
గోదావరిఖని(రామగుండం): ఉత్తర తెలంగాణపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉప నేత టి. జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 62.5 మెగావాట్ల బిథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయకుండా.. విస్తరించాలని కాంగ్రెస్ నాయకుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చేపట్టిన ఒక రోజు దీక్షా కార్యక్రమానికి ఆయనతోపాటు మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
రామగుండం బి–థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మూసివేస్తామనడం, పెద్దపల్లి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వకుండా సిద్దిపేట, గజ్వేల్‌కు నీటిని తరలించడం ప్రభుత్వవివక్షకు నిదర్శనమన్నారు. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే గ్రావిటీ ద్వారా మేడిగడ్డ, అన్నారం వరకు నీరు చేరుతుందని, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తే ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు లాభం జరిగేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే దురుద్దేశం తోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తుందని విమర్శించారు.