సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
గురువారం కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. పైసా పని కూడా చేయలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సంజయ్ ఏం అభివృద్ధి చేశారని సూటిగా ప్రశ్నించారు. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయితీ పెట్టడం తప్ప బండి సంజయ్‌కు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదని కేటీఆర్ ఫైరయ్యారు. రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం, పనికి మాలిన మాటలు మాట్లాడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు.
ఈ సందర్భంగానే బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు ధ్యైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేయాలని సవాల్ చేశారు. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణలో చర‍్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment