ప్లీనరీ ఏర్పాట్లలో గులాబీ దళం!
⇒ ఏర్పాట్లను సమీక్షించిన నేతలు
⇒ 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం
⇒ జిల్లా పర్యటనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ
⇒ 75 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్‌పైనే నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో సంస్థాగత హడావుడి ప్రారంభ మైంది. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ 16వ ప్లీనరీ, 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేప థ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచే ప్లీనరీ, సభ ఏర్పాట్లలో తలమునకలైంది. ఈసారి ప్లీనరీ, సభలను వేర్వేరు చోట్ల జరపనుండటంతో వేర్వేరుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఆ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీ హైదరా బాద్‌లోని కొంపల్లిలో జరగనుండటంతో పార్టీ నేతలు ఇప్పటికే రెండుసార్లు ఏర్పాట్లను పరిశీలించారు.
సోమవారం కూడా పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరపు కృష్ణారావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సుమారు రెండు గంటలపాటు సమీక్షించారు. ప్లీనరీ సభ జరిగే స్థలం, భోజన శాల, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బసకు సంబంధించిన ఏర్పాట్లనూ పరిశీలించారు. పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆపై స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలనే ప్లీనరీకి ఆహ్వానిస్తున్నారు. వీరంతా కలిపి దాదాపు ఎనిమిది వేల మంది వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లా పర్యటనల్లో మంత్రులు
రెండేళ్ల కిందటి కన్నా ఈసారి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించా లన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ యంత్రాంగం జిల్లాల్లో మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా పర్యటనల్లో మునిగిపోయారు. ఇదివరకు 50 లక్షల సభ్యత్వం పూర్తి చేసిన టీఆర్‌ఎస్.. ఈసారి కనీసం 75 లక్షల మంది సభ్యులను చేర్పించా లని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో ఎమ్మె ల్యేలు తమ నియోజకవర్గాల్లో టార్గెట్లను పూర్తి చేసే పనిలో పడ్డారు.
అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు సభలు
మరోవైపు దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ బహి రంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. సభలను విజయవంతం చేసేందుకు మంత్రులు సొంత జిల్లాల్లోనే మకాం వేస్తున్నారు. వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన పార్టీ బహిరంగ సభను సక్సెస్ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ టార్గెట్లు పూర్తి చేయడం, ప్లీనరీ నాటికి ప్రతినిధులను తయారు చేయడం, బహిరంగ సభకు జనసమీకరణకు ప్లాన్ చేసుకోవడం తదితరాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ అయ్యారు.