ట్యుటోరియల్, కోచింగ్
సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలంటే అందుకు సంబంధించి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడం తప్పనిసరైంది. ప్రత్యేక శిక్షణతోనే ఉద్యోగాలు వస్తాయనే ధీమా యువతలోనూ బలంగా నాటుకుంది. ఈ పరిస్థితిని అదనుగా చేసుకున్న కొందరు.. ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్‌ను తెరిచేస్తున్నారు. వీటి ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తున్నారు. అధికమొత్తంలో ఫీజులు వసూలు చేయడంపై విద్యాశాఖకు ఫిర్యాదులు సైతం వస్తున్నాయి
. ఈ క్రమంలో అడ్డగోలు వసూళ్లకు కళ్లెం వేయడంతోపాటు ఆయా సంస్థల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి కోచింగ్ సెంటర్, ట్యుటోరియల్ ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న వాటికి సంబంధించి యాజమాన్యాలు కూడా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్‌కు సంబంధించి అనుమతి కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు కేటగిరీల వారీగా ఫీజును సైతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి ఉన్న వాటిల్లోనే ప్రవేశాలు చేయాలనే నిబంధనను సైతం కచ్చితం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమికంగా కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్‌పై సర్వే నిర్వహించారు.
ఈ క్రమంలో పదుల సంఖ్యలో బ్యాచ్‌లు నిర్వహిస్తూ పరపతి సాధించిన సంస్థల కేటగిరీలో 323 సంస్థలున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే చిన్నా, చితకా అన్నీ కలుపుకుంటే వేల సంఖ్యలో ఉంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఇకపై ప్రభుత్వ అనుమతితోనే కొనసాగించాల్సిందేనని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ‘సాక్షి’తో అన్నారు.
శిక్షణకు అనుమతి తప్పదు
Published Sat, Nov 28 2015 11:57 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement