చాముండి అమ్మవారి పాదాల సాక్షిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య చావో రేవో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. జేడీఎస్‌కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఓడిపోతారంటూ అంతర్గత సర్వేలు హెచ్చరించినా, కుల సమీకరణాలు అనుకూలంగా లేవని తేటతెల్లమైనా, సీఎంను ఓడించడానికి జేడీఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని ప్రచారం జరుగుతున్నా సరే సిద్దరామయ్య వెనక్కు తగ్గలేదు. తన కుమారుడి భవిష్యత్ కోసం రాజకీయ జూదంలో పావులు కదపడం మొదలు పెట్టారు.
దీంతో కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టీ చాముండేశ్వరి నియోజకవర్గం మీదే పడింది.దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మైసూరు చాముండేశ్వరి అమ్మవారు కొలువైన ఈ నియోజకవర్గంలో సంకుల సమరానికి తెరలేచింది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చాముండేశ్వరిలో పన్నెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దరామయ్య డూ ఆర్ డై పోరుకి సిద్ధమయ్యారు. తనకు ఎంతో సురక్షితమైన వరుణ నియోజకవర్గాన్ని కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేసిన సిద్దరామయ్య ఓ రకంగా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారనే చెప్పాలి.
చాముండేశ్వరి నియోజకవర్గంలో తొలినుంచీ జేడీఎస్ ప్రాబల్యం ఎక్కువ. ఇక బీజేపీ ఉనికి ఈ ప్రాంతంలో నామమాత్రమే. దీంతో ఈ నియోజకవర్గంలో సిద్దరామయ్య, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మధ్య మాత్రమే పోరు నెలకొంది. వాస్తవానికి చాముండేశ్వరి నియోజకవర్గం సిద్దరామయ్యకు కొత్త కాదు. ఇప్పటివరకు ఆయన అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచే గెలిచి మరో రెండుసార్లు ఓడిపోయారు. ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాక 2006లో ఎన్నికల్లో మాత్రం కేవలం 257 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2008లో వరుణ నియోజకవర్గానికి మారిపోయారు.
కులసమీకరణాలే ప్రధానం
ఈ నియోజకవర్గంలో కులసమీకరణాలే అత్యంత ప్రధానం. వొక్కలిగలు, ఓబీసీ ఓటర్లు ఎక్కువ. మొత్తం ఓటర్లలో 60 శాతం వొక్కలిగలే. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ వొక్కలిగకు చెందినవారే కావడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. ఇక సిద్దరామయ్య సామాజిక వర్గమైన కురు» ప్రాబల్యం ఒకప్పుడు బాగా ఉండేది. 2004లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కురుబ జనాభా ఉన్న చాలా ప్రాంతాలు వరుణ నియోజకవర్గంలో కలిసిపోయాయి.
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జేడీఎస్‌కు మద్దతునిస్తూ ఉండడంతో ముస్లిం ఓటర్లు కూడా జేడీఎస్ వెంట నడిచే అవకాశాలు న్నాయి. మరోవైపు దశాబ్దకాలంగా సిద్దరామయ్య ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో జేడీఎస్ దానిని తనకు అనుకూల అస్త్రంగా మార్చుకుంది. అయితే సిద్దరామయ్య తనకున్న వ్యక్తిగత చరిష్మా, తాను చేసిన అభివృద్ధే గెలిపి స్తాయన్న ధీమాతో ఉన్నారు. అలాగే తనకు ఇవే ఆఖరి ఎన్నికలనీ, రాజకీయంగా తొలి చాన్స్ ఇచ్చిన ప్రజలు, చివరి అవకాశాన్నీ ఇవ్వాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
బాదామీలో పోటీచేయాలని అడుగుతున్నారు
బాగల్‌కోట్ జిల్లాలోని బాదామీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాల్సిందిగా ఉత్తర కర్ణాటక నాయకులు ఇప్పటికీ తనను కోరుతున్నారంటూ సిద్దరామయ్య కొత్త ఊహాగానాలకు తెరలేపారు. చాముండేశ్వరితోపాటు బాదామీ నుంచి కూడా పోటీ చేయాలని తొలుత సిద్దరామయ్య భావించినప్పటికీ మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతలు మోకాలడ్డారు. ఆ స్థానం నుంచి పోటీకి దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించినా ఆయనకు ఇంకా బీ–ఫామ్ అందజేయలేదు. బాదామీలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే చిమ్మనకట్టి కూడా దేవరాజ్ పాటిల్‌కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలవడమే తమకు ప్రధానమనీ, ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని గెలిచిన తర్వాతే నిర్ణయిస్తామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జి.పరమేశ్వర స్పష్టం చేశారు.
జేడీఎస్ దూకుడు
చాముండేశ్వరిలో సిద్దరామయ్యను ఎలాగైనా ఓడించాలని, నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతున్న జేడీఎస్ పకడ్బందీ వ్యూహాలే రచిస్తోంది. సిద్దరామయ్యను ఓడించడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీ నేతలు వీరశైవ మఠాలు, దళిత కాలనీల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ కుమారుడు హరీశ్ గౌడ తండ్రి గెలుపు కోసం ఏడాది క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టారు. చాముండి నియోజకవర్గంలో పల్లెపల్లెకూ తిరుగుతున్నారు. ప్రతి పల్లెతోనూ వ్యక్తిగతంగా అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇవన్నీ జేడీ(ఎస్)కు కలిసొచ్చే అంశాలనే భావన వ్యక్తమవుతోంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment