
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది
► హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
► అర్హులందరికీ పథకాలు వర్తింపచేయాలి
► టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
► వేములవాడకు నిధుల కేటాయింపుపై హర్షం
వేములవాడ/ఎలిగేడు : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ధ్వజమెత్తారు. గురువారం ఆయన వేములవాడ, ఎలిగేడులో జరిగిన కార్యక్ర మాల్లో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా హామీలను నెరవేర్చలేక కాలయాపన చేస్తోందని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ, మహారాష్ట్రతో ప్రాజెక్టుల ఒప్పందం వంటి వాటిపై ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇవ్వాలని, లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించి కనువిప్పుకలిగేలా చేస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని అందించేందుకు రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టారని, పక్కనే ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలను నింపిన తరువాతే మెదక్, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలకు తీసుకవెళ్లాలన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల రుణాలను ఎమ్మెల్యే లిస్టు తెప్పించుకుని అధికారపార్టీ కార్యకర్తలకు కేటాయించడం సిగ్గుచేటన్నారు.
అభివృద్ధిని తమ పార్టీ స్వాగతిస్తుందన్న ఆయన.. వేములవాడ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ఎంఏ.నసీర్, దివాకర్‌రావు, నందిపేట సుదర్శన్‌యాదవ్, పులి రాంబాబుగౌడ్, తదితరులు పాల్గొన్నారు