హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ డెన్‌గా మారిందని బీజేపీ ఆరోపించింది. సర్కార్ ‘ఓపెన్ గేట్’ మద్యం పాలసీ కారణంగా యువత పెడదోవ పడుతోందని విమర్శించింది. మన దేశ సంస్కృతి, హైదరాబాద్ సంప్రదాయం కాని రాక్, పబ్ కల్చర్ హైదరాబాద్‌లో పెచ్చుమీరిందని బీజేపీ అధికారప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. విదేశీ సంస్థలు, కంపెనీలు కలిసి నగరంలో ఏడాదంతా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటి వల్లనే మద్యం, డ్రగ్స్ వాడకం పెరిగిందని చెప్పారు. డ్రగ్స్ ప్రభావానికి నగర వాసులు ముఖ్యంగా యువతీ యువకులు లోనవుతున్నారని వివరించారు.
హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వశాఖల సాయంతో దేశ, విదేశీ సంస్థలు చేపట్టే కార్యక్రమాలు మద్యం, డ్రగ్స్ విక్రేతల కల్పతరువులుగా మారాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన ‘బంగారు తెలంగాణ’ బదులు ‘ఉడ్తా తెలంగాణ’ గా రాష్ట్రం మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎవరికి ఎలాంటి రకం డ్రగ్స్ కావాలన్నా అందుబాటులోకి వచ్చేశాయని అన్నారు. సముద్ర తీరంలో ఉండే ముంబై, గోవాలకు వెళ్లి ఎంజాయ్ చేసే యువత ప్రస్తుతం హైదరాబాద్‌లోనే డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రం డ్రగ్స్ డెన్‌గా మారింది: బీజేపీ
Published Mon, Jul 24 2017 7:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM