సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆశలు చిగురించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు మంత్రి వర్గాన్ని విస్తరించిన సీఎం కేసీఆర్ నేడు మళ్లీ మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి అనుమతి తీసుకున్నారు. ఇదీలా ఉంటే ఎంత మందితో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు? కొత్తగా ఎవరెవరికీ అవకాశం కల్పించనున్నారు?అనేదానిపై అధినేత స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆదివారం జరగనున్న మంత్రి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో తొలుత అతి స్వల్ప కాలం వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ ఆ పదవి నుంచి తప్పించి వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. స్వతహాగా వైద్యుడిగా ఉన్న లక్ష్మారెడ్డి సుమారు నాలుగున్నరేళ్ల పాటు వైద్యారోగ్యశాఖకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత లక్ష్మారెడ్డికి మళ్లీ పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆయనకు మంత్రి పదవి చేజారింది.
నెలరోజుల క్రితం మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. అందులో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపించింది. తర్వాత మంత్రివర్గ విస్తరణకు కాస్త ఆలస్యమైంది. చివరకు శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో హరీశ్‌రావు, కేటీఆర్, ఓ మహిళ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు బెర్త్ ఖరారైందనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అయితే శనివారం రాత్రి వరకు మంత్రుల జాబితా ప్రకటించకపోవడంతో లక్ష్మారెడ్డికి మంత్రిపదవి దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇదీలా ఉంటే సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించనున్న పది రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకూ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. తనతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జూపల్లికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
రెండు విప్ పదవులు
మరోవైపు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిని శాసనమండలి విప్‌గా శనివారం ప్రకటించారు. అలాగే అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ప్రభుత్వ విప్‌గా నియమించారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment