బెంగళూరులో నివాసంలో యడ్యూరప్ప , మైసూరులో ఓ పెళ్లిలో సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీల నాయకులందరూ విశ్రాంతి స్థితిలోకి వెళ్లిపోయారు. మంగళవారం ఫలితాలు ఉండడంతో ఒత్తిళ్లన్నీ పక్కన పెట్టేసి కులాసాగా గడుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్, బీఎస్పీ నేతలు గత నెల రోజులుగా గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. శనివారం సాయంత్రం పోలింగ్ ముగియడం, ఎగ్జిట్ పోల్స్ కూడా తలోరకంగా ఫలితాలను పేర్కొనడంతో నాయకులు కూడా ఊరట చెందారు. ఇన్నిరోజులూ దూరంగా ఉన్న కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. పలువురు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని దేవాలయాలు, మఠాల్లో మొక్కుకున్నారు. మరికొందరు విహారయాత్రలకు పయనమయ్యారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో రిలాక్స్‌డ్‌గా ఉంటే మరికొందరు అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయనో అంచనాలు వేసుకుంటూ లాభ–నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తానే కాబోయే సీఎంనని ఆదివారం పునరుద్ఘాటించారు. ఎక్కడ ప్రమాణం చేయాలనేది కౌంటింగ్ రోజున ప్రకటిస్తామని చెప్పడం గమనార్హం.
కుటుంబాలతో సరదా సరదా
బెంగళూరు దాసరహళ్లి ఎమ్మెల్యే మునిరాజు తన పశువులకు ఆహారం వేస్తూ కనిపించారు. అఫ్జలపుర బీజేపీ అభ్యర్థి మాలికయ్య గుత్తేదార్ తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గం జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. ఇక పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య ఆదివారం తన మైసూరు జిల్లాలో సొంతింటిలో కుటుంబ సభ్యులతో గడిపారు. ప్రతిరోజు రామకృష్ణనగరలో ఉండే ఆయన నివాసం వద్ద బారులు తీరే జనం ప్రస్తుతం ఎవ్వరూ కనిపించకపోవడం గమనార్హం. చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల గెలుపోటములపై కాసేపు మద్దతుదారులతో చర్చించారు. ఒకటి రెండు పెళ్లిళ్లకు హాజరయ్యారు. జేడీఎస్ నేత కుమారస్వామి తన కుమారుడితో కలసి రెండు రోజుల విశ్రాంతి నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లారని పార్టీ వర్గాలు, లేదు.. బీజేపీతో మంతనాలు కోసం పయనమైనట్లు మరికొందరు ప్రచారం సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment