రాష్ట్రంలో టీడీపీ ‘బీ’ టీమ్ పాలన!
- రైతు, కూలీల గర్జన సభలో సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
- కేసీఆర్.. తెలంగాణ ద్రోహులతో జత కట్టిన నీవూ ద్రోహివే
- వైఎస్ పథకాలను పదే పదే గుర్తు చేసుకున్న వక్తలు
సాక్షి, జగిత్యాల: రాష్ట్రంలో టీడీపీ బీ-టీమ్ పాలన కొనసాగుతోందని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపితే.. నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టిందని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు, కూలీల గర్జన సభలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్.. నువ్వు 1994 నుంచి 1999 వరకు అప్పటి సీఎం.. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరించినవ్. పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. కడియం శ్రీహరి.. తుమ్మల నాగేశ్వర్‌రావు.. తల సాని శ్రీనివాస్‌యాదవ్ సైతం అదే పార్టీలో పోస్టులు అనుభవించారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నువ్వూ.. అలాంటి తెలంగాణ ద్రోహులతోనే జతకట్టావు. ఈ రోజు నీకు వాళ్లంతా చుట్టాలయ్యారా? వారితో కలసిన నువ్వూ.. తెలంగాణ ద్రోహివే.’ అని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులకు 8 నెలల క్రితం కేంద్రం రూ. 720 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తే.. వాటిని రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించిన నువ్వు రైతుల పక్షపాతివా..? అని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద.. 2014-15లో చట్టసభల ద్వారా విడుదలైన రూ. 7,500 కోట్లలో కేవలం రూ.3060 కోట్లు, 2015-16లో రూ.8 వేల కోట్లకు రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని జీవన్‌రెడ్డి విమర్శించారు. కనీసం దళితుల నిధుల్ని సైతం వదిలిపెట్టడం లేదని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు రాయితీలు.. బొగ్గు.. నీళ్లు.. ఉచిత విద్యుత్ వసతుల కల్పనపైనే దృష్టిసారించడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. పదేళ్లలో మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ. 10 వేల కోట్లు అంచనా ఉంటే.. రెండేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం రూ. 12 వేల కోట్ల ఆర్థిక ఆదాయం ఆర్జించిందన్నారు. ‘ కేసీఆర్ నువ్వు తాగు.. కానీ, రాష్ట్రాన్ని ఎందుకు తాగిస్తున్నవ్...? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులు తీసుకున్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని.. వరిధాన్యం, మొక్కజొన్న పంటలకు క్వింటాలుకు రూ. 200, పత్తి, సోయ పంటలపై క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు బ్యాంకు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సారంగాపూర్ తహసీల్దార్‌కు అందజేశారు. గర్జనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ప్రసంగాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలు.. ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రార్ధించారు.