సంతానం కోసం పరితపించే జంట ఇక అన్ని విధాలా ప్రయత్నించాక చివరి ఆశగా ప్రయత్నించే ప్రక్రియ ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అన్న విషయం తెలిసిందే. కానీ టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా 100 శాతం ఫలితాలు ఉండకపోవచ్చు. అయితే ఈ ప్రక్రియను దాదాపుగా 3 – 6 సార్లు ప్రయత్నించాక కూడా కొందరిలో ఫలితం ఉండకపోవచ్చు. పిండం నాణ్యంగా లేకపోవడం, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో బయటకు తెలియని లోపాలు, సూక్ష్మమైన సమస్యలు ఉన్నా గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు, రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని, దంపతుల అంగీకారం మీద, వాడుకొని ప్రయత్నించవచ్చు. కొందరు దంపతులకు ఇలా దాత నుంచి తీసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు. దాంతో గర్భాన్ని సొంత తల్లి మోసే అవకాశం లేనప్పుడు, ఆమె బదులుగా మరో తల్లిలో ఆ పిండాన్ని పెరగనిచ్చి, కననిచ్చి, బిడ్డ పుట్టాక సొంత తల్లికి అప్పగించే ప్రక్రియనే ‘సరోగíసీ’ అంటారు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియలో సరోగేట్ తల్లి కేవలం బిడ్డను మోయడం మాత్రమే చేస్తుంది. మిగతా అండం, శుక్రకణం, అవి కలవడం వల్ల ఏర్పడిన పిండం... ఇవన్నీ సొంత తల్లిదండ్రులకు చెందినవే కావడం వల్ల ఈ ప్రక్రియ వైపునకు చాలామంది బిడ్డలు లేనివారు మొగ్గుచూపారు.
ఇదీ చరిత్ర...
మన భారతదేశంలో మొట్టమొదటి సరోగేట్ బిడ్డ 1994లో పుట్టింది. ఇక 2002లో మొదటిసారి సరోగసీకి చట్టబద్ధత ఏర్పడింది. దాంతో టెస్ట్‌ట్యూబ్ ప్రక్రియ ద్వారా కూడా బిడ్డలు కలగని ఎందరో దంపతులు ఈ ప్రక్రియను ఆశ్రయించారు. ఫలితంగా 2002 నుంచి 2015 వరకు భారత్ సరోగసీకి కేంద్రమైంది. మన దగ్గర ఈ ప్రక్రియకు రూ. 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టగలిగితే చాలు... బిడ్డను తీసుకుపోవచ్చు. కానీ అదే విదేశాలలోనైతే ఇదే ప్రక్రియకు 75,000 డాలర్ల నుంచి 85,000 డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. (అంటే మన కరెన్సీలో దాదాపు 53 లక్షల రూపాయల నుంచి 56 లక్షల రూపాయల వరకు). దాంతో విదేశాలతో పోలిస్తే ఇక్కడ సరొగసీ చవక కావడంతో అక్కడి నుంచి మన దేశానికి విదేశీయులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ‘వాణిజ్యపరమైన సరోగసీ పద్ధతి’ పెద్ద ఎత్తున సాగింది. ఐక్యరాజ్యసమితి 2012లో వేసిన ఒక అంచనా ప్రకారం, భారతదేశంలో సరోగసీ ద్వారా ఏడాదికి 400 మిలియన్ డాలర్ల (2,845 కోట్ల రూపాయల) వాణిజ్యం జరిగినట్లు అంచనా వేసింది. దాదాపు 3,000 సంతానోత్పత్తి కేంద్రాలలో 25,000 మంది పిల్లలు జన్మించినట్లు కూడా అంచనా. దీంతో పాటు మరికొన్ని సమస్యలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2015లో విదేశీ దంపతులకు భారత్‌లో సరోగసీని నిషేధించింది. అంతేకాదు... 2018 డిసెంబర్‌లో మరికొన్ని మార్పులతో ‘సరోగసీ (రెగ్యులేషన్) బిల్ 2016 పేరిట ఒక కొత్త చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించింది. దాని ప్రకారం ఈ కింది నిబంధనలతో కొత్త చట్టంలో ఈ కింది సవరణలు ఉన్నాయి.
సరోగసీకి ఎవరు అర్హులు
భారతీయ పౌరులు మాత్రమే.
మహిళ వయసు 23– 50 ఏళ్లు ఉండాలి.
పురుషుడి వయసు 26 – 55 ఏళ్లు ఉండాలి.
వివాహం జరిగి కనీసం ఐదేళ్లు నిండాలి.
దంపతులిద్దరికీ దత్తత ద్వారాగానీ, సరోగసీ ద్వారాగానీ, సొంత పిల్లలుగానీ ఉండకూడదు.
సరోగసీ తల్లిగా గర్భాన్ని ఇవ్వడానికి ఎవరు అర్హులు?
దగ్గరి బంధువు
వివాహితులు
25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు
వారికి పిల్లలు కలిగి ఉండాలి.
ఎన్నారై లేదా విదేశీయులు అయి ఉండకూడదు.
జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియను అనుసరించడానికి అర్హులు.
స్వచ్ఛందంగా మాత్రమే ఇది జరగాలి. పారితోషికం తీసుకోకూడదు.
అనుమతి లేనిదెవరికి?
∙విదేశీయులకు ∙ఎన్నారైలకు ∙స్వలింగసంపర్కులకు ∙ఒంటరి తల్లిదండ్రులు ∙విడాకులు పొందిన వితంతువు అవివాహిత
∙ఇప్పటికే పిల్లలున్న జంటలు
అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందా?
జమ్మూ, కశ్మీర్‌కు తప్ప అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది.
ఉల్లంఘనకు పాల్పడితే...
జరిమానాగా పది లక్షల రూపాయల నగదుతో పాటు పదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష. చివరగా... ఇదీ స్థూలంగా కొత్తచట్టంలోని నిబంధనలు. అయితే దీనిపై చాలా చర్చ జరుగుతోంది. అమ్మదనాన్ని అందరూ కోరుకుంటారు. కావాలని ఎవరూ సరోగసీ చేయించుకోరు. అయితే కొందరు గర్భం మోయడానికి భయపడేవారు, అంతకాలం గర్భం మోయడానికి సమయం కేటాయించలేనివాళ్లూ సరోగసీ వైపునకు వెళ్తే వెళ్లవచ్చు. కానీ అలాంటివారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి సమయంలో ఈ కొత్త చట్టంలోని కొన్ని నిబంధనలు నిజంగా అవసరమైన వారికి కూడా మేలు చేయవంటూ వైద్యవర్గాల్లో ఒక చర్చ మొదలైంది. ఉదాహరణకు పారితోషికం తీసుకొని సరోగసీకి సిద్ధం కావడంపై నిషేధం ఉంది. అలాంటప్పుడు అది రహస్యంగా జరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే కేవలం బంధువులు మాత్రమే అర్హులంటే... ఈ ప్రక్రియకు ఇష్టపడని బంధువర్గాన్ని బలవంతంగా ఒప్పించే అవకాశాలూ ఉంటాయి కదా. ఇక భారతదేశంలోని ఏ రాష్ట్రానికీ లేని సౌలభ్యం జమ్మూకశ్మీర్‌కు ఉంది. అలాంటప్పుడు ఇక్కడి జంటలు అక్కడికి వెళ్లడానికి, అక్కడా అలాంటి అక్రమాలకు అవకాశం ఉండదా అనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ప్రశ్నలు, లొసుగులు ఉన్నందున వైద్యవర్గాల్లోనూ, ఈ ప్రక్రియ ద్వారానే సంతానం కలిగే అవకాశమున్నవారిలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మాతృత్వం మహిళలందరూ అనుభవించాలనుకునే అమూల్య భావన. సరోగసీ అనే వసతి ఉందనే ఉద్దేశంతో దాన్నే అందరూ కోరుకోరూ, ఎవరూ అలా వాడుకోరు. అందువల్ల నిబంధనలన్నవి ఎల్లవేళలా అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా ఉండాలే తప్ప... ప్రతికూలమూ, ప్రతిబంధకమూ కాకూడదన్నదే వైద్యవర్గాల భావన.
డాక్టర్ నర్మద కటకం
ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మెడికల్ డైరెక్టర్,
జెనెసిస్ ఫెర్టిలిటీ – లాపరోస్కోపిక్ సెంటర్, కొత్తపేట, హైదరాబాద్
సరోగసీ...
Published Thu, Jan 31 2019 12:38 AM | Last Updated on Thu, Jan 31 2019 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment