పార్టీమారమని డబ్బులు ఎరవేశారు: మంత్రి పద్మరావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న తనకు పార్టీ మారమని కొంతమంది సీమాంధ్ర సీఎంలు డబ్బులు ఎరగా వేసారని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మరావు తెలిపారు. అయితే నరనరాల్లో తెలంగాణ రక్తం ఉండడంతో వారి కుట్రలకు తలొగ్గలేదన్నారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలగూడలో గురువారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సన్మానసభకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు..తెలంగాణ సాధన కోసం తాడోపేడో తేల్చుకునేందుకు తాను కేసీఆర్ వెన్నంటే ఉన్నానని గుర్తుచేశారు. టీ తాగేందుకు సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌కు వస్తే పోలీసుల పహారా, ఇంటెలిజెంట్స్, స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు యక్ష ప్రశ్నలతో తనను వేధించేవారన్నారు.
ఉద్యమం కోసం అప్పులు..
ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒక సమయంలో తన భార్య మంగళసూత్రంతోపాటు నగలను తాకట్టు పెట్టానని నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని మరో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కళ్యాణలక్ష్మీ, ఒంటరి మహిళ పింఛన్లు, షాదీముబారక్ వంటి 43 సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిందన్నారు.
కమ్యూనిస్టుల రికార్డు బ్రేక్ చేస్తాం
టీఆర్ఎస్ పాలనపై ప్రజలు పూర్తిస్థాయి నమ్మకంతో ఉన్నారని, వచ్చే పదేళ్లు అధికారాన్ని కట్టబెట్టేందుకు సిద్ధం అయ్యారన్నారు. ఆ తరువాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగి పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్ట్‌ల పాలన రికార్డును బ్రేక్ చేస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కళాబృందాలు, సాంస్కృతిక, పాత్రికేయ సంఘాలు కీలక పాత్ర పోషించాయన్నారు. పార్టీ క్యాడర్‌లో కొత్త, పాత తేడాలేదని, అందరు కలిసికట్టుగా సమన్వయంతో వ్యవహరించి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కష్టపడి పనిచేసేవారికే పదవులు అనే సూత్రాన్ని తాను నమ్ముతానని అన్నారు.