సాక్షి, బెంగళూరు: శనివారం ముగిసిన 15వ విధానసభ ఎన్నికలే తమ చివరి ఎన్నికలని వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసే ప్రసక్తే లేదంటూ సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని తమ గృహంలో సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదనే నిర్ణయించుకున్నామని అయితే ఓటమి భయంతోనే సిద్దరామయ్య ఎన్నికల నుంచి తప్పుకున్నారంటూ విమర్శలు వస్తాయనే కారణంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల నుంచి తప్పుకున్న అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటామని కానీ పార్టీకి సలహాలు, సూచనలు మాత్రం చేస్తూనే ఉంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు, యాత్రలతో చాలా అలసిపోయామని శనివారం ఎన్నికలు ముగియడంతో ఒత్తిళ్లను పక్కనపెట్టి సుఖంగా నిద్రపోతామంటూ సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్‌పోల్స్ గురించి ఆందోళన వద్దు..
శనివారం ముగిసిన ఎన్నికలపై ప్రసార మాధ్యమాల్లో వెలువడుతున్న ఎగ్జిట్‌పోల్స్‌పై ఆందోళన చెందకుండా వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించాలంటూ సీఎం సిద్దరామయ్య కార్యకర్తలకు ట్విటర్ ద్వారా సూచించారు. పార్టీ ప్రచారాలు, యాత్రల్లో నేతలు, అభ్యర్థుల కంటే మీరే ఎక్కువగా కష్టపడ్డారని అందుకు ఎన్నికల ఫలితాల గురించి వెలువడుతున్న ఎగ్జిట్‌పోల్స్ గురించి ఆందోళన పడకుండా కుటుంబాలతో గడపాలంటూ ట్విటర్‌లో సూచించారు. బాదామి, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాల్లో తాము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన సిద్దరామయ్య.. చాముండేశ్వరిలో జేడీఎస్ తరపున బరిలో దిగిన జీటీ దేవేగౌడ డబ్బులను మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేసారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment