తాగి నడిపితే ఉద్యోగం పోయినట్లే!  | Transco Warning for Electric Employees | Sakshi
Sakshi News home page

తాగి నడిపితే ఉద్యోగం పోయినట్లే! 

Published Wed, May 8 2019 1:45 AM | Last Updated on Wed, May 8 2019 1:45 AM

Transco Warning for Electric Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాన్స్‌కో ఉద్యోగులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ.. రహదారుల భద్రత విషయంలో ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సంస్థ సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఆదేశించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే, మద్యం సేవించి వాహనాలు నడిపే సంస్థ ఉద్యోగులు, ఆర్టిజన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఈ నెల 4న ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు విద్యుత్‌ ఉద్యోగులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఇలా చేసే వారు తమ ప్రాణాలనే కాకుండా రోడ్డు మీద వెళ్లే ఇతర అమాయక ప్రజలకు ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) నిబంధనల ప్రకారం విద్యుత్‌ ఉద్యోగులు మద్యం, డ్రగ్స్‌ తీసుకుని విధులకు హాజరైనా, మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో కనిపించినా తీవ్ర ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. 2017 నవంబర్‌ 17న జారీ చేసిన ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల ప్రకారం మద్యం, డ్రగ్స్‌ తీసుకుని విధులకు హాజరైనా, అల్లర్లకు పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.  

ట్రాన్స్‌కోకు ట్రాఫిక్‌ పోలీసు లేఖ.. 
హైదరాబాద్‌ నగర శివారులో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న ఓ విద్యుత్‌ ఉద్యోగి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిపై రూ.1,200 జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు అతడి ఐడీ కార్డు ఆధారంగా ట్రాన్స్‌కో ఉద్యోగిగా గుర్తించారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో సీఎండీకి తెలియజేస్తూ సదరు ఆర్టిజన్‌పై శాఖాపర చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎండీ ఉద్యోగులందరికీ సర్క్యులర్‌ జారీ చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement