పెళ్లాడు.. ప్రేమించు | Sakshi Special Interview With Rajendra Prasad | Sakshi
Sakshi News home page

పెళ్లాడు.. ప్రేమించు

Published Sun, Jan 12 2020 1:39 AM | Last Updated on Sun, Jan 12 2020 5:00 AM

Sakshi Special Interview With Rajendra Prasad

విజయ చాముండేశ్వరి, రాజేంద్రప్రసాద్‌

‘ప్రేమించు పెళ్లాడు’ రాజేంద్రప్రసాద్‌ హిట్‌ సినిమా. ‘పెళ్లాడు ప్రేమించు’.. ఇది సినిమా కాదు... రాజేంద్రప్రసాద్‌ లైఫ్‌ మూవీ! అవును.. సినిమాలే లైఫ్‌ అనుకున్న ఈ నట కిరీటి మొదట పెళ్లాడారు. తర్వాత.. పెళ్లాడినావిణ్ని ప్రేమాడారు. ‘అప్పు.. డే’ తెల్లారిందా అంటారీయన ‘అప్పుల అప్పారావు’ చిత్రంలో. ఎంతసేపు మాట్లాడినా.. మాటలింకా బాకీ ఉన్నట్లే అనిపించింది ఈ దంపతులతో కూర్చున్నంతసేపూ!! ఈ ఇంటర్వ్యూ చదివితే.. మీ లైఫ్‌ పార్ట్‌నర్‌తో మీరు మరింత ‘కేరింగ్‌’గా ఉండటం ఖాయం.

మీ ఆవిడ పేరు విజయ చాముండేశ్వరి అనే విషయం తప్ప మీది లవ్‌ మ్యారేజా? ఎరేంజ్డా అనే విషయాలు చాలామందికి తెలియదు. అసలు మీ పెళ్లి ఎలా కుదిరింది? ఎప్పుడు?
రాజేంద్రప్రసాద్‌: తనకీ నాకూ ఉన్న కామన్‌ పాయింట్‌ ఏంటంటే మా చిన్నప్పుడే మేం అమ్మని కోల్పోవడం. మా ఇద్దరి ప్రేమ వయసు వల్లో లేకపోతే ప్యాషన్‌ వల్లో ఏర్పడింది కాదు. ‘కేరింగ్‌’ వల్ల. ఒకరి మీద ఒకరికున్న కేరింగ్‌ వల్ల మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది. చాము (భార్యని రాజేంద్రప్రసాద్‌ అలానే పిలుస్తారు) రమాప్రభగారి అక్క కూతురు. నేను రమాప్రభగారి ఇంటికి తరచూ వెళ్లేవాణ్ణి. చాము నాకు భోజనం పెట్టేది. మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ అన్నది ఎందుకు నమ్మాలంటే రమాప్రభగారింటికి వెళ్తే ‘చామూనే నా భార్య’ అనే ఫీలింగ్‌ ఏర్పడేది. మరి.. నేను అడగడమేంటో.. వాళ్లు బెజవాడ వచ్చి మా నాన్నను అడగడం ఏంటో.. చేస్తే తప్పేంటి? అని ఆయన అనడం ఏంటో.. పెళ్లి అయిపోవడం ఏంటో? అన్నీ చకచకా జరిగిపోయాయి. 1980 సెప్టెంబర్‌ 5న మా పెళ్లి జరిగింది.
చాముండేశ్వరి: మా పెళ్లి చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుళ్లో జరిగింది. ఆ తర్వాత వాణీ మహల్‌లో రిసెప్షన్‌ జరిగింది.

మీ ఇద్దరిలో ఫస్ట్‌ ఎవరు ప్రపోజ్‌ చేశారు?
చాముండేశ్వరి: ఆయనే.
రాజేంద్రప్రసాద్‌: వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడల్లా బాగా దబాయించేవాణ్ణి. డామినేట్‌ చేసేవాణ్ణి. ‘ఏంటయ్యా నువ్వు అలా దబాయిస్తావు. తనేమైనా నీ పెళ్లామా?’ అని వాళ్ల అమ్మమ్మ అనేది. దాంతో ‘నిజమేనేమో... నాకోసమే తనని దేవుడు పంపించాడేమో’ అనుకునేవాడ్ని. అలాగే పిల్ల ఎర్రగా బుర్రగా బావుంది అనుకున్నాను. ఓ రోజు  డైరెక్ట్‌గా వెళ్లి ‘పెద్దావిడ అలా అంటోంది. నీకు ఓకేనా’ అని అడిగాను. ఓకే అంది.

దబాయించినప్పుడు లైఫ్‌ మొత్తం ఇలాంటి దబాయింపులు ఉంటాయేమోననే భయం ఏమైనా?
చాముండేశ్వరి: మేం ఇష్టపడ్డాం. పెద్దవాళ్లు అరేంజ్‌ చేశారు. రమాప్రభగారు బాగా సపోర్ట్‌ చేశారు. నిజానికి ఆయన ఎక్కువగా రమాప్రభగారినే దబాయించేవారు. ఆవిడేమో ‘నువ్వేంట్రా నీ బాధేంట్రా’ అన్నట్టు›ఈయన్ను చూసేవారు.
రాజేంద్రప్రసాద్‌: రమాప్రభగారు నన్ను తమ్ముడిలా చూసుకునేవారు. ఓసారి ఫంక్షన్‌ పని మీద విజయవాడ వచ్చి, మీ ఇంటికి తీసుకెళ్లు అన్నారామె. ఇంటికి వెళ్లాక చాము, నా పెళ్లి గురించి డైరెక్ట్‌గా నాన్నగారిని అడిగేశారు. మా నాన్నగారు షాక్‌. మా పెద్దబ్బాయిని కూడా అడగాలన్నారు. ఇప్పుడేదో ఇన్నిన్ని మాట్లాడుకుంటున్నారు కానీ మేం ఒక్క రూపాయి కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. అయితే పెళ్లిరోజు శరత్‌బాబుగారు గోల్డ్‌ వాచ్, గోల్డ్‌ బ్రాస్‌లెట్‌ తీసుకొచ్చి పెళ్లి కదా వేసుకుంటే బావుంటుంది అన్నారు. వేసుకుంటే బావుంటుందా తీసుకుంటే బావుంటుందా అన్నాను. తీసుకొని వేసుకో అన్నారు. అప్పటికి గర్వమో, పొగరో తెలియదు కానీ తీసుకోలేదు. పోనీ.. పంచె, చొక్కా అయినా తీసుకోండి అన్నారు. అది తీసుకున్నాను.. సంప్రదాయం కదా. తాళిబొట్టు మావాళ్లు తీసుకున్నారు. అంతే.. ఏమీ తీసుకోకుండా జీవితాంతం కేరింగ్‌గా చూసుకోవాలనుకున్నాను.
విజయ చాముండేశ్వరి: వాళ్లు మమ్మల్ని ఏమీ అడగలేదు. మేం వాళ్లను ఏమీ అడగలేదు.

ప్రేమ చాలా రకాలు. ఆకర్షణలో పడి ప్రేమగా మారడం, స్నేహం ప్రేమగా మారడం, తొలి చూపులోనే ప్రేమ పుట్టడం... ఇలా. అయితే ‘కేరింగ్‌’తో మొదలయ్యే ప్రేమ వీటిన్నింటికన్నా బలంగా ఉంటుందంటారా?
రాజేంద్రప్రసాద్‌: అవునని నా అభిప్రాయం. జనరల్‌గా ముందు ప్రేమలో పడి, ఆ తర్వాత కేర్‌ మొదలవుతుంది. మా ప్రేమ ‘కేరింగ్‌’తోనే మొదలైంది. మేం ప్రేమ కబుర్లు చెప్పుకున్నది లేదు. ‘ఈ అమ్మాయి మన జీవితంలోకి వస్తే బాగుంటుంది.. వచ్చాక జాగ్రత్తగా చూసుకోవాలి’ అనే ఫీల్‌తో మొదలైన ప్రేమ. తనకూ అదే ఫీల్‌. ఇలా ఒకరి ‘కేరింగ్‌’ గురించి ఇంకొకరు ఆలోచించుకునే ప్రాసె స్‌లో మొదలైన మా ప్రేమ చాలా బలమైనది.

తెరపై నవ్వులు పంచే స్టార్‌ మీవారు. మరి.. రియల్‌ లైఫ్‌లో ఆయనకు కోపం వస్తుందా?   
రాజేంద్రప్రసాద్‌: ఎప్పుడైనా కోపం వస్తే ‘మీరు నటుడైతే అవ్వొచ్చు కానీ నన్ను పెళ్లి చేసుకున్నాకే  పెద్ద స్టార్‌ అయ్యారు గుర్తుపెట్టుకోండి’ అంటుంది ఆవిడ. అక్కడ మనం కాస్త తగ్గాల్సి వస్తుంది.  
చాముండేశ్వరి: ఆయనకు భయంకరమైన కోపం వస్తుంది.. అప్పుడు కోపం తగ్గించుకోండి... మీకు చెడ్డ పేరు వస్తుంది అంటాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తగ్గింది.

కేరింగ్‌ నుంచి పుట్టిన ప్రేమ పెళ్లిదాకా వచ్చింది. మరి.. వైవాహిక జీవితం తర్వాత మీ గురించి ఆవిడ తీసుకున్న కేర్‌ గురించి?
రాజేంద్రప్రసాద్‌: ఒక స్ట్రగుల్లో ఇద్దరం కలిశామేమో? అయినా కష్టం అనేది నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆవిడ కష్టం అనే మాటనే కొట్టిపారేస్తుంది. కష్టం అనేది ఎందుకు వస్తుంది? మనల్ని మనం నిరూపించుకోవడానికి వస్తుంది. నిరూపించుకోండని చెబుతూ నాలో స్ఫూర్తి నింపుతుంది. సహాయనటుడిగా ఏడాదికి 24 సినిమాలు, హీరోగా 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంవల్ల 365 రోజుల్లో 360 రోజులు నేనింట్లో ఉండటానికి కుదేరిది కాదు. అప్పుడు ఇంటి బాధ్యత తనే తీసుకుంది. ఒక్కరోజు కూడా ఆ బాధ్యత తాలూకు కష్టాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయలేదు. సక్సెస్‌ అయినా నాకు పొగరు రాకుండా చూసింది కూడా ఈవిడే. ఇప్పుడు కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌ హిట్‌ అంటా అని షేక్‌ హ్యాండ్‌ ఇస్తే ‘సరే. నెక్ట్స్‌ సినిమా ఏంటి?’ అని అంది. తను చాలా ప్రాక్టికల్‌. ఇది చేస్తే ఇది జరుగుతుంది.. అది జరుగుతుందని ఇప్పుడే టెన్షన్‌ పడటం దేనికి? అంటుంది. అలా టెన్షన్‌ని తీసిపారేస్తుంది.

365 రోజుల్లో 360 రోజులు షూటింగ్‌ చేస్తూ బిజీగా ఉండటంవల్ల తండ్రికి, పిల్లలకు ‘కమ్యూనికేషన్‌ గ్యాప్‌’ ఏర్పడే అవకాశం ఉందేమో...
చాముండేశ్వరి: అవును. పిల్లలకు ఎక్కువ టైమ్‌ కేటాయించలేదనే చిన్న బాధ ఆయనకు ఉంటుంది. నాకంటే కూడా పిల్లలు ఎక్కువ ఫీల్‌ అవుతారు. ఆయనతో ఎక్కువగా మాట్లాడరు. ‘వెళ్లి మాట్లాడండిరా’ అంటే అప్పుడు పెద్దగా మాట్లాడేవాళ్లం కాదు కదా. ఇప్పుడేం మాట్లాడాలి అంటారు. రెండుమూడు నెలలు పిల్లల్ని చూడకుండా షూటింగ్‌ చేసిన రోజులున్నాయి.
రాజేంద్రప్రసాద్‌: నా జీవితంలో బాధపడదగ్గ విషయం అది. అవుట్‌డోర్‌ షూటింగ్‌ల్లో ఉన్నప్పుడు, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు బాధపడి ఉంటానో లెక్కేలేదు. జీవితం చేతివేళ్లలానే. అన్ని వేళ్లూ ఒకేలా ఉండాలంటే కుదరదు. ఒకటి తక్కువ.. ఒకటి ఎక్కువ ఉండాల్సిందే. దేవుడు సృష్టి అది. కెరీర్‌ ఎక్కువగా ఉంది కాబట్టి.. పిల్లలతో పర్సనల్‌ లైఫ్‌ మిస్సయ్యాను. నేను ఇప్పుడు పిల్లలతో ‘ఇలా వచ్చి కూర్చుని సరదాగా మాట్లాడొచ్చు కదా’ అంటుంటాను. ఇన్నేళ్లు ఇలా అలవాటుపడ్డారు. ఇప్పుడు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను, చాము ఒక డెసిషన్‌కి వచ్చాం. అదేంటయ్యా అంటే ‘ఇక ఈ జన్మకింతే’ అని. ఇప్పుడు ఆ బాధ అంతా మా మనవరాలితో తీర్చుకుంటున్నాను.
చాముండేశ్వరి: మా అమ్మాయి ‘నాన్న మాతో ఎప్పుడూ ఇలా సరదాగా లేరు. మనవరాలితో హ్యాపీగా ముచ్చట్లు చెబుతున్నారు’ అంటుంది. అప్పుడు అంత తీరిక లేదు.. ఇప్పడు కాస్త తీరిక దొరుకుతోంది అంటాను.

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయింపబడతాయన్నారు. మీ ఫ్యామిలీ లైఫ్‌ ‘హెవెన్‌’ అనుకోవచ్చా?
రాజేంద్రప్రసాద్‌: అంతే. 1982లో వైకుంఠ ఏకాదశి రోజున మా పెద్దబ్బాయి బాలాజీ పుట్టాడు. 85లో విజయదశమి రోజున గాయత్రి పుట్టింది. పెళ్లయ్యాక నేను ఆర్టిస్ట్‌గా పెరిగా. బాలాజీ పుట్టాక బిజీ ఆర్టిస్ట్‌ అయ్యాను. గాయత్రి పుట్టాక హీరో అయ్యాను. అందుకే నా భార్య, నా ఇద్దరు పిల్లలు నా జీవితంలో సమ్‌థింగ్‌ స్పెషల్‌. నటుడిగా ఐయామ్‌ హ్యాపీ. ఫ్యామిలీ మేన్‌గానూ హ్యాపీ.

భార్యాపిల్లలు తన లైఫ్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్నారు రాజేంద్రప్రసాద్‌గారు. మరి మీరు?
చాముండేశ్వరి: ఏడాది మొత్తం షూటింగ్స్‌తో గడిపేసేవారు. అయినా ఏనాడూ ఫ్యామిలీకి ఏ లోటూ చేయలేదాయన. ఎప్పుడైనా మేం మిస్సవుతున్నాం అంటే పిల్లల్ని తీసుకొని లొకేషన్‌కు రమ్మనేవారు. ఓసారి మా పక్కింటి ఆవిడ మా పనివాళ్లతో నన్ను ఉద్దేశించి, ‘ఆవిడ రాజేంద్రప్రసాద్‌గారి రెండో భార్యా? అని అడిగింది. ఆ విçషయం నాతో చెబితే ‘అవును అనకపోయావా’ అన్నాను. ఆవిడ అలా అనుకోవడానికి కారణం ఉంది. ఉదయం నుంచి రాత్రివరకూ ఎక్కడో షూటింగ్‌లో ఉండేవారాయన. రాత్రి ఫ్లయిట్‌కి వచ్చి మర్నాడు మార్నింగ్‌ ఫ్లయిట్‌కి వెళ్లిపోయేవారు.
రాజేంద్రప్రసాద్‌: నేను షూటింగ్‌లో ఉంటే, ఫోన్‌ చేసి ‘పక్కింటావిడ ఇలా అడిగింది. కావాలంటే ఇంకో పెళ్లి ట్రై చేసుకోండి’ అంది. నీతోనే చస్తున్నాను అని నవ్వేశాను.
చాముండేశ్వరి: మేం హైదరాబాద్‌ వచ్చాక కూడా మా పిల్లల్ని మీరు మొదటి భార్య పిల్లలా? రెండో భార్య పిల్లలా? అని కొందరు అడిగారు.

రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ బాగుంటుంది. ఆయన నటించిన సినిమాల్లో మీకు నచ్చినవి?
రాజేంద్రప్రసాద్‌: అందరూ నన్ను కామెడీ కింగ్‌ అంటారు. తనకేమో నా కామెడీ నచ్చదు.
చాముండేశ్వరి: అవును. అయితే ఆయన చేసిన ‘ఎర్ర మందారం, ఆ నలుగురు’ సినిమాలు ఇష్టం. ఆ సినిమాల్లో ఆయన యాక్టింగ్‌ అద్భుతం.
రాజేంద్రప్రసాద్‌: నా కామెడీని ఇష్టపడేవాళ్లు మన ఇంటి మీదకు వస్తారు జాగ్రత్త (నవ్వుతూ).

తెరపై కామెడీ చేసే మీరు  బయట కొంచెం కఠినమేమో అనే ఫీలింగ్‌ కలుగుతుంది. నిజమా?
రాజేంద్రప్రసాద్‌: మా నాన్న స్కూల్‌ టీచర్‌. దానివల్ల ఇంట్లో వాతావరణం సీరియస్‌గా ఉండేది. నాక్కూడా అదే వచ్చిందేమో. జీవితంలో దేని మీదా కచ్చితమైన అభిప్రాయంతో ఉండొద్దు. ఉంటే... కుంగిపోయే చాన్స్‌ ఉందని చామూ చెబుతుంది.

పెళ్లయ్యేనాటికి ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటి?
రాజేంద్రప్రసాద్‌: పెళ్లయ్యే రోజుకి నా సంపాదన ‘సున్నా’. ఫుడ్‌ కోసం డబ్బింగ్‌లు అవీ చెబుతుండేవాణ్ణి. అలా అని ఇంటి దగ్గర ఏం లేకపోవడం కాదు. మా పెద్దన్నయ్య డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌. తన దగ్గర డబ్బులు తీసుకుని ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాను. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని కొన్ని డబ్బులు తీసుకున్నాను. ‘సినిమాలు, ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అని పెద్దాయన (ఎన్టీ రామారావుగారు) వెనక తిరుగుతున్నావు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. అయినా అన్నయ్య దగ్గర నెలకు ఐదువందలు తీసుకుంటున్నావట. తాగి తందనాలు ఆడుతున్నావా?’ అన్నారు మా నాన్నగారు. అలిగి మద్రాస్‌ వెళ్లిపోయాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకూ ఎవరి దగ్గరా రూపాయి తీసుకోలేదు. నా పర్సనాలిటీకి వెంటనే వేషాలు వచ్చే చాన్స్‌ లేదు. పుండరీకాక్షయ్యగారి దయవల్ల ‘మేలుకొలుపు’ అనే సినిమాలో హీరోకి డబ్బింగ్‌ చెప్పాను. అతను తమిళ హీరో. తనకి రకరకాల వాయిస్‌లు ట్రై చేశారు. ఆఖరికి యస్‌. జానకిగారితోనూ చెప్పించారు.

కుదర్లేదు. అప్పటికి నా ప్రయత్నాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అందరినీ చివరిసారి కలుద్దామని పుండరీకాక్షయ్యగారి ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన ‘ఇంట్లో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకు తున్నానే’ అని డబ్బింగ్‌ థియేటర్‌కి తీసుకువెళ్లారు. ఫట్‌మని డైలాగ్‌ చెప్పేశాను. అప్పటికి సరిగ్గా భోజనం చేసి మూడు నెలలుపైనే అయింది. ఏం కావాలి? అని ఆయన అంటే, ‘భోజనం పెడితే చాలు. డబ్బింగ్‌ చెబుతా’ అన్నా (చెమర్చిన కళ్లతో). ‘నీకు బుద్ధి ఉందా? భోజనం మానేయడం ఏంటి? నాన్న తిడితే ఏం? అని’ మందలించారు. ఆ రోజు నుంచి ఏ హీరోకి పడితే ఆ హీరోకి డబ్బింగ్‌ చెప్పేవాణ్ణి. డబ్బింగ్‌ చెప్పడంతో వచ్చిన డబ్బుతో చైన్నైలో ఇల్లు కూడా కట్టాను.

మీ ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా...?
చాముండేశ్వరి: ఆయన ప్రతిదీ సమస్యగా చూస్తారు. సమస్య కాదిది.. జీవితం అంటాను నేను. ఈ సమస్య రాకపోతే మీ సామర్థ్యం ఎలా తెలుస్తుంది? అంటాను. మా ఇద్దరి ఆలోచనా విధానాలు రెండు ధోరణులు.
రాజేంద్రప్రసాద్‌: ఆలోచనల గురించి పక్కన పెడితే ఇన్నేళ్లు పని చేసినా, ఇంత రిలాక్డ్స్‌గా, ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నానంటే తనే కారణం.

నటుడిగా నవ్వించే రాజేంద్రప్రసాద్‌గారు వృత్తిపరమైన ఆటుపోట్లను సీరియస్‌గా తీసుకుంటారా?
చాముండేశ్వరి: చాలా ఫీల్‌ అవుతారు. ఓసారి జస్ట్‌ నాలుగైదు నెలలు సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. అప్పుడు టెన్షన్‌ పడ్డారు. ‘ఈ గ్యాప్‌కే కంగారుపడితే ఎలా? ఈజీగా తీసుకోవాలి?’ అన్నాను.
రాజేంద్రప్రసాద్‌: ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ ముందు ఆ గ్యాప్‌ వచ్చింది. అప్పుడు  రాధిక, కుట్టి పద్మిని నా కోసం సీరియల్స్‌ రెడీ చేసి, మా ఇంటికి వచ్చి, ‘చామూ.. ఇప్పుడు సీరియల్స్‌ వేవ్‌ బాగుంది’ అని అడ్వాన్స్‌ చెక్‌ ఇచ్చి వెళ్లారు. నేను ఇంటికొచ్చాక ‘మీతో పెద్ద సీరియల్‌ ప్లాన్‌ చేశారట. చేస్తే పోతుందన్నారు’ అని చెప్పింది. కానీ నా జీవితాన్ని నేను అబ్జర్వ్‌ చేసిన ప్రకారం చెప్పేది ఏంటంటే.. నేనొక పాయింట్‌ మీద సీరియస్‌గా బాధపడ్డానంటే ఆ తర్వాత ఏదో గొప్పది జరుగుతుంది. అప్పుడు వచ్చినదే ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. ఆ సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశా. అయితే ఇక హీరోగా మనం డ్యూయట్లు పాడటానికి, ఫైట్లు చేయడానికి పనికి రాము, ఇది కరెక్ట్‌ కాదని అర్థమైంది. అప్పుడు సీరియస్‌గా ఆలోచిస్తున్న టైమ్‌లో వచ్చిన సినిమా ‘ఆ నలుగురు’. ఆ సినిమాతో నటుడిగా నా గౌరవం పది రెట్లు పెరిగింది. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యాను.

మీకు నట వారసులు లేరనే ఫీలింగ్‌?
చాముండేశ్వరి: మా అబ్బాయి బాలాజీ హీరో కాలేదనే బాధ ఉంది. అయితే మా మనవరాలు (కూతురు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని) ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మా అబ్బాయి పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నాను.   

ఫైనల్లీ... ‘ఎఫ్‌ 2’లో భర్త పాత్ర భార్య ఏమన్నా ‘అంతేగా’ అని తలూపుతుంది.. మరి మీవారు?
చాముండేశ్వరి: ఆయనేం అలా కాదు. నేను అంతేగా.. అంతేగా టైపు భార్యని.
రాజేంద్రప్రసాద్‌: అంతేగా.. మా ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంది. ఒకరంటే ఒకరికి ‘కేరింగ్‌’ ఉంది. అంతేగా చామూ.. అంతేగా.
– డి.జి. భవాని

‘ఇలా డ్రెస్‌ చేసుకో బాగుంటుంది’ అని మీవారు చెబుతారా?
చాముండేశ్వరి: ఆయనకు కలర్‌ కాంబినేషన్‌ బాగా తెలుసు. ఇదిగో ఈ ఇంటర్వ్యూకి ఈ బ్లూ, పింక్‌ కాంబినేషన్‌ శారీ కట్టుకోమన్నది ఆయనే.

మీకు చీరలు కొని తెస్తుంటారా?
తెస్తారు. కేరళ వెళ్లినప్పుడు అక్కడి ఫేమస్‌ చీరలు తెస్తారు. ఇంకా ఎక్కడికెళితే అక్కడి చీరలు తెస్తుంటారు.

మీ ఆవిడ టేస్ట్‌కి తగ్గట్టు కొంటారా?
రాజేంద్రప్రసాద్‌: నా టేస్ట్‌కి తగ్గట్టే కొంటా. తనకు నచ్చేవి తెచ్చినప్పుడు కాంప్లిమెంట్స్‌.. లేకపోతే... ఇక చెప్పేదేముంది? మీకో విషయం తెలుసా.. మా ఆవిడ మంచి టైలర్‌.

మీవారికి షర్టులు కుడుతుంటారా?
చాముండేశ్వరి: లేదండీ.. నాకు లేడీస్‌కి మాత్రమే కుట్టడం వచ్చు. మా ఆయన కూడా లేడీస్‌ టైలరే..
రాజేంద్రప్రసాద్‌: అవునవును.. సినిమాలో లైడీస్‌ టైలర్‌నే కదా (నవ్వుతూ).

బాగా ఇష్టపడి తినే వంటలు ఏంటి?
చాముండేశ్వరి: ఆయనకు రోటిపచ్చళ్లు ఉంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు.
రాజేంద్రప్రసాద్‌: మా అమ్మగారు చనిపోయేటప్పుడు ‘వాడికి రోటి పచ్చళ్లు ఇష్టం. అవి చేసి పెట్టండి’ అని మా పెద్దక్కయ్యతో అన్నారట. మా ఆవిడది మదనపల్లి సైడ్‌. ఆకు కూరలు, పుల్ల కూరలని వీళ్ల స్టైల్‌ కూరలు వేరే ఉంటాయి.
చాముండేశ్వరి: నేను రోటి పచ్చళ్లు నేర్చుకున్నాను కానీ పాలకూరలు నేర్చుకోలేకపోయా. పాలకూరలన్నీ ఆయనే వండుతారు.
రాజేంద్రప్రసాద్‌: మా పెద్దక్కయ్య దగ్గర పాలకూరలు నేర్చుకున్నాను. షూటింగ్‌ లేకపోతే ‘ఇవాళ పాలకూర’ చేయండి అని అడుగుతారు. ఒక్కోసారి నేనే అడిగి మరీ బీరకాయ పాలకూర, సొరకాయ పాలకూర చేస్తాను.
చాముండేశ్వరి: చాలా బాగా చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement