హైదరాబాద్‌లో దేవీప్రసాద్.. నల్లగొండలో పల్లా
అట్టహాసంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖ లు చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా తరలి వెళ్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిట ర్నింగ్ అధికారి నవీన్‌మిట్టల్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా అగిరు రవికుమార్, ఎ.సునీల్‌కుమార్, సిల్వేరు శ్రీశైలం,సిద్ధి లక్ష్మణ్‌గౌడ్,ఎల్.గౌరీశంకర్‌ప్రసాద్, షేక్ షబ్బీ ర్ అలీ నామినేషన్లు వేశారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌తో సహా ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొం డ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన సత్యనారాయణ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రు లు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దేవీప్రసాద్ విజయం ఖాయం: నాయిని
సకలజనుల సమ్మెతో చరిత్ర సృష్టించిన దేవీప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. బుధవారం దేవీప్రసాద్ నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవీప్రసాద్‌తో పోటీ పడగల అభ్యర్థులే లేరన్నారు. ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేసిన ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్యోగులు, పట్టభద్రులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ జేఏసీ నుంచి మరో అభ్యర్థి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు బదులిస్తూ రాజకీయ జేఏసీ అభ్యర్థే దేవీప్రసాద్ అని, మరొకరు పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాన్నీ అర్హులకే అందేందుకు, ఉద్యమంలో పాల్గొన్నవారు చట్టసభల్లోనూ ఉండాలనే తలంపుతో సీఎం కేసీఆర్ తనకు అవకాశమిచ్చారన్నారు. సెటిల ర్స్, ఆంధ్రా ఉద్యోగులపై తనకెలాంటి వివక్ష లేదన్నారు. మూడు జిల్లాల ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొని తనను గెలిపించాలని దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య పోరు : మంత్రి హరీశ్‌రావు
నల్లగొండ: ఈ ఎన్నికలు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలోనే పోల వరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి ఖమ్మం జిల్లా ప్రజల గుండెలు గాయపర్చారని మండిపడ్డారు.
తాజాగా మరికొన్ని మండలాలను ఏపీలో కలిపేందుకు బీజేపీ మద్దతుతో చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కరెంట్ ఇవ్వాలని అనేకమార్లు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు అండా నిలవాలని హరీష్ విజ్ఞప్తి చేశారు.