లీ కొన్నాళ్లు జీవించినట్టుగా అనిపించింది. తల్లిని పిల్లలు అలా తెర మీద చూసుకునే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? చాలా హ్యాపీగా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే ఇచ్చిన మాట తప్పకుండా ఒక సెలబ్రేషన్‌లా చూపిస్తాం సావిత్రిగారిని అన్న మాటను టీమ్ నిలబెట్టుకున్నారు. నిజంగానే సెలబ్రేషన్‌లా ఉంది సినిమా. ఉదయమే అశ్వనీదత్‌గారు ఫోన్ చేసి రెండు రోజుల నుంచి ఇంట్లో పెళ్లిలా ఉందమ్మా రెస్పాన్స్ చూస్తుంటే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ వల్ల అమ్మ మళ్లీ పుటింది అని అంటే.. లేదమ్మా అమ్మ వచ్చి మా పిల్లలందరితో సినిమా చేయించుకుంది అన్నారు దత్‌గారు. ఎక్కడా తప్పులు ఉన్నట్టుగా అనిపించలేదా? అస్సలు ఎక్కాడా అనిపించలేదు. వాస్తవాన్ని చూపించటం కూడా చాలా క్లాస్‌గా చూపించారు. అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో ఎవరెవరివో పేర్లు బయటకు చెప్పడం మాకు ఇష్టం లేదు. అందుకే జనరల్‌గా ఎవరో వచ్చి నగలు తీసుకు వెళ్లినట్టు ఎవరో ఆస్తిని సైన్ చేసుకున్నట్టు చూపించారు. కానీ పేర్లు ప్రస్థావించలేదు. ఆ నగల మూట సంఘటన మీకు గుర్తుందా? అది నాకు కళ్లకు కట్టినట్టుగా గుర్తు. స్కూల్ నుంచి వచ్చాను. బెడ్ మీద మూటలు ఉన్నాయి. ఎగ్జాజిరేషన్ అనుకుంటారు. బెడ్ మీద చాకలి మూట వేసినట్టుగా అన్ని నగలు మూట కట్టుకొని భుజాన వేసుకొని తీసుకొని వెళ్లిపోయేవారు. ఇన్కమ్ టాక్స్ వాళ్లు కూడా తీసుకొని వెళ్లారు కదా. అలా తీసుకువెళ్లి పోయినా మళ్లీ అమ్మ నగలు చేయించుకుంది. అయితే అన్ని కష్టాల్లో కూడా ఎవరైనా సహాయం కావాల్సి వస్తే చేసేది. అమ్మ చేతిలో ఏదీ ఆగదు. అన్నీ ఇచ్చేయటమే. పట్టు చీర అమ్మి మరీ ఇతరులకు డబ్బులు సహాయం చేశారా? పట్టు చీరలు , అవార్డ్స్ అమ్మారు. ఏదీ ఎగ్జాజిరేట్ చేయలేదు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఈ రెండు లక్షలు నేను సతీష్ (మీ తమ్ముడు) కోసం దాచాను. ఇవి మాత్రం ఎవ్వరికీ ఇవ్వను’ అని. సో ఫైనల్‌గా అమ్మ వెళ్లిపోయేటప్పటికి మిగిలింది ఆ రెండు లక్షలేనా? నంబర్‌గా సరిగ్గా చెప్పలేను. అమ్మ చెప్పింది క్యాష్ మాత్రమే. అమ్మ పోయేటప్పటికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు చైన్నై హబీబుల్లా రోడ్లో ఒక ఇల్లు. కొడైకెనాల్లో ఒక ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా ఏమీ లేకుండా పోయింది అని అంటే నేను ఒప్పుకోను. తమ్ముడికి నాకు వచ్చింది పంచుకున్నాము. ఆ తర్వాత తమ్ముడు ‘నేనిక్కడ ఉండను అక్కా వెళ్లిపోతాను’ అన్నాడు. తన వాటా అమ్మేసి యూఎస్ వెళ్లిపోయాడు. మీరు ఇప్పుడు హబీబుల్లా రోడ్లోనే ఉంటున్నారా? అక్కడే ఉండేవాళ్లం. రెండు సంవత్సరాల క్రితమే ఆ ఇల్లు అమ్మేసి ఎగ్మూర్‌కి వచ్చేశాం. అక్కడ ఉండటం కష్టంగా ఉంది. అక్కడ ఉంటే అమ్మ గురించే మనసు లాగుతుంది. సెంటిమెంట్‌గా అక్కడే ఉండాలి అని అంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి ఎగ్మూర్‌లో మంచి అపార్ట్మెంట్కి వచ్చాం. చెప్పుకోవల్సిన అవసరం ఉంది. 2,650 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. నయనతార, దర్శకుడు అట్లీ ఉండే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. అమ్మ ఏమీ లేకుండా పోయింది అనుకుంటున్నారు. మమ్మల్ని చూసైనా మీరు ఆ అభిప్రాయం మార్చుకోవాలి. చేతిలో క్యాష్ లేకపోవడంతో అవస్థ పడ్డారు అమ్మ. ఆస్తుల నుంచి క్యాష్ చేసుకోవడం అమ్మకు తెలియలేదు. సినిమా స్టార్టింగ్‌లో హాస్పిటల్లో సావిత్రి గారిని బయట కింద పడిలోబెట్టినట్టు చూపించారు. అదీ నిజమేనా? నిజమే. హాస్పిటల్‌కి వెళ్ళగానే స్ట్రెచర్ మీద పడుకోబెడతారు కదా. మన కోసం రూమ్స్ అన్నీ ఖాళీగా ఉండవు కదా. సినిమాలో స్క్రీన్‌ప్లే కోసం అలా బయట కింద పడుకోబెట్టారు. రూమ్ కోసం ఎదురు చూసే ఆ సమయంలో జరిగిన సంఘటన అది. అది కర్ణాటక అయ్యేసరికి వాళ్లు గుర్తించటానికి కొంచెం సమయం పట్టింది. వేరే అమ్మాయితో జెమినీ కనిపించగానే సావిత్రిగారు హర్ట్ అయ్యి జెమినీని దూరంపెట్టేసినట్టు సినిమాలో చూపించారు. నిజంగానే దూరంపెట్టారా? రానివ్వలేదు. అసలు రానిచ్చేవారు కాదు అమ్మ. నాన్న కొన్నిసార్లు గోడ దూకి కూడా వచ్చేవాళ్లు. షూట్ చేశారు కానీ లిమిటెడ్ టైమ్ కాబట్టి ఎడిటింగ్‌లో తీసేశారు. అమ్మ చుట్టు ఉండే బంధువులు నాన్నను రానివ్వలేదు. కొన్ని విషయాలు అమ్మ దగ్గర దాచేశారు కూడా. జెమినీగారు గోడ దూకి రావటానికి ప్రయత్నించారన్న విషయాన్ని కూడా తెలియకుండా చేశారా? ఆయన కూతురని చెప్పడం కాదు కానీ అందరూ కలిసి నాన్నను విలన్ చేశారు. ఆయన క్యారెక్టర్ కరెక్ట్‌గా చూపించారు సినిమాలో. నాన్నగారు అమ్మని చాలా ప్రేమించారు. తర్వాత ఆయన కూడా తాగటం మొదలెట్టారు. నాన్నగారి దగ్గరకు మీరు వెళ్లేవారా? మేం వెళ్లటం రావడం బాగానే జరిగాయి. ఆ విషయంలో ఏ అబ్జక్షన్ పెట్టలేదు. ఆవిడ కలవ లేదని కాని మమల్ని బాగానే వెళ్లనిచ్చేవారు. నాన్న పండగలకు మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కుడా వెళ్లేవాళ్లం. అద్దె ఇంట్లోకి వెళ్లిపోయారు. అదంతా గుర్తుందా? అన్నానగర్‌కి మారిపోయాం. అంతా గుర్తుంది. నాకు పెళ్లి అయిపోయి నేను దూరంగా ఉన్నాను. మళ్లీ చైన్నైకి వచ్చాను కానీ అమ్మ తను ఒక్కత్తే ఉండాలి ఎవ్వరితో సంబంధం వద్దూ అన్నట్టుగా ఉండిపోయింది. కీర్తీ యాక్టింగ్ ఎలా అనిపించింది తను యాక్ట్ చేసిందా? అమ్మలాగా జీవించిందా? అనిపించింది. అమ్మ ఎలా అయితే పసిపిల్లగా ఉన్నప్పుడు నా వల్ల కాదంటారా అనే సీన్స్‌లో నీవల్ల ఏమవుతుంది అని అంటే సినిమాల్లో చేసి చూపించింది. సినిమాలో మీకు ఎక్కువగా నచ్చిన సన్నివేశాలు ఏమిటి? అమ్మ ఎర్లీ ఏజ్ సీన్స్ అన్నీ బాగా నచ్చాయి. మ్యూజిక్, డైలాగ్స్ చాలా నచ్చాయి. విజయ చాముండేశ్వరి, కీర్తిసురేశ్ 2017 డిసెంబర్లో ‘సాక్షి’కి విజయ చాముండేశ్వరి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుండి కొన్ని ప్రధానాంశాలు మీ కోసం మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని అంటుంటారు... అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్ అనదగ్గ ఏ డాక్టర్నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు. సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో? నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ (జెమినీ పెద్ద భార్య) ‘నువ్వు ఎగ్జామ్స్ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. కళ్లు తెరచి అలా చూస్తుండేది. ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా? కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి. ఆమె కూతురు రేఖ. ఇంకో కూతురు రాధ. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు. అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటే మేం కొడైకెనాల్ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ ఆడుకునేవాళ్లం. పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా? నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు. మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం? పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టింది. చేష్టలన్నీ నీవే’ అని రేఖ గురించి ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి. ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్ అండర్స్టాండింగ్స్ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా? చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్ అటు ఓల్డ్ కాని ఏజ్ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి. అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు? వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం. ఒకవేళ తెలిసి ఉంటే ఆ మిస్ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని మీకు అనిపిస్తోందా? ఆ ఫీలింగ్ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్ హ్యాపీగా గడిచిపోయేది. జెమినీగారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే సమానంగా చూసేవారా మీ అమ్మగారు? ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు. జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా? ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్ అనే ఫీలింగ్ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది. జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది... అది నిజం కాదు. అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు. మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి? కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు. మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్ కావాలనుకోలేదా? అమ్మ స్టార్ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్ చెప్పానంతే. పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్ ఉండేది. మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్? ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్ చేసేది. -
అమ్మ ఎదిగిన తీరును బాగా చూపించారు
-
రెండు స్థానాల నుంచి సిద్దరామయ్య పోటీ
-
చాముండేశ్వరిలో చావోరేవో..
చాముండి అమ్మవారి పాదాల సాక్షిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య చావో రేవో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. జేడీఎస్‌కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఓడిపోతారంటూ అంతర్గత సర్వేలు హెచ్చరించినా, కుల సమీకరణాలు అనుకూలంగా లేవని తేటతెల్లమైనా, సీఎంను ఓడించడానికి జేడీఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని ప్రచారం జరుగుతున్నా సరే సిద్దరామయ్య వెనక్కు తగ్గలేదు. తన కుమారుడి భవిష్యత్ కోసం రాజకీయ జూదంలో పావులు కదపడం మొదలు పెట్టారు. దీంతో కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టీ చాముండేశ్వరి నియోజకవర్గం మీదే పడింది.దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మైసూరు చాముండేశ్వరి అమ్మవారు కొలువైన ఈ నియోజకవర్గంలో సంకుల సమరానికి తెరలేచింది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చాముండేశ్వరిలో పన్నెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దరామయ్య డూ ఆర్ డై పోరుకి సిద్ధమయ్యారు. తనకు ఎంతో సురక్షితమైన వరుణ నియోజకవర్గాన్ని కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేసిన సిద్దరామయ్య ఓ రకంగా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారనే చెప్పాలి. చాముండేశ్వరి నియోజకవర్గంలో తొలినుంచీ జేడీఎస్ ప్రాబల్యం ఎక్కువ. ఇక బీజేపీ ఉనికి ఈ ప్రాంతంలో నామమాత్రమే. దీంతో ఈ నియోజకవర్గంలో సిద్దరామయ్య, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మధ్య మాత్రమే పోరు నెలకొంది. వాస్తవానికి చాముండేశ్వరి నియోజకవర్గం సిద్దరామయ్యకు కొత్త కాదు. ఇప్పటివరకు ఆయన అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచే గెలిచి మరో రెండుసార్లు ఓడిపోయారు. ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాక 2006లో ఎన్నికల్లో మాత్రం కేవలం 257 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2008లో వరుణ నియోజకవర్గానికి మారిపోయారు. కులసమీకరణాలే ప్రధానం ఈ నియోజకవర్గంలో కులసమీకరణాలే అత్యంత ప్రధానం. వొక్కలిగలు, ఓబీసీ ఓటర్లు ఎక్కువ. మొత్తం ఓటర్లలో 60 శాతం వొక్కలిగలే. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ వొక్కలిగకు చెందినవారే కావడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. ఇక సిద్దరామయ్య సామాజిక వర్గమైన కురు» ప్రాబల్యం ఒకప్పుడు బాగా ఉండేది. 2004లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కురుబ జనాభా ఉన్న చాలా ప్రాంతాలు వరుణ నియోజకవర్గంలో కలిసిపోయాయి. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జేడీఎస్‌కు మద్దతునిస్తూ ఉండడంతో ముస్లిం ఓటర్లు కూడా జేడీఎస్ వెంట నడిచే అవకాశాలు న్నాయి. మరోవైపు దశాబ్దకాలంగా సిద్దరామయ్య ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో జేడీఎస్ దానిని తనకు అనుకూల అస్త్రంగా మార్చుకుంది. అయితే సిద్దరామయ్య తనకున్న వ్యక్తిగత చరిష్మా, తాను చేసిన అభివృద్ధే గెలిపి స్తాయన్న ధీమాతో ఉన్నారు. అలాగే తనకు ఇవే ఆఖరి ఎన్నికలనీ, రాజకీయంగా తొలి చాన్స్ ఇచ్చిన ప్రజలు, చివరి అవకాశాన్నీ ఇవ్వాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. బాదామీలో పోటీచేయాలని అడుగుతున్నారు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాల్సిందిగా ఉత్తర కర్ణాటక నాయకులు ఇప్పటికీ తనను కోరుతున్నారంటూ సిద్దరామయ్య కొత్త ఊహాగానాలకు తెరలేపారు. చాముండేశ్వరితోపాటు బాదామీ నుంచి కూడా పోటీ చేయాలని తొలుత సిద్దరామయ్య భావించినప్పటికీ మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతలు మోకాలడ్డారు. ఆ స్థానం నుంచి పోటీకి దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించినా ఆయనకు ఇంకా బీ–ఫామ్ అందజేయలేదు. బాదామీలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే చిమ్మనకట్టి కూడా దేవరాజ్ పాటిల్‌కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలవడమే తమకు ప్రధానమనీ, ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని గెలిచిన తర్వాతే నిర్ణయిస్తామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జి.పరమేశ్వర స్పష్టం చేశారు. జేడీఎస్ దూకుడు చాముండేశ్వరిలో సిద్దరామయ్యను ఎలాగైనా ఓడించాలని, నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతున్న జేడీఎస్ పకడ్బందీ వ్యూహాలే రచిస్తోంది. సిద్దరామయ్యను ఓడించడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీ నేతలు వీరశైవ మఠాలు, దళిత కాలనీల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ కుమారుడు హరీశ్ గౌడ తండ్రి గెలుపు కోసం ఏడాది క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టారు. చాముండి నియోజకవర్గంలో పల్లెపల్లెకూ తిరుగుతున్నారు. ప్రతి పల్లెతోనూ వ్యక్తిగతంగా అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇవన్నీ జేడీ(ఎస్)కు కలిసొచ్చే అంశాలనే భావన వ్యక్తమవుతోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చాముండేశ్వరిలో సిద్ధరామయ్య చావో రేవో!
-
సిద్ధుకు చాముండేశ్వరి నియోజకవర్గమే దిక్కు !
జయనగర : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతో పాటు బాగల్‌కోటే జిల్లా బాదామి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ«శలపై పార్టీ హైకమాండ్ నీళ్లు చల్లింది. సిద్దరామయ్య టికెట్ తప్పించడంలో సీనియర్ కాంగ్రెస్ నేతలైన మల్లికార్జునఖార్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ సఫలీకృతులయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల నాయకత్వ బాధ్యత వహిస్తుండటంతో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో తప్పుడు సందేహం పోతుందని, ఇది ఎన్నికల్లో అనవసర చర్చకు దారితీస్తుందని పార్టీ అధిష్టానం భావించడంతో ఈ ప్రతిపాదనకు తెరపడింది. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సమితి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాదామి నియోజకవర్గంలో పోటీచేస్తే చాముండేశ్వరిలో కాంగ్రెస్ పరిస్ధితి మరింత క్లిష్టతరంగా మారుతుందని ఈ నేపథ్యంలో చాముండేశ్వరిపై దృష్టి కేంద్రీకరించాలని హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఖర్గే అభ్యంతరం : ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంపిక చేసుకోవడం పట్ల మల్లికార్జునఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేగాక ఈ నిర్ణయంతో ప్రతికూల పరిస్ధితులును పార్టీ హైకమాండ్‌కు వివరించారు. సిద్దరామయ్య తీసుకున్న పలు తీర్మానాల పట్ల ప్రారంభం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మల్లికార్జునఖర్గే మంచి సమయం కోసం వేచిచూసి కూర్చున్నారు. చాముండేశ్వరిలో గెలిచితీరుతామని ప్రకటించిన సిద్దరామయ్య బాదామిలో పోటీ చేస్తానని చెప్పడం ఏమిటని పార్టీ హైకమాండ్‌ను నేరుగా ప్రశ్నించారు. పార్టీకోసం ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ తాను సీఎం కాలేదని ఆక్రోశంతో ఉన్న ఖర్గే , సిద్దరామయ్యను తన రాజకీయ తంత్రంతో చాముండేశ్వరి నియోజకవర్గానికే పరిమితం చేయడంలో విజయం సాధించారు. పరమేశ్వర్ ప్లాన్ సక్సెస్ : కొరటిగెరె నుంచి పోటీచేస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్రస్తావన ముందుకు తేవడంతో తనకు కూడా పులకేశినగర నుంచి టికెట్ కేటాయించాలని హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు. సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే తనకు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని లేని పక్షంలో ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం వద్దని తీర్మానం తీసుకోవాలని పరమేశ్వర్ పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేశారు. తనకు రెండు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయించడం అసాధ్య అని తెలిసినప్పటికీ బాదామిలో సిద్దరామయ్యకు టికెట్ తప్పించే ఉద్దేశ్యంతో పరమేశ్వర్ పథకం వేశారని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటున్నారు. 2013 ఎన్నికల్లో పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కుర్చీపై కన్నేసిన పరమేశ్వర్ ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చాముండేశ్వరి నియోజకవర్గానికి పరిమితం చేయడంలో పరమేశ్వర్ విజయం సాధించారు. -
కోరిక తీర్చలేదని ప్రియురాలిని హతమార్చాడు
తిరువళ్లూరు: కోరిక తీర్చలేదన్న కోపంతో ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేశాడు. యువకుడిని పెనాలూరు పేట పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమారై చాముండేశ్వరి(19). ఈమె మనవాలనగర్‌లోని లోకిదాస్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. సోమవారం రాత్రి డ్యూటీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇంటి సమీపంలోని చాముండేశ్వరి ముళ్లపొదల్లోకి వెళ్లింది. ఆమె ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుప్పన్ సమీప ప్రాంతాల్లో గాలించడం ప్రారంభించారు. ముళ్లపొదల్లో చాముండేశ్వరి హత్యకు గురైనట్టు గుర్తించిన గ్రామస్తులు, పెనాలూరు పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతి మృతదేహన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు గ్రామస్తులు నిరాకరించారు. యువతి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, నిందితుడిని పట్టుకోవడానికి డాగ్‌స్వాడ్‌ను రప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. అనంతరం మృతదేహన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. ;ప్రియుడి అరెస్ట్: ఈ హత్య కేసులో అసలైన నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మొదట చాముండేశ్వరి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరిగా చాముండేశ్వరి మాట్లాడిన నెంబర్లపై ఆరా తీశారు. పోలీసుల విచారణలో చాముండేశ్వరి అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో గంటల తరబడి మాట్లాడడంతో పాటు చివరి కాల్ యువకుడితో మాట్లాడినట్టు నిర్ధారించారు. దీంతో రాజ్‌కుమార్ ను నిందితుడిగా గుర్తించి గాలింపు చర్యలు చేట్టారు. ఊత్తుకోట వద్ద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో చాముండేశ్వరి, రాజ్‌కుమార్ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతంలో ఉన్న మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్‌కుమార్ ను దూరంగా ఉంచినట్టు తెలిపాడు. చివరి సారిగా మాట్లాడాలని పిలిపించిన రాజ్‌కుమార్, తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్టు తెలిసింది. ఇందుకు చాముండేశ్వరి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన రాజ్‌కుమార్ బండరాయిని తలపై మోది హత్య చేసినట్టు విచారణలో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.