అమ్మ మళ్లీ పుట్టింది | Vijay Chamundeswari special interview | Sakshi
Sakshi News home page

అమ్మ మళ్లీ పుట్టింది

Published Sun, May 13 2018 1:17 AM | Last Updated on Sun, May 13 2018 8:38 AM

Vijay Chamundeswari special interview  - Sakshi

పునరపి జననం. పునరపి మరణం. జీవితం ఒక చక్రం. మన చేతిలో గీతల్లాగే కాలచక్రంలోనూ గీతలుంటాయి. వేగంగా తిరుగుతున్న చక్రం మధ్యలో మసక కనపడుతుంది. చక్రం ఆగినప్పుడే ఆ గీతలు కనపడతాయి. సావిత్రి జీవితం చక్రంలా తిరిగినన్ని రోజులు మసకే కనిపించింది. అది ఆగినప్పుడే ఆ గీతల కొలతలు మొదలయ్యాయి. మహానటి సినిమా.. లేని గీతలు చెరిపేసి, మిగతా గీతలను రాయి మీద గీసింది. మహానటి ఒక మహా నిజం చెప్పింది. సావిత్రి మళ్లీ పుట్టింది... అంటోంది విజయ చాముండేశ్వరి.

అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సుమారుగా 30కోట్లతో నిర్మించిన ఈ సినిమా బిజినెస్‌ బాగుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా శాటిలైట్‌ రైట్స్‌ సుమారు 20 కోట్లపైగా పలుకుతున్నాయని సమాచారం. ఇక సినిమా టోటల్‌ షేర్‌ 75కోట్లకు చేరుకుటుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ‘మహానటి’ సినిమా సక్సెస్‌ సాధించిన సందర్భంగా..సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరీతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ...


సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది ?
నాకు టైమ్‌ మిషన్‌లో వెనక్కి వెళ్లి వచ్చినట్టుగా అనిపించింది. అమ్మతో పాటు మళ్లీ కొన్నాళ్లు జీవించినట్టుగా అనిపించింది. తల్లిని పిల్లలు అలా తెర మీద చూసుకునే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి?  చాలా హ్యాపీగా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే  ఇచ్చిన మాట తప్పకుండా ఒక సెలబ్రేషన్‌లా చూపిస్తాం సావిత్రిగారిని అన్న మాటను టీమ్‌ నిలబెట్టుకున్నారు. నిజంగానే సెలబ్రేషన్‌లా ఉంది సినిమా. ఉదయమే అశ్వనీదత్‌గారు ఫోన్‌ చేసి రెండు రోజుల నుంచి ఇంట్లో పెళ్లిలా ఉందమ్మా రెస్పాన్స్‌ చూస్తుంటే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. మీ వల్ల అమ్మ మళ్లీ పుటింది అని అంటే.. లేదమ్మా అమ్మ వచ్చి మా పిల్లలందరితో సినిమా చేయించుకుంది అన్నారు దత్‌గారు.

ఎక్కడా తప్పులు ఉన్నట్టుగా అనిపించలేదా?
అస్సలు ఎక్కాడా అనిపించలేదు. వాస్తవాన్ని చూపించటం కూడా చాలా క్లాస్‌గా చూపించారు. అఫ్‌కోర్స్‌ కొన్ని విషయాల్లో ఎవరెవరివో పేర్లు బయటకు చెప్పడం మాకు ఇష్టం లేదు. అందుకే జనరల్‌గా ఎవరో వచ్చి నగలు తీసుకు వెళ్లినట్టు ఎవరో ఆస్తిని సైన్‌ చేసుకున్నట్టు చూపించారు. కానీ పేర్లు ప్రస్థావించలేదు.  

ఆ నగల మూట సంఘటన మీకు గుర్తుందా?
అది నాకు కళ్లకు కట్టినట్టుగా గుర్తు. స్కూల్‌ నుంచి వచ్చాను. బెడ్‌ మీద మూటలు ఉన్నాయి. ఎగ్జాజిరేషన్‌ అనుకుంటారు. బెడ్‌ మీద చాకలి మూట వేసినట్టుగా అన్ని నగలు మూట కట్టుకొని భుజాన వేసుకొని తీసుకొని వెళ్లిపోయేవారు.

ఇన్‌కమ్‌ టాక్స్‌ వాళ్లు కూడా తీసుకొని వెళ్లారు కదా.
అలా తీసుకువెళ్లి పోయినా మళ్లీ అమ్మ నగలు చేయించుకుంది. అయితే అన్ని కష్టాల్లో కూడా ఎవరైనా సహాయం కావాల్సి వస్తే చేసేది. అమ్మ చేతిలో ఏదీ ఆగదు. అన్నీ ఇచ్చేయటమే.

పట్టు చీర అమ్మి మరీ ఇతరులకు డబ్బులు సహాయం చేశారా?
పట్టు చీరలు , అవార్డ్స్‌ అమ్మారు. ఏదీ ఎగ్జాజిరేట్‌ చేయలేదు.



సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘ఈ రెండు లక్షలు నేను సతీష్‌ (మీ తమ్ముడు) కోసం దాచాను. ఇవి మాత్రం ఎవ్వరికీ ఇవ్వను’ అని. సో ఫైనల్‌గా అమ్మ వెళ్లిపోయేటప్పటికి మిగిలింది ఆ రెండు లక్షలేనా?
నంబర్‌గా సరిగ్గా చెప్పలేను. అమ్మ చెప్పింది క్యాష్‌ మాత్రమే. అమ్మ పోయేటప్పటికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు చైన్నై హబీబుల్లా రోడ్‌లో ఒక ఇల్లు. కొడైకెనాల్‌లో ఒక ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా ఏమీ లేకుండా పోయింది అని అంటే నేను ఒప్పుకోను. తమ్ముడికి నాకు వచ్చింది పంచుకున్నాము. ఆ తర్వాత తమ్ముడు ‘నేనిక్కడ ఉండను అక్కా వెళ్లిపోతాను’ అన్నాడు. తన వాటా అమ్మేసి యూఎస్‌ వెళ్లిపోయాడు.

మీరు ఇప్పుడు హబీబుల్లా రోడ్‌లోనే ఉంటున్నారా?
అక్కడే ఉండేవాళ్లం. రెండు సంవత్సరాల క్రితమే ఆ ఇల్లు అమ్మేసి ఎగ్మూర్‌కి వచ్చేశాం. అక్కడ ఉండటం కష్టంగా ఉంది.  అక్కడ ఉంటే అమ్మ గురించే మనసు లాగుతుంది.  సెంటిమెంట్‌గా అక్కడే ఉండాలి అని అంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి ఎగ్మూర్‌లో మంచి అపార్ట్మెంట్‌కి వచ్చాం. చెప్పుకోవల్సిన అవసరం ఉంది. 2,650 స్క్వేర్‌ ఫీట్‌ అపార్ట్‌మెంట్‌.  నయనతార, దర్శకుడు అట్లీ ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం.  అమ్మ ఏమీ లేకుండా పోయింది అనుకుంటున్నారు. మమ్మల్ని చూసైనా మీరు ఆ అభిప్రాయం మార్చుకోవాలి. చేతిలో క్యాష్‌ లేకపోవడంతో అవస్థ పడ్డారు అమ్మ. ఆస్తుల నుంచి క్యాష్‌ చేసుకోవడం అమ్మకు తెలియలేదు.

సినిమా స్టార్టింగ్‌లో హాస్పిటల్‌లో సావిత్రి గారిని బయట కింద పడిలోబెట్టినట్టు చూపించారు. అదీ నిజమేనా?
నిజమే. హాస్పిటల్‌కి వెళ్ళగానే స్ట్రెచర్‌ మీద పడుకోబెడతారు కదా. మన కోసం రూమ్స్‌ అన్నీ ఖాళీగా ఉండవు కదా.  సినిమాలో స్క్రీన్‌ప్లే కోసం అలా బయట కింద పడుకోబెట్టారు. రూమ్‌ కోసం ఎదురు చూసే ఆ సమయంలో జరిగిన సంఘటన అది.  అది కర్ణాటక అయ్యేసరికి వాళ్లు గుర్తించటానికి కొంచెం సమయం పట్టింది.

వేరే అమ్మాయితో జెమినీ కనిపించగానే సావిత్రిగారు హర్ట్‌ అయ్యి జెమినీని దూరంపెట్టేసినట్టు సినిమాలో చూపించారు. నిజంగానే దూరంపెట్టారా?
రానివ్వలేదు. అసలు రానిచ్చేవారు కాదు అమ్మ. నాన్న కొన్నిసార్లు గోడ దూకి కూడా వచ్చేవాళ్లు. షూట్‌ చేశారు కానీ లిమిటెడ్‌ టైమ్‌ కాబట్టి ఎడిటింగ్‌లో తీసేశారు. అమ్మ చుట్టు ఉండే  బంధువులు నాన్నను రానివ్వలేదు. కొన్ని విషయాలు అమ్మ దగ్గర దాచేశారు కూడా.

జెమినీగారు గోడ దూకి రావటానికి ప్రయత్నించారన్న విషయాన్ని కూడా తెలియకుండా చేశారా?
ఆయన కూతురని చెప్పడం కాదు కానీ అందరూ కలిసి నాన్నను విలన్‌ చేశారు. ఆయన క్యారెక్టర్‌ కరెక్ట్‌గా చూపించారు సినిమాలో. నాన్నగారు అమ్మని చాలా ప్రేమించారు. తర్వాత ఆయన కూడా తాగటం మొదలెట్టారు.

నాన్నగారి దగ్గరకు మీరు వెళ్లేవారా?
మేం వెళ్లటం రావడం బాగానే జరిగాయి. ఆ విషయంలో ఏ అబ్జక్షన్‌ పెట్టలేదు. ఆవిడ కలవ లేదని కాని మమల్ని బాగానే వెళ్లనిచ్చేవారు. నాన్న పండగలకు మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్‌ కుడా వెళ్లేవాళ్లం.

అద్దె ఇంట్లోకి వెళ్లిపోయారు. అదంతా గుర్తుందా?
అన్నానగర్‌కి మారిపోయాం. అంతా గుర్తుంది. నాకు పెళ్లి అయిపోయి నేను దూరంగా ఉన్నాను. మళ్లీ చైన్నైకి వచ్చాను కానీ అమ్మ తను ఒక్కత్తే ఉండాలి ఎవ్వరితో సంబంధం వద్దూ అన్నట్టుగా ఉండిపోయింది.

కీర్తీ యాక్టింగ్‌ ఎలా అనిపించింది
తను యాక్ట్‌ చేసిందా? అమ్మలాగా జీవించిందా? అనిపించింది. అమ్మ ఎలా అయితే పసిపిల్లగా ఉన్నప్పుడు నా వల్ల కాదంటారా అనే సీన్స్‌లో నీవల్ల ఏమవుతుంది అని అంటే సినిమాల్లో చేసి చూపించింది.

సినిమాలో మీకు ఎక్కువగా నచ్చిన సన్నివేశాలు ఏమిటి?
అమ్మ ఎర్లీ ఏజ్‌ సీన్స్‌ అన్నీ బాగా  నచ్చాయి. మ్యూజిక్, డైలాగ్స్‌ చాలా నచ్చాయి.


విజయ చాముండేశ్వరి, కీర్తిసురేశ్‌

2017 డిసెంబర్‌లో ‘సాక్షి’కి విజయ చాముండేశ్వరి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుండి కొన్ని ప్రధానాంశాలు మీ కోసం

మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్‌) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని  అంటుంటారు...
అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్‌ అనదగ్గ ఏ డాక్టర్‌నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు.

సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో?
నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్‌ ఎగ్జామ్స్‌ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ (జెమినీ పెద్ద భార్య) ‘నువ్వు ఎగ్జామ్స్‌ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్‌ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్‌ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. కళ్లు తెరచి అలా చూస్తుండేది.

ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా?
కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి. ఆమె కూతురు రేఖ. ఇంకో కూతురు రాధ. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు. అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్‌ ఉంటే మేం కొడైకెనాల్‌ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ ఆడుకునేవాళ్లం.

పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా?
నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్‌ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు.

మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం?
పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టింది. చేష్టలన్నీ నీవే’ అని రేఖ గురించి ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్‌ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్‌ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్‌ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్‌) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి.

ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా?
చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్‌ అటు ఓల్డ్‌ కాని ఏజ్‌ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్‌ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి.

అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు?
వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం.

ఒకవేళ తెలిసి ఉంటే ఆ మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని మీకు అనిపిస్తోందా?
ఆ ఫీలింగ్‌ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్‌. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్‌ హ్యాపీగా గడిచిపోయేది.

జెమినీగారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే  సమానంగా చూసేవారా మీ అమ్మగారు?
ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్‌. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు.

జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా?
ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్‌ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్‌ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్‌ అనే ఫీలింగ్‌ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది.

జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది...
అది నిజం కాదు.  అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు.

మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి?
కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్‌) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు.

మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్‌ కావాలనుకోలేదా?
అమ్మ స్టార్‌ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్‌ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్‌ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్‌ చెప్పానంతే.

పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ మీటింగ్‌’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్‌లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్‌ ఉండేది.

మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్‌?
ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్‌. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్‌ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్‌ చేసేది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement