గిరిజన తండాల్లో ఉచిత భోజనం
సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్న గిరిజన తండాల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే జిల్లాల్లో, ఏయే ప్రాంతాల్లో ఈ ఉచిత భోజన పథకం అవసరముంది, ఎన్ని సెంటర్లలో అమలు చేయాలి, ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే వివరాలతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5కే భోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. అన్నార్తుల ఆకలి తీర్చేదిగా ప్రశంసలు అందుకుంటున్న ఈ పథకం స్ఫూర్తితో... దుర్భర పరిస్థితులున్న గిరిజన తండాల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో శిశు మరణాలు, పౌష్టికాహార లోపంతో వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది.
ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మారుమూలన ఉన్న గిరిజన తండాల్లో ఈ దుర్భర పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి తండాలను ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా ఉచిత పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అన్ని వయసుల వారికీ..
ప్రస్తుతం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం అమల్లో ఉంది. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతిరోజు ఒకపూట అన్నం, పప్పు, పాలు, గుడ్డు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఈ రెండింటినీ కలిపి.. గిరిజన తండాల్లో అన్ని వయసుల వారికి ఉచిత భోజనం అందించేలా కొత్త పథకాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుంది, ఎంత మందికి భోజనం వడ్డించాల్సి ఉంటుందన్న వివరాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేష్‌కుమార్ ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 5 భోజన పథకం రూపకల్పనతోపాటు అమలు తీరు తెన్నులపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో తండాల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఉచిత భోజన పథకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.