ఆ ఇద్దరితోనే రైతులకు కష్టాలు
కరీంనగర్ : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్‌తో కలిసి ఆయన కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి, వడగళ్లకు నష్టపోయిన రైతులతోను, పార్టీ ప్రతినిధులతోనూ సమీక్షించారు. వ్యవసాయాన్ని, రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
రైతులకు వ్యతిరేకమైన భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కేసీఆర్ మద్దతు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు ఖండించాలని కోరారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు మెరుగుపడతాయని భావించిన రైతులకు తీరని నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. వాటర్ గ్రిడ్ బిల్లు రైతులకు వ్యతిరేకమైందని ఆరోపించారు. రైతుల అనుమతి లేకుండా వారి పంట పొలాల్లో నుంచి పైప్‌లైన్ వేసుకునే విధంగా, అలాగే పైప్‌లైన్ వేసిన చోట చెట్లను నాటకుండా నిరోధించే చర్యలు తీసుకునే అవకాశం వాటర్ గ్రిడ్ బిల్లులో ఉందని చెప్పారు. అందుకే వాటర్ గ్రిడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు.