జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు. (ఇన్‌సెట్)లో గొర్రెల చెవులకు ట్యాగ్‌లను తొలగించడంతో కనిపిస్తున్న రంధ్రాలు
ఇటిక్యాల (అలంపూర్): రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం రోజురోజుకూ మరింతగా పక్కదారిపడుతోంది. దీనిపై పెద్దఎత్తున వార్తలు వెలువడుతున్నా.. మంత్రులస్థాయిలో హెచ్చరికలు వచ్చినా, అవకతవకలకు పాల్పడిన కొందరిపై చర్యలు చేపట్టినా.. ‘రీసైక్లింగ్’ జరుగుతూనే ఉంది. దళారులు ఈ గొర్రెలను పక్క రాష్ట్రాలకు తరలిస్తుండగా వాటినే తిరిగి సేకరణ పేరిట కొత్త లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నారు. ఇలా రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు గొర్రెలను తరలిస్తున్న వ్యాన్ శుక్రవారం బోల్తాపడి 79 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వాటి చెవులకున్న ట్యాగ్‌లను తొల గించినట్లుగా రంధ్రాలుండటంతో ‘రీసైక్లింగ్’ గొర్రెలుగా గుర్తించారు.
పట్టుబడకుండా తెల్లవారుజామున: గురువారం అర్ధరాత్రి దాటిన అనంతరం సూర్యాపేట జిల్లా సిద్దిసముద్రం తండా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు ఓ డీసీఎం వ్యాన్‌లో 139 సబ్సిడీ గొర్రెలను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ రవి నిద్రమత్తులో ఉండడంతో.. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ వద్ద వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్ డ్రైవర్ రవితోపాటు రఘునాయక్, రాముడు అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వ్యాన్‌లోని 79 గొర్రెలు చనిపోయాయి. మిగతావాటికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ రవి, రఘునాయక్, రాముడులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు.
గొర్రెల విషయంపై పశువైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇటిక్యాల పశువైద్యాధికారి భువనేశ్వరి, ధర్మవరం పశువైద్య సబ్ సెంటర్ వైద్యుడు రాజేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని గొర్రెలను పరిశీలించారు. చనిపోయినవాటిని పూడ్చి పెట్టించి, బతికున్న వాటిని స్థానిక వీఆర్‌ఏలకు అప్పగించారు. అయితే ఈ గొర్రెలన్నీ సబ్సిడీపై అందజేసినవేనని, రీసైక్లింగ్ కోసమే అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారని పశువైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. ప్రతీ గొర్రె చెవికి ట్యాగ్ వేసిన గుర్తులు (రంధ్రాలు) ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేసిన సబ్సిడీ గొర్రెలను.. వాటి చెవులకు వేసిన ట్యాగ్‌లను తొలగించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment