కాంగ్రెస్ నేతలను నిలదీయండి
ప్రజలకు కేటీఆర్ పిలుపు
తెలంగాణకు 60 ఏళ్లపాటు ఆ పార్టీ నష్టం చేసింది
రాష్ట్రంలో టీడీపీది ముగిసిన చరిత్ర
హైదరాబాద్: 60 ఏళ్లపాటు తెలంగాణకు నష్టం చేసిన కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రులు ఈటెల రాజేందర్, టి.పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పార్టీ ప్లీనరీ నిర్వహించనున్న ఎల్బీ స్టేడియంను ఆయన సోమవారం పరిశీలించారు. ప్లీనరీ సందర్భంగా ప్రతినిధుల సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్లీనరీ వేదికకు ప్రొఫెసర్ జయశంకర్ పేరును ఖరారు చేసినట్టుగా వెల్లడించారు. ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం కాంగ్రెస్ చేపట్టిన యాత్ర మరో మోసపూరిత యాత్ర అని విమర్శించారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ముందుగా రైతులకు క్షమాపణ చెప్పి, హైదరాబాద్‌లోనే ముక్కును నేలకు రాసి యాత్రను చేసుకోవాలని సూచించారు.
అధికారం పోయిందనే బాధతో మానసిక సమతుల్యత లోపించిన ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరెంటు కోతలను కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా ఇచ్చిందన్నారు. ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు వస్తాయని, తెలంగాణకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా కరెంటు కష్టాలను ఇచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే బొగ్గు ఉత్పత్తి అవుతున్నా.. ఇక్కడ కరెంటు ప్లాంటులను పెట్టనప్పుడు కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఎందుకు నోరువిప్పలేదని ప్రశ్నించారు. టీడీపీది తెలంగాణలో ముగిసిన చరిత్ర అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రా నేతల పెత్తనం కోరుకునేవారే ఇంకా టీడీపీలో ఉన్నారని చెప్పారు. కొందరు నికార్సైన తెలంగాణ నేతలు ఇంకా టీడీపీలో ఉన్నారని, వారంతా ఈ ప్లీనరీలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కర్కోటక నేత చంద్రబాబు విషకౌగిలి నుంచి వారంతా బయటకు రావాలని కోరారు. టీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో పటిష్టం చేస్తామన్నారు.