నేను ఒక్కడినే బయల్దేరా...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఒక్కడినే బయల్దేరినా.. మధ్యలో లక్షల మంది వచ్చి చేరారని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్లీనరీలో ఆయన ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్ని ఆరోపణలు, నిందలు వేసినా ఉద్యమ బాటను వీడలేదన్నారు. పోరాటం అంటే ముందుకు పోవటమే అని ఆయన పేర్కొన్నారు.
జయాలు, అపజయాలు చూసినా ఎన్నడూ వెనుదిగిరి చూడలేదన్నారు. ఉద్యమంలో అనేకమంది మిత్రులు ఇచ్చిన సహకారం మరవలేనిదని చెప్పారు. ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలే అని, ఓ సందర్భంగా తాను చిన్నబోయి కూర్చుంటే నాయిని నర్సింహారెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహించారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేశామన్నారు. గోల్కొండ కోటపైన తొలిసారి జాతీయ జెండా ఎగురవేశామని ఆయన తెలిపారు. రూ.లక్ష రుణమాఫీ చేసిన ఘటన టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్మూరు ఎర్రజొన్న రైతులకు రూ.11కోట్లు బకాయిలు చెల్లించామన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ నేతలు ఎన్నడూ పేదల గురించి ఆలోచించలేదన్నారు.