సంతానం కోసం తొలుత సహజంగా ప్రయత్నిస్తారు. కుదరకపోతే ఇంట్రాయుటెరైన్ ఇన్‌సెమినేషన్(ఐయూఐ)ని ఆశ్రయిస్తారు. అదీ జరగకపోతే చివరి ప్రయత్నంగా ఐవీఎఫ్ చేస్తారు. అదే... టెస్ట్‌ట్యూబ్ బేబీ! ఆ బేబీ కోసం ఓ పరీక్ష నాళికలో అద్దాల్లోంచి చూస్తూ ఫలదీకరణం చేస్తారు. టెస్ట్‌ట్యూబ్ అద్దంలోంచి కనిపించే ఆ పిండం అద్దమంత సున్నితమైంది. అద్దంలా భద్రంగా చూసుకోవలసినది. అద్దంలో చందమామను చూపుతూ రామభద్రుడికి బువ్వ తినిపించారని ప్రతీతి. అద్దంలోని చందమామలాంటి బిడ్డను తీసి దంపతులకు ఇవ్వడమంత సంక్లిష్టయత్నం ‘ఐవీఎఫ్’! ఆ ప్రక్రియపై అవగాహన కోసమే ఈ కథనం.
గతవారం సంతానం లేని మహిళలకు చేయించాల్సిన అనేక చికిత్సలతో పాటు సంతానసాఫల్య చికిత్సలో భాగంగా చేసే కొన్ని ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. అయితే వాటన్నింటికీ తలమానికం లాంటిదీ, చివరి ఆశగా ప్రయత్నించేదీ అయిన ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ విధానం గురించి ఈ వారం తెలుసుకుందాం. సాధారణంగా మహిళలో ఒక అండం, పురుషుడి శుక్రకణంతో కలిసి, ఫలదీకరణం జరిగితే, అప్పుడది పిండంగా మారి గర్భాశయంలోకి చేరి (ఇంప్లాంటేషన్ జరిగి), అప్పుడు శిశువుగా మారి, గర్భంలో పెరుగుతుంటుంది.
ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలుండి, గర్భం కోసం మందుల ద్వారా ప్రయత్నించినా, భర్త వీర్యాన్ని చిన్న కంటెయినర్‌లో సేకరించి, స్పెర్మ్ వాషింగ్ మీడియాలో దాన్ని శుభ్రపరచి, ఆరోగ్యకరమైన వీర్యకణాలను వేరుపరచి, అండం విడుదలయ్యే రోజుల్లో గర్భాశయంలోపలికి పంపే ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ) అనే ప్రక్రియ కూడా విఫలమయ్యాక... చివరి ఆశగా ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అని పిలిచే ప్రక్రియను ప్రయత్నిస్తారు. దీన్నే జనసామాన్య (పాపులర్) పరిభాషలో ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ ప్రక్రియ అంటారు.
ఐవీఎఫ్ ప్రక్రియలో ఏం చేస్తారు?
1 అండాశయాలను ఉత్తేజపరచడం (ఒవేరియన్ స్టిమ్యులేషన్): ఇందులో భాగంగా అండాశయాల నుంచి ఎక్కువ అండాలు (10 – 20... ఆపైన) తయారుకావడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు.
ఈ సమయంలో మహిళలకు క్రమంగా వెజైనల్ స్కానింగ్ ద్వారా అండాలను పర్యవేక్షిస్తూ, హార్మోన్ పరీక్షలు చేస్తూ, అండాల సంఖ్య, సైజు నిర్ణీతస్థాయికి వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంటుంది.
2 అండాలను తీయడం (ఎగ్/ఊసైట్ రిట్రైవల్) : అండాలు తగిన సైజుకు పెరిగాక, వాటిని స్కానింగ్ ద్వారా చూస్తూ మహిళకు నొప్పి తెలియకుండా మందులు ఇచ్చి, యోని భాగం నుంచి సన్నటి, పొడవాటి సూది ద్వారా ఇరువైపుల ఉన్న అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు.
3 ఫలదీకరణ : బయటకు తీసిన అండాలను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తూ, మంచి అండాలను వేరుపరచి, వాటిని శుభ్రపరచి వేరుపరచిన శుక్రకణాలతో న్యూట్రిషన్ మీడియా కలిగిన చిన్న డిష్‌లో కలపడం జరుగుతుంది. కొన్ని గంటల తర్వాత శుక్రకణం, అండంతో కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఇది అనేక కణాలుగా విభజితమవుతూ, పిండంగా మారుతుంది. ఇంతకుమునుపు మనం బయటకు తీసిన అండాలన్నీ ఫలదీకరణ చెందకపోవచ్చు. వాటిలో కొన్ని మాత్రమే పిండంగా ఏర్పడతాయి.
ఐసీఎస్‌ఐ (ఇక్సీ) : అండాలను, శుక్రకణాలతో కలిపినా, కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల శుక్రకణాలు వాటంతట అవే అండంలోకి ప్రవేశించకపోవచ్చు. అలాంటప్పుడు శుక్రకణాన్ని సన్నటి సూది ద్వారా అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఇక్సీ) అంటారు.
4 పిండ విభజన (ఎంబ్రియో కల్చర్) : ఫలదీకరణ జరిగిన అండాలను, న్యూట్రిషన్ మీడియా కలిగిన డిష్‌లో పెట్టి, ఇంక్యుబేటర్‌లో 3 – 5 రోజుల పాటు ఉంచుతారు. వీటిలో కణాలు విభజన చెందుతూ తయారైన పిండాన్ని 3 నుంచి 5 రోజులలోపు బయటకు తీసి, వాటి నాణ్యతను మైక్రోస్కోప్‌లో చూస్తారు.
5 పిండాన్ని గర్భాశయంలోకి పంపడం (ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్): అలా ఇంక్యుబేటర్‌లో కాస్తంత పెరిగిన పిండాలలోని మంచి పిండాలను వేరుపరచి, వాటిలో 2, 3 పిండాలను సన్నటి కాన్యులా ద్వారా యోనిభాగం నుంచి నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాలను ఫ్రీజ్ చెస్తారు.
6 ఇంప్లాంటేషన్ : ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ద్వారా గర్భాశయంలోకి పంపించిన పిండాలను, గర్భాశయంలోని పొరలోకి అంటుకుపోయి, పెరగడం మొదలవుతాయి. కానీ ఇది అందరిలోనూ జరగకపోవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరడానికి, గర్భాశయపొర సరిగా ఉండాలి. దానికి రక్తప్రసరణ, హార్మోన్లతో పాటు ఇంకా తెలియని అనేక రసాయన అంశాలు సక్రమంగా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భాశయం పిండాన్ని స్వీకరిస్తుంది. అలా స్వీకరిస్తేనే గర్భం నిలుస్తుంది. అయితే ఇలా అందరిలోనూ పిండం ఎందుకు అతుక్కోదో ఇంకా చాలావరకు కారణాలు తెలియరాలేదు. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్లే, చివరి ఆశ అయిన ‘టెస్ట్‌ట్యూబ్’ పద్ధతిలోనూ గర్భం దాల్చే అవకాశాలు 40 – 50 శాతం వరకు మాత్రమే ఉంటాయి.
ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్
∙పిండం గర్భాశయపొరలోకి అంటుకుపోయేలా చేసే ‘ఇంప్లాంటేషన్’ విజయవంతం అయ్యేందుకు (సక్సెస్ రేటు పెంచడానికి) అనేక రకాల మందులను, మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, జెల్స్ రూపంలో ఇవ్వాలి. ఏదో ఒకటి పనిచేయకపోతుందా అనే ఆశతో ఇవన్నీ చేస్తారు.
∙అలాగే కొందరిలో పిండం పై పొరకీ చిన్న చిల్లు పెట్టడం (అసిస్టెడ్ హ్యాచింగ్) వంటి రకరకాల ప్రక్రియలతో ప్రయత్నం చేస్తారు.
∙ఇలా అన్ని విధాలా ప్రయత్నించినా కూడా టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా 100 శాతం విజయం సాధించగలమని ఎవరికీ హామీ ఇవ్వరు. ఎందుకంటే ఎవరిలో, ఎందుకు గర్భాశయం పిండాన్ని తీసుకోదో స్పష్టంగా తెలియదు కాబట్టి.
∙‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ పద్ధతి ఒకరిలో ఒకసారి ఫలించకపోతే, కొన్ని నెలలు ఆగి, మళ్లీ ప్రయత్నించవచ్చు. ఇలా 3 – 6 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. ఒకోసారి సఫలం కాకపోతే, మళ్లీ ఒకసారి దంపతులకు చేయించిన పరీక్షలన్నీ తిరిగి చూసుకుంటూ, కారణాలను సమీక్షించుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ విశ్లేషించుకుంటూ, వేరే అవసరమైన పరీక్షలు ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చేయించి, చికిత్సల్లో కొద్దిపాటి మార్పులు చేస్తూ, మళ్లీ టెస్ట్‌ట్యూబ్‌బేబీ పద్ధతిని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరిలో పిండం నాణ్యత సరిగా లేకపోయినా, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో కొన్ని బయటకు తెలియని, కనిపించని సూక్ష్మమైన సమస్యలు ఉన్నా గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు, రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలనూ లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని, దంపతుల అంగీకారం మీద, వాడుకొని ప్రయత్నించవచ్చు. అప్పటికీ కుదరకపోతే అప్పుడు సరోగసీ పద్ధతిని ప్రయత్నించవచ్చు.
ఎంబ్రియో ఫ్రీజింగ్ : ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా ఫలదీకరించక ఏర్పడిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా పిండాలను విట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఇలా భద్రపరచడాన్ని క్రయోప్రిజర్వేషన్ అంటారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలని కోరుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. లేదా ఎవరికైనా అవసరమైన దంపతులకు దానం చేయవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు.
∙ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (ఎఫ్‌ఈటీ) : కొంతమందిలో ఐవీఎఫ్ చేశాక పిండాలు ఏర్పడిన 3వ రోజు నుంచి 5వ రోజు లోపల, వాటిని గర్భాశయంలోకి పంపుతారు. ఆ నెలలో గర్భం నిలబడకపోతే, ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోను ఆ మరుసటి నెలలో పంపుతారు. దీనికంటే ముందు గర్భాశయపొర (ఎండోమెట్రియమ్) పొర బాగా ఏర్పడటానికి మందులు ఇచ్చి, స్కానింగ్‌లో ప్రక్రియనంతా పర్యవేక్షిస్తూ, గర్భాశయంలోకి పంçపుతారు. కొంతమందిలో ఐవీఎఫ్ చేసిన నెలలో, హార్మోన్స్ సరిగా లేకపోయినా, గర్భాశయపొర సరిగా ఏర్పడకపోయినా, పిండాలను ఫ్రీజ్ చేసి, ఆ తర్వాతి నెలలో గర్భాశయంలోపలికి పంపడం అంటే.... ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడమాంటారు.
ఐవీఎఫ్ వల్ల దుష్ఫలితాలు
∙ఇందులో వాడే మందుల వల్ల కొందరిలో, ఒక్కోసారి వారి శరీర తత్వాన్నిబట్టి తలనొప్పి, వికారం, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
∙అండాలను బయటకు తీసేటప్పుడు కొందరిలో బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో పేగులకు, మూత్రాశయానికి, రక్తనాళాలకూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అవి కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉండవచ్చు.
∙మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ : ఐవీఎఫ్‌లో కొందరిలో ఒక్కోసారి కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు (ట్రిప్లెట్స్) కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నెలలు నిండకుండానే కాన్పులు అవ్వడం, పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం వంటివి కనిపిస్తాయి.
ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ : కొందరిలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి మరీ ఎక్కువ అండాలు తయారై, వాటి విడుదలకు వాడే హెచ్‌సీజీ ఇంజెక్షన్ వల్ల అండాశయాలు బాగా వాయడం, కడుపులోకి నీరు రావడం, కడుపులో నొప్పి, వాంతులు కావడం జరగవచ్చు. మరికొందరిలో కడుపు ఉబ్బడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరి తీవ్రమైన ఆయాసం, రక్తం గూడుకట్టడం, నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకం అయ్యే అవకాశాలూ ఉంటాయి.
∙ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ : కొందరిలో ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా గర్భాశయంలోకి పంపించిన పిండం కొద్దిగా వెనక్కు వెళ్లి, ట్యూబ్‌లో అంటుకుని, అక్కడ గర్భం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి.
∙గర్భస్రావాలు (అబార్షన్సు) : మామూలుగా గర్భం దాల్చినవాళ్లలోలాగే ఇలా ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినవాళ్లలో కూడా ఏ సమయంలోనైనా గర్భస్రావం కావచ్చు. వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, పిండం నాణ్యత బాగా లేకపోవడం వంటి సందర్భాల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువ.
∙అవయవలోపాలు : సాధారణంగా పుట్టే అందరు పిల్లల్లోనూ ఎలాగైతే 2 – 3 శాతం వరకు అవయవలోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయో, అలాగే ఈ పిల్లల్లోనూ అవయవలోపాలు వచ్చే అవకాశాలు అంతే ఉంటాయి. కాకపోతే తల్లివయసు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్లో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. (అయితే కేవలం ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల ఈ లోపాలు వచ్చాయని భావించేందుకు అవకాశం లేదు).
∙ఒవేరియన్ క్యాన్సర్ : దీర్ఘకాలంపాటు అండాలు తయారు కావడానికి వాడే మందుల వల్ల, 100 మందిలో ఒకరికి అరుదుగా ఎప్పటికో అండాశయాల క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ అని ఒక అంచనా.
∙మానసిక ఒత్తిడి : ఐవీఎఫ్ ప్రక్రియ కాస్త ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి ఇందుకోసం డబ్బు ఖర్చు పెట్టాలి. ఎక్కువ సమయమూ వెచ్చించాలి. ఇంత చేశాక కూడా ఇది గ్యారంటీ లేని చికిత్స కాబట్టి ఈ అన్ని కారణాలతో కాబోయే దంపతుల్లో... ముఖ్యంగా తల్లికావాలని కోరుకుంటున్న మహిళకు ఆందోళన, టెన్షన్, కుంగుబాటు వంటివి కలిగే అవకాశాలుంటాయి.
ఐవీఎఫ్ విజయావకాశాలు (సక్సెస్ రేటు)
ఇది మహిళ వయసు మీద ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్లు దాటాక వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. అండాల నాణ్యత, పిండం నాణ్యత తక్కువగా ఉంటే సక్సెస్ రేటు ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అలాగే గర్భాశయంలో సమస్యలు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యల తీవ్రత పెరుగుతున్న కొద్దీ విజయావకాశాలూ అదే రీతిలో తగ్గుతుంటాయి. ఇక జీవనశైలి (లైఫ్‌స్టైల్)పై కూడా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు పొగతాగేవారు, ఆల్కహాల్ తీసుకునే అలవాటున్నవారు, అధిక బరువు ఉన్నవారిలో అండాల సంఖ్య, నాణ్యత తక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా సక్సెస్‌రేటు తగ్గుతుంది.
ఐవీఎఫ్ ఎవరికి
∙సాధారణ చికిత్స, ఐయూఐ చికిత్సలతో గర్భం రాకుండా, వేరే ఇతర సమస్యలేవీ లేకుండా (అన్‌ఎక్స్‌ప్లెయిన్‌డ్ ఇన్‌ఫెర్టిలిటీ) ఉండి, ఇంకా వేచిచూసే ఓపిక లేనివాళ్లకి.
∙వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి; ఇంకా 35 ఏళ్లు దాటి, వారి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోయి, సాధారణ చికిత్సతో గర్భం రాకపోతే.
∙రెండు ట్యూబ్‌లూ మూసుకుపోయిన వాళ్లకి, ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత, మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు; పురుషుల్లో వాసెక్టమీ చేయించుకున్న తర్వాత మళ్లీ ఏదైనా కారణాల వల్ల పిల్లలను కోరుకుని అందుకోసం ‘రీకెనలైజేషన్’ ఆపరేషన్ చేయించుకున్నా అది సక్సెస్ కానప్పుడు.
∙సాధారణ చికిత్సతో అండాలు సరిగా తయారు కానప్పుడు.
∙ఎండోమెట్రియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.
∙వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు.
∙జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు : భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఐవీఎఫ్ ప్రక్రియను పాటించి, తయారైన పిండాలనుంచి ఒక దాన్ని తీసి, ప్రీ–ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) ద్వారా పరీక్ష చేసి, జన్యు సమస్య లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపిస్తారు.
∙దాత అండాలను వాడాల్సి వచ్చినప్పుడు
∙క్యాన్సర్ చికిత్స : శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ నిర్ధారణ అయి, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సకు వెళ్లేముందు, అండాలను బయటకు తీసి, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా అండాలను ఫలదీకరణ చేసుకొని, పిండాలను ఫ్రీజ్ చేసి, చికిత్స పూర్తయ్యాక వాటిని ‘ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ పద్ధతిలో గర్భాశయంలోకి పంపవచ్చు.
∙సామాజిక కారణాలు (సోషల్ రీజన్స్) : కొందరు కెరియర్ కోసం లేదా వ్యక్తిగత కారణాల వల్ల గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకుని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ద్వారా గర్భశయంలోకి ప్రవేశపెట్టుకుని, గర్భం ధరిస్తారు. ఇక మరికొందరు పెళ్లిని వాయిదా వేసుకుని, అండాలను ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసిన అండాలు, పిండాలను ఆ తర్వాత ఉపయోగించుకుంటారు. అయితే బయట కాబోయే తల్లి వయసు పెరిగినప్పటికీ అండం, లేదా పిండానికి మాత్రం అది సేకరించిన నాటి వయసే ఉంటుంది.
డా‘‘ వేనాటి శోభ,
సీనియర్ గైనకాలజిస్ట్
బర్త్‌రైట్ బై రెయిన్‌బో,
హైదర్‌నగర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment