
టీఆర్‌ఎస్ కన్ను
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సరిపడేంత సంఖ్యాబలం లేకున్నా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ అభ్యర్థిత్వం ప్రధానంగా తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణను రాజకీయంగా ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా అక్కడినుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
దీంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టే బాధ్యతను కృష్ణమోహన్‌రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు 33మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం కాగా, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి 25మంది విజయం సాధించారు. దీంతో టీడీపీ (తొమ్మిది), బీజేపీ (ఇద్దరు) మద్దతు కీలకం కానుంది.
ఓ వైపు టీడీపీ, బీజేపీ మద్దతు కోసం ప్రయత్నిస్తూనే కాంగ్రెస్ శిబిరంలోనూ చీలిక కోసం టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ, బీజేపీ సభ్యుల మద్దతు లభిస్తుందనే ఆశతో ఉంది. అయితే సొంత పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను సమన్వయం చేసే వారు లేకపోవడంతో అతి పెద్ద పక్షంగా అవతరించినా అనుకూలంగా మలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ పక్షాన నలుగురు సభ్యులు విజయం సాధించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మద్దతు కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ లోపాయికారీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే టీఆర్‌ఎస్, టీడీపీ నడుమ రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉండడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. జెడ్పీ పీఠంపై కన్నేసిన టీఆర్‌ఎస్ సొంత పార్టీ సభ్యులు చేజారకుండా ఉండేందుకు క్యాంపు నిర్వహణపై దృష్టి సారించింది. క్యాంపు నిర్వహణ తీరుపై మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇప్పటికే టీఆర్‌ఎస్ జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేశారు.
జోరుగా బేరసారాలు
హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లలో ఓ వైపు క్యాంపులు నిర్వహిస్తూనే మరోవైపు అన్ని పార్టీలు బేరసారాలకు తెరలేపాయి. పార్టీలకు అతీతంగా మద్దతు కూడగట్టేందుకు ప్రలోభాలను ఎరగా చూపుతున్నారు. మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులతో పాటు ఎన్నికల వ్యయాన్ని చెల్లిస్తామని చైర్మన్ అభ్యర్థులు ప్రతిపాదిస్తున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ పోటాపోటీగా చైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నాయి.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న ఓ కౌన్సిలర్ ఇళ్లస్థలాలు, అభివృద్ధి నిధుల్లో వాటా వంటివి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. మండల పరిషత్ చైర్మన్ పదవి ఆశిస్తున్న నేతలు బెంగళూరు, చెన్నై, తిరుపతి, షిరిడీ వంటి సుదూర ప్రాంతాలకు ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంపులకు తీసుకువెళ్లారు. ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ ప్రలోభాలు, బేరసారాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.