బహిరంగసభకు భారీ జనసమీకరణ
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న టీఆర్ ఎస్ బహిరంగసభకు జిల్లా నుంచి దాదాపు లక్షన్నర మంది హాజరవుతారని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చెప్పారు.
నల్లగొండ రూరల్ :ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి లక్షన్నర మంది హాజరవుతారని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని సాయికృష్ణరెన్సీ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11న ఎల్‌బీ స్టేడియంలో ప్లీనరీ జరుగుతుందని, దీంట్లోభాగంగా 8, 9 తేదీల్లో అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని వివరించారు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో తా ను హాజరవుతానని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలున్న చోటవారే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి ప్లీనరీకి 300 మంది అతిథులు పాల్గొంటారని వివరించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సంక్షేమ పథకాలు
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీఎం కేసీఆర్ నూతన ఆలోచనలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం బంగారుతల్లి, భూతల్లి పేరిట ఆర్భాట ప్రకటనలు చేసిందన్నారు. కల్యాణ లక్ష్మి పేరిట రూ.51వేలు దళిత, గిరిజనులకు అందజేస్తు వారికి అండగా ఉన్నామన్నారు. రైతుల రుణమాఫీ, పెన్షన్ల పెంపు, ఆటో ట్యాక్సీల రద్దు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కరెంట్ సమస్యను అధిగమించేందుకు వీలైనంత త్వరలో కరెంట్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గత పాలకుల నిర్వాహకం వల్లే విద్యుత్ సమస్య, రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీడీపీ అడ్డుకుందని, కరెంట్ కోసం పొలవరం ప్రాజెక్టులోని ఏడు మండలాలను ఆంధ్రాకు మలుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలకు సభ ద్వారానే సమాధానం చెబుతాం
ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలకు హైదరాబాదులో నిర్వహించే బహిరంగ సభ ద్వారానే సమాధానం చెబుతామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి గాలి విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రా పార్టీలకు, ఆంధ్రా నాయకత్వానికి ఊడిగం చేయడం మానుకోవాలన్నారు. 12న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశమున్నట్లు సమాచారముందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, గొంగడి సునీత, ఎమ్మెల్సీ పూల రవీందర్, శంకరమ్మ, వేనేపల్లి చందర్‌రావు, దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.
నియోజకవ ర్గస్థాయి సమావేశాలు నిర్వహించాలి : మంత్రి జగదీష్‌రెడ్డి
ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే టీఆర్‌ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో బుధ, గురువారాల్లో నిర్వహించి నియోజకవర్గ స్థాయి సమావేశాలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సూచించారు. సాయి రెసిడెన్సీ లో మంగళవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 ప్లీనరీ, 12న బహిరంగ సభ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ప్లీనరీకి జిల్లా నుంచి హాజరయ్యే వారికి పాస్‌లు అందజేయాలని సూచించారు. బహిరంగ సభకు వాహనాల ఏర్పాటు ఆయా నియోజవర్గాలోనే చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, గొంగడి సునీత, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, శంకరమ్మ, వి.చందర్‌రావు, చాడ కిషన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ ఉన్నారు.