ఒక్క టికెట్‌.. తీరొక్క జర్నీ | Travel in rtc ,Metro ,cab on a single ticket | Sakshi
Sakshi News home page

ఒక్క టికెట్‌.. తీరొక్క జర్నీ

Published Tue, Aug 28 2018 2:02 AM | Last Updated on Tue, Aug 28 2018 2:02 AM

Travel in rtc ,Metro ,cab on a single ticket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక్క టికెట్‌పై తీరొక్క రవాణా అందుబాటులోకి రానుంది. బస్సు, రైలు, క్యాబ్, ఆటో అన్నింటికీ ఇక ఒకే టిక్కెట్‌. సమయానికి ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనంలో ఎంచక్కా బయలుదేరవచ్చు. ఠంఛన్‌గా అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఈ స్మార్ట్‌కార్డుతో షాపింగ్‌ కూడా చేయొచ్చు. వస్తువులు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం నోయిడా, నాగ్‌పూర్‌ వంటి నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న ‘సింగిల్‌ టికెట్‌పై మల్టీ ట్రాన్స్‌పోర్ట్‌ జర్నీ’త్వరలో నగరంలో అందుబాటులోకి రానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సిటీబస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లతోపాటు ఉబర్, ఓలా క్యాబ్‌లు, ఆటోల్లో కూడా ఒకే టికెట్‌పైన ప్రయాణం చేయవచ్చు.

ప్రజారవాణాలో ముందడుగుగా భావించే మల్టీట్రాన్స్‌పోర్టు స్మా ర్ట్‌ కార్డుపైన సోమవారంఇక్కడి బస్‌భవన్‌లో విస్తృత చర్చలు జరిగాయి. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ నేతృ త్వంలో ఏర్పాటైన టాస్క్‌పోర్స్‌ కమిటీలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు శర్మ, అల్కా, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు అనిల్‌ సైనీ, రవీందర్‌రెడ్డి, ఉబర్, ఓలా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీట్రాన్స్‌పోర్ట్‌ స్మార్ట్‌కార్డు వ్యవస్థ పనితీరు, ప్రయోజనాలు తదితర అంశాలపై ఎస్‌బీఐ అధికారులు ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం నోయిడా, నాగ్‌పూర్‌లలో అమలవుతున్న స్మార్టుకార్డుల పనితీరును వివరించారు. ఆ నగరాల్లో కేవలం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లకు మాత్రమే ఈ సింగిల్‌ టిక్కెట్‌ సిస్టమ్‌ పరిమితం. నగరంలో అన్ని రకాల ప్రజారవాణా సదుపాయాలను ఒక గొడుగు కిందకు తెచ్చేవిధంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెటీరియల్‌ను ఎస్‌బీఐ అందజేయనుంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదా యం సైతం ఎస్‌బీఐ నుంచి ఆయా రవాణా సంస్థలకు వెళ్తుంది. ‘ఓలా, ఉబర్‌ సంస్థలకు అనుబంధంగా నడుస్తున్న ఆటోరిక్షాలను కూడా దీని పరిధిలోకి తేవడం ద్వారా ప్రజలకు నిరంతరాయ ప్రయాణ సదుపాయం లభిస్తుంది’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

ఇలా పనిచేస్తుంది: సింగిల్‌ టికెట్‌ మల్టీ ట్రాన్స్‌పోర్టు స్మార్ట్‌కార్డులను స్టేట్‌బ్యాంకు అన్ని చోట్ల విక్రయిస్తుంది. ఆర్టీసీ బస్‌స్టేషన్లు, బస్‌పాస్‌ కౌంటర్లు, రైల్వేస్టేషన్‌లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లు, మెట్రో స్టేషన్‌లు వంటి అన్ని ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తారు. ప్రయాణికులు మొదట రూ.50 చెల్లించి ఈ కార్డును కొనుగోలు చేయాలి. తరువాత రూ.200 నుంచి రూ.2000 వరకు రీచార్జ్‌ చేసుకోవచ్చు. తమ అవసరం మేరకు ప్రయాణం చేయవచ్చు. క్రెడిట్, డెబిట్‌ కార్డుల తరహాల్లోనే వీటి వినియోగం ఉంటుంది.

ఇందుకోసం బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రత్యేకంగా తయారు చేసిన టిక్కెట్‌ ఇష్యూ మిషన్‌లు(టిమ్స్‌) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు బస్సు లేదా రైలు ఎక్కిన వెంటనే స్వైప్‌ చేయవచ్చు. ఉదాహరణకు ఉప్పల్‌ నుంచి అమీర్‌పేట్‌ వరకు బస్సులో వచ్చిన ప్రయాణికుడు అమీర్‌పేట్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మరో చోటుకు క్యాబ్‌లోగాని, ఆటోలోగాని వెళ్లవచ్చు. లింగంపల్లి నుంచి బేగంపేట వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు అక్కడి నుంచి సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు. ఇలా తమ అవసరానికి అనుగుణంగా ఎక్కడికంటే అక్కడికి అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకోవచ్చు.

ఆర్టీసీలో మొదట ఏసీ, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో దీన్ని ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సుల్లోకి విస్తరిస్తారు. ఈ స్మార్ట్‌కార్డు వల్ల సిటీ బస్సుల్లో తిరుగుతున్న 33 లక్షల మందికి అలాగే ఎంఎంటీఎస్‌ రైళ్లలో రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి మెట్రో సేవలను వినియోగించుకుంటున్న మరో 70 వేల మందికిపైగా ప్రయోజనం లభించనుంది. ఈ కార్డును వినియోగించే వారికి తాము పయనించిన దూరం, అందుకోసం చెల్లించిన డబ్బుల వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ ద్వారా చేరుతాయి. దీంతో తమ అకౌంట్‌లో ఇంకా ఎన్ని డబ్బులున్నాయి... ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు... అనే అంశంపైన ప్రయాణికులకు అవగాహన కలుగుతుంది.  


బస్‌పాస్‌లకు వర్తింపు...
బస్‌పాస్‌ వినియోగదారులు కూడా ఈ స్మార్ట్‌కార్డులను వినియోగించుకోవచ్చు. ఇందుకోసంకార్డులో ఒక ఆప్షన్‌ ఉంచుతారు. ప్రయాణికులు తమ నెల వారీ సాధారణ పాస్‌లు, ఎన్జీవో, స్టూడెంట్, తది తర పాస్‌లను దీనితో అనుసంధానం చేసి పయనించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 నుంచి 7 లక్షల మంది బస్‌పాస్‌ వినియోగదారులకు కూడా ఈ సదుపాయం లభించనుంది. ఈ స్మార్ట్‌ కార్డు ద్వారా లభించే మరో సదుపాయం షాపింగ్‌. ప్రయాణికులు దీనిని క్రెడిట్, డెబిట్‌ కార్డుల తరహాలో వినియోగిస్తూ షాపింగ్‌ చేయవచ్చు. ఒక స్మార్ట్‌కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు లభించే విధంగా రూపొందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement