విషజ్వరాల విజృంభణ
వేలాదిగా మలేరియా, డెంగీ, గున్యా కేసులు
నివారణలో అధికారుల వైఫల్యం
నీరసించిన గిరిజనం
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నాలుగు చినుకులు పడ్డాయో లేదో అప్పుడే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ తదితర రోగాలు విజృంభిస్తున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1153 మలేరియా కేసులు, 55 డెంగ్యూ, 34 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రికార్డయినవి మాత్రమే. ఇక ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న రోగులసంఖ్యకు లెక్కే లేదు. ప్రభుత్వం వద్ద కనీసం ఈ రికార్డులు కూడా లేవు. రోగుల్లో 30 శాతం మంది మాత్రమే ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యశాఖవర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు లక్షకుపైగా మలేరియా కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాటిలో 50 వేల కేసులు తెలంగాణలో నమోదైనవే. అంటువ్యాధులను అరికట్టేందుకు తగిన సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది రాష్ట్రంలో లేకపోవడం గమనార్హం. వైద్యశాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డెరైక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో 500 మంది వైద్యులు, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల పరిధిలో 250 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సత్వరం భర్తీ చేయాలని ప్రతిపాదనలు పంపినా చర్యల్లేవు.