మంచిర్యాల సిటీ : వేద మంత్రాలు, ఏడడుగులు, తలంబ్రాలు, కొత్తబట్టలు, బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, మిత్రుల నృత్యాలు, అప్పగింతలు, విందు భోజనం.. ఇదీ పెళ్లి జరిపించే సంప్రదాయం. నాటి కాలంలో మొదలైన ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆధునిక యుగంలోనూ నేటి యువత నాటి సంప్రదాయాన్నే గౌరవిస్తూ.. ఆ పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటోంది.
గుడిలో దండలు మార్చడం, రిజిష్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలతో సరిపెట్టుకుపోవడం వరకు కాలం మారినా సంప్రదాయానికి తమ ఓటు అని అంగీకరిస్తున్నారు. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ నూరేళ్ల పాటు గుర్తుగా ఉంచుకోడానికి సంప్రదాయాన్ని మరువడం లేదు. కాలంతోపాటు మనుషులూ మారుతున్నారు. వారి జీవన శైలీ మారుతోంది. ఆస్తులు, అంతస్తులు పెరిగి పోతున్నాయి. వ్యక్తుల స్థోమతకు తగిన విధంగా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపిస్తున్నారు.
వరపూజ..
అబ్బాయి, అమ్మాయికి ఒకరికి ఒకరు ఇష్టమైన తరువాత జరిగే మొదటి కార్యక్రమం వరపూజ. మంచి శుభదినాన్ని ఎంపిక చేసి శుభలేఖను రాసి పండితులు వధూవరుల పెద్దలకు అందజేస్తారు. ఇరువురి ఇంట్లో భోజనాలు చేస్తారు. ఒకరికొకరు కొత్త బట్టలు పెట్టుకుంటారు.
గణపతి పూజ..
వివాహంలో తొలి పూజ. ప్రతి పూజా కార్యక్రమంలో గణపతి పూజ చేయడం హిందూ సంప్రదాయం. వధూవరులకు ఎలాంటి కష్టాలు రానివ్వరాదని కోరుతూ చేసే పూజ ఇది.
గౌరీపూజ..
వధువుకు సంబంధించిన పూజ ఇది. సకల దేవతలకు పూజనీయురాలైన గౌరీ మాతను పూజించడం సంప్రదాయం. ఈపూజతో అష్టైశ్వర్యాలు కలిగి వివాహ బంధంలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం.
సుముహూర్తం
వివాహ వేడుకకు లగ్న పత్రికలో పెట్టుకున్న ముహూర్తానికి అనుగుణంగా జీలకర్ర బె ల్లం తల మీద వధూవరులు పెట్టుకోడమే అసలైన సుముహూర్తం. దీన్నే ముహూర్త బలం అంటారు. దీంతో వధువు వరుడి సొంతం అయినట్టుగా భావించాలి.
అరుంధతి నక్షత్రం
పెళ్లి ముహూర్తం రాత్రి, పగలుతో సంబంధం లేకుండానే అరుంధతి నక్షత్రాన్ని వధూవరులకి చూపిస్తారు. ఈ నక్షత్రాన్ని చూడటం వలన దంపతుల సంసారం సుఖఃశాంతులతో ఉంటుందని నమ్మకం.
తలంబ్రాలు
వివాహనికి చివరి అంకం ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం. సంసార నౌకకు ఇద్దరూ సమానమే. ఒకరికి ఒకరు సమానమే. పసుపుతో కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు అంటారు. వీటిని వధూవరులు ఒకరి తలపై ఒకరు ఆనందంగా పోసుకుంటారు. కష్టం, సుఖం ఇద్దరికీ సమానమనే భావం కలిగించేది తలంబ్రాలు.
వేద మంత్రాలు.. ఏడడుగులు..
Published Mon, Aug 11 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement
Advertisement