ఆగని టీఆర్‌ఎస్ జోరు | TRS sweeps Mandal Parishad President Polls in Telangana | Sakshi

ఆగని టీఆర్‌ఎస్ జోరు

Jul 5 2014 1:43 AM | Updated on Aug 10 2018 8:46 PM

మంచిర్యాలలో టీఆర్ఎస్ ఎంపీటీసీల విజయోత్సవం - Sakshi

మంచిర్యాలలో టీఆర్ఎస్ ఎంపీటీసీల విజయోత్సవం

మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి జోరు అప్రతిహతంగాసాగింది.

* అత్యధిక ఎంపీటీసీలు సాధించినా కాంగ్రెస్‌కు నిరాశే
* 24 మండలాల్లో వివిధ కారణాలతో శనివారానికి వాయిదా పడ్డ ఎన్నిక
* మున్సిపల్ మాదిరిగానే చతికిలపడ్డ టీడీపీ
 
సాక్షి, హైదరాబాద్: మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి జోరు అప్రతిహతంగాసాగింది. ఆ పార్టీ స్థానిక సంస్థల్లో సాధించిన స్థానాలు కాంగ్రెస్ కంటే తక్కువే అయినప్పటికీ..ఇతర పార్టీల్లోని సభ్యుల మద్దతుతో అధిక ఎంపీపీ అధ్యక్ష స్థానాలను గెలుచుకుంది. టీఆర్‌ఎస్ దాదాపు రెండువందల ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 117 స్థానాలతో రెండో స్థానానికే పరిమితమైంది. ఉత్తర  తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురే లేకుండా పోయింది.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ సొంత బలం కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. తెలంగాణలో మొత్తం 443 మండలాలకుగాను 47 మండలాల్లో వివిధ కారణాలవల్ల ఎంపీటీసీల ఎన్నికలే జరగలేదు.  396 మండలాల అధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా, కోరం లేని కారణంగా 24 మండలాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. టీఆర్‌ఎస్‌కు మొత్తం 1860 ఎంపీటీసీ స్థానాలు లభించగా, కాంగ్రెస్‌కు 2351 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి.

వరంగల్ జిల్లా మినహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ హవా ఏకపక్షంగా కొనసాగింది. మున్సిపల్ మాదిరిగానే మండలాధ్యక్ష ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. మొత్తం స్థానాల్లో పదిశాతం గెలుచుకుని మూడో స్థానానికి పరిమితమైంది. గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి ఈసారి ఆశాజనకంగా ఉంది.

కాగా, మండల పరిషత్ ఎన్నికలను మంత్రులు కొందరు జిల్లాలకు వెళ్లి పర్యవేక్షిస్తే.. మరికొందరు రాజధాని నుంచే పరిస్థితులను చక్కదిద్దారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని పలువురు ప్రత్యర్థులు టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చారు. మరికొన్నిచోట్ల బెదిరింపులు, ప్రలోభాలతోనూ ఎంపీటీసీలను టీఆర్‌ఎస్ తమవైపునకు  తిప్పుకుంది.
 
వీటికి ఎన్నికలు జరగలేదు
ఖమ్మం జిల్లాలో రెండు మండలాలకు అసలు ఎన్నికలు జరుగకపోగా.. 44 మండలాలకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగలేదు. వరంగల్ జిల్లాలోని మంగపేట మండలానికి కూడా ఎన్నికలు నిర్వహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement