సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్‌ఎస్ విజయాల ఖాతాలో కరీంనగర్ నగర పాలక సంస్థ కూడా చేరింది. రెండు రోజుల ఆలస్యంగా ఎన్నికలు జరిగిన కరీంనగర్‌లో ఇతర పురపాలక సంస్థల తరహాలోనే కారు షికారు చేసింది. 60 మునిసిపల్ డివిజన్‌లు ఉన్న కార్పొరేషన్‌లో రెండు స్థానాల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, మిగతా 58 డివిజన్‌లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 31 గెలుచుకుంది. దీంతో 33 మంది అభ్యర్థుల గెలుపుతో ఇతర పార్టీల సభ్యుల సహకారం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం చేసుకునే స్థాయిలో మెజారిటీ సాధించింది. కాగా 53 డివిజన్‌లలో పోటీ చేసిన బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందింది. గత కౌన్సిల్‌లో ఏకంగా 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జీరోకే పరిమితమైంది. సిట్టింగ్ కార్పొరేటర్లు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఎంఐఎం పది చోట్ల పోటీ చేసి ఆరింట విజయం సాధించింది. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ రెబల్స్ మూడు చోట్ల గెలుపొందడం గమనార్హం. ఇక స్వతంత్రులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు. కాగా 29న జరిగే తొలి నగర పాలక మండలి సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు.
టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టిపోటీ
2014లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 50 డివిజన్‌లు ఉన్న కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ 24 స్థానాలు గెలుచుకొని, ఇతర పార్టీల సహకారంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను సాధించుకుంది. ఈసారి 60 డివిజన్‌లకు పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. 40కి పైగా సీట్లు సాధిస్తుందని భావించిన అధికార పార్టీకి సైలంట్ ఓటింగ్‌తో బీజేపీ షాకిచ్చింది. 2014లో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌తోపాటు మరో సీటు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 13 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఎంఐఎం తన బలాన్ని 2 స్థానాల నుంచి ఆరుకు పెంచుకుంది. టీఆర్‌ఎస్ టికెట్టు ఆశించి భంగపడి ‘సింహం’గుర్తుతో ఏఐఎఫ్‌బీ నుంచి పోటీ చేసిన వారిలో ముగ్గురు విజయతీరాలకు చేరారు. ఇక స్వతంత్రులుగా విజయం సాధించిన ఐదుగురు కూడా టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం నుంచి టికెట్టు ఆశించి భంగపడ్డ వారే కావడం గమనార్హం.
కరీంనగర్‌లో అన్ని పట్టణాల్లో టీఆర్‌ఎస్సే
కరీంనగర్‌లో గెలుపుతో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ విజయయాత్ర సంపూర్ణమైంది. ఇప్పటికే సోమవారం జరిగిన పాలకమండళ్ల ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌లను టీఆర్‌ఎస్ కైవసం కైవసం చేసుకుంది. 14 మునిసిపాలిటీల్లో సైతం గులాబీ జెండాతో గెలిచిన వారే మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment