స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులు 1995 తరువాత ఇద్దరికి మించి సంతానం కలిగి ఉండరాదని ప్రభుత్వం నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ సంతానం వివరాలను ఎన్నికల అధికారులకు రాత పూర్వకంగా వివరించాల్సి ఉంటుంది. మోర్తాడ్ ఎంపీపీగా ఎన్నిక కాక ముందు దొన్కల్ ఎంపీటీసీ స్థానంకు నామినేషన్ వేసిన చిన్నయ్య తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వెల్లడించారు.
అయితే చిన్నయ్యకు ఇద్దరు ఆడపిల్లలతో పాటు ఒక కొడుకు ఉన్నాడని, చిన్న కూతురు 1995 తరువాతనే జన్మించిందని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చిన్నయ్యను ఎంపీపీ పదవి నుంచి తొలగిస్తూ, ఎంపీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు కోరారు. చిన్నయ్యకు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు ఉన్నాడని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత రెండో భార్యను చేసుకోగా ఇద్దరు కూతుళ్లు జన్మించారని ఫిర్యాదులో వివరించారు. 1995 తరువాత మూడో సంతానం కలుగగా ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలను ఇచ్చారని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
జిల్లా అధికారులకు ఫిర్యాదు అందగా వారు విచారణ జరిపి ఎన్నికల సంఘంకు నివేదిక అందించాల్సి ఉంది. కాగా దళితుడైనందుననే కొందరు అగ్రవర్ణాల నాయకులు తనపై కక్షగట్టి తప్పుడు ఫిర్యాదు చేశారని ఎంపీపీ చిన్నయ్య ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారని చెబుతున్నారు.
డ్రా పద్ధతిలో ఎంపికైన ఎంపీపీ
ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల తరువాత ఎంపీపీ పీఠంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పట్టుబట్టి ఎవరి ప్రయత్నం వారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఉన్నా కొందరు ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్ శిబిరంలో చేరడంతో ఎంపీపీ ఎన్నికకు పోటీ అనివార్యం అయ్యింది. డ్రా పద్ధతిలో ఎంపీపీగా చిన్నయ్య ఎంపికయ్యారు. తాను ప్రతిపక్ష పార్టీ ద్వారా ఎంపీపీగా ఎన్నిక కావడం వల్లనే అధికార పార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేస్తు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీపీ ఆరోపించారు. ఎలాంటి ఆరోపణలనైనా తిప్పి కొడతానని, తన పదవికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు.
ఆ ఎంపీపీకి ముగ్గురు పిల్లలున్నారు !
Published Tue, Sep 9 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement