జయనగర : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతో పాటు బాగల్‌కోటే జిల్లా బాదామి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ«శలపై పార్టీ హైకమాండ్ నీళ్లు చల్లింది. సిద్దరామయ్య టికెట్ తప్పించడంలో సీనియర్ కాంగ్రెస్ నేతలైన మల్లికార్జునఖార్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ సఫలీకృతులయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల నాయకత్వ బాధ్యత వహిస్తుండటంతో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో తప్పుడు సందేహం పోతుందని, ఇది ఎన్నికల్లో అనవసర చర్చకు దారితీస్తుందని పార్టీ అధిష్టానం భావించడంతో ఈ ప్రతిపాదనకు తెరపడింది. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సమితి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాదామి నియోజకవర్గంలో పోటీచేస్తే చాముండేశ్వరిలో కాంగ్రెస్ పరిస్ధితి మరింత క్లిష్టతరంగా మారుతుందని ఈ నేపథ్యంలో చాముండేశ్వరిపై దృష్టి కేంద్రీకరించాలని హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
ఖర్గే అభ్యంతరం : ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంపిక చేసుకోవడం పట్ల మల్లికార్జునఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేగాక ఈ నిర్ణయంతో ప్రతికూల పరిస్ధితులును పార్టీ హైకమాండ్‌కు వివరించారు. సిద్దరామయ్య తీసుకున్న పలు తీర్మానాల పట్ల ప్రారంభం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మల్లికార్జునఖర్గే మంచి సమయం కోసం వేచిచూసి కూర్చున్నారు. చాముండేశ్వరిలో గెలిచితీరుతామని ప్రకటించిన సిద్దరామయ్య బాదామిలో పోటీ చేస్తానని చెప్పడం ఏమిటని పార్టీ హైకమాండ్‌ను నేరుగా ప్రశ్నించారు. పార్టీకోసం ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ తాను సీఎం కాలేదని ఆక్రోశంతో ఉన్న ఖర్గే , సిద్దరామయ్యను తన రాజకీయ తంత్రంతో చాముండేశ్వరి నియోజకవర్గానికే పరిమితం చేయడంలో విజయం సాధించారు.
పరమేశ్వర్ ప్లాన్ సక్సెస్ : కొరటిగెరె నుంచి పోటీచేస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్రస్తావన ముందుకు తేవడంతో తనకు కూడా పులకేశినగర నుంచి టికెట్ కేటాయించాలని హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు. సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే తనకు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని లేని పక్షంలో ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం వద్దని తీర్మానం తీసుకోవాలని పరమేశ్వర్ పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేశారు.
తనకు రెండు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయించడం అసాధ్య అని తెలిసినప్పటికీ బాదామిలో సిద్దరామయ్యకు టికెట్ తప్పించే ఉద్దేశ్యంతో పరమేశ్వర్ పథకం వేశారని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటున్నారు. 2013 ఎన్నికల్లో పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కుర్చీపై కన్నేసిన పరమేశ్వర్ ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చాముండేశ్వరి నియోజకవర్గానికి పరిమితం చేయడంలో పరమేశ్వర్ విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment