రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్తు అధ్యక్ష ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోయింది.
* ఎంపీపీ ఎన్నికల్లోనూ టీడీపీ అరాచకాలు
* వైఎస్సార్‌సీపీ, స్వతంత్ర సభ్యులకు ప్రలోభాలు
* లొంగనిచోట దౌర్జన్యాలు, సభ్యుల కిడ్నాప్‌లు
* అండదండలందించిన అధికార యంత్రాంగం
* శ్రీకాకుళం జిల్లాలో గర్భిణిపై దౌర్జన్యం
* తూర్పుగోదావరిలో ఎన్నికల అధికారిపై దాడి
* పలుజిల్లాల్లో అధికారులపై మంత్రుల ఒత్తిళ్లు
* 624 స్థానాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి, 29 చోట్ల వాయిదా
* 200 వైఎస్సార్ కాంగ్రెస్, 416 టీడీపీ కైవసం
* ఖాతా తెరవని కాంగ్రెస్, జేఎస్పీకి చిత్తూరులో 2 ఎంపీపీలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్తు అధ్యక్ష ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోయింది. దౌర్జన్యాలు, అపహరణలు, బలవంతంగా ఓట్లువేయించుకోవడం ద్వారా ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తాము గెలిచే అవకాశాలు ఏ కోశానా లేవన్న స్థానాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలను వాయిదా వేయించింది. అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ నేతల వైఖరి ఇదేవిధంగా సాగింది.
గురువారం నాటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ నేతలు పలు ప్రాంతాల్లో దౌర్జన్యాలకు తెగబడి అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకొనే ప్రయత్నం చేయడం తెలిసిందే. మండల పరిషత్తు ఎన్నికల్లోనూ టీడీపీ నేతలు అదే దౌర్జన్యాన్ని కొనసాగించారు. అటు స్వతంత్ర సభ్యులనే కాకుండా ఇటు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. తమ ఎత్తులకు తలొగ్గని వారిని దౌర్జన్యాలతో లొంగదీసుకున్నారు. అనేకమందిని క్యాంపులకు తరలించి నేరుగా ఎన్నికల కేంద్రాలకు తీసుకువచ్చి బలవంతాన వారితో ఓట్లు వేయించుకున్నారు.
అధికారపార్టీ అక్రమాలకు అధికారయంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అండదండలందించి నిబంధనలకు నీళ్లొదిలారు. శ్రీకాకుళం జిల్లా బూర్జలో గర్భిణిపై దాడికి పాల్పడినా అధికారులు పట్టించుకోలేదు. తనకు మద్దతుగా చేతులెత్తాలని నిండుగర్భిణిగా ఉన్న వైఎస్సార్‌సీపీకి చెందిన మామిడివలస ఎంపీటీసీ సభ్యురాలు కొబగాన సంతోషిపై టీడీపీ అభ్యర్థి పెంట నాగమణి దౌర్జన్యం చేశారు. విశాఖపట్నం డుంబ్రిగుడ మండలంలో టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ కో-ఆప్టెడ్ సభ్యుడిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేయడంతో ఎన్నిక వాయిదా పడింది.
తూర్పుగోదావరిజిల్లా రౌతులపూడి ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు ఎంపీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్, ఫైళ్లు, కిటికీల అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. దీంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పశ్చిమ గోదావరిజిల్లా దేవరపల్లిలోనూ టీడీపీ నేతలు సమావేశ మందిరంలోని కుర్చీలు, బల్లలను విరగొట్టి బీభత్సం సృష్టించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై దాడికి దిగారు. టీడీపీ మహిళా ఎంపీటీసీలు ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని దాడికి దిగారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు ఒత్తిడితో ఎన్నికల అధికారి వాయిదా వేసినట్టు ప్రకటించారు.
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీ వశమవుతుందనే అక్కసుతో టీడీపీ నాయకులు కిడ్నాప్ డ్రామాకు తెరలేపారు. ఆగిరిపల్లి-1 సెగ్మెంట్ నుంచి గెలుపొందిన ముల్లంగి విజితను వైఎస్సార్‌సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆగిరిపల్లి సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. దీనికి జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిళ్లు కూడా తోడవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వస్తున్న వాహనాన్ని అడ్డగించి వారిని ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నించారు. చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌పై దౌర్జన్యానికి దిగారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలంలో అభ్యర్థి చేతిలోని ధ్రువీకరణ పత్రాన్ని టీడీపీ ఎంపీటీసీలు చించివేయడాన్ని సాకుగా చూపి అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ నేతలు శుక్రవారం బరితెగించి పోలీసుల సంరక్షణలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి కాసుల గురవయ్యను నడిరోడ్డుపై కొట్టారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జి ప్రయోగించారు. ఒంగోలు పట్టణంలో ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అడ్డుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై దాడికి దిగి వారి కారుఅద్దాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు.
కాంగ్రెస్‌కు జీరో
రాష్ట్రంలో మొత్తం 653 మండల పరిషత్తుల అధ్యక్ష స్థానాలకు శుక్రవారం ఎన్నిక లు నిర్వహించారు. 624 స్థానాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాగా 29 చోట్ల వాయిదా పడ్డాయి (ప్రకాశం జిల్లా మార్టూరు అధ్యక్ష స్థానానికి ఎన్నిక ముందే నిలిచిపోగా తాజాగా 28 వాయిదా పడ్డాయి). ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశంపార్టీ 416 మండల పరిషత్తులను కైవసం చేసుకోగా, 199 మండలాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది.
శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేకపోగా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) ఆయన సొంత జిల్లా చిత్తూరులో రెండు మండలాలను గెల్చుకోగలిగింది. రాయలసీమ పరిరక్షణ సమితి కర్నూలు జిల్లాలో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు ఆరు చోట్ల గెలిచారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, బీఎస్సీ వంటి పార్టీలకు ఎంపీపీల్లో స్థానం లేకుండాపోయింది. నెల్లూరు, కడప జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీకి మెజార్టీ మండలాలు దక్కగా ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అధికార పార్టీకి దీటుగా స్థానాలను దక్కించుకోగలిగింది.
తక్కిన జిల్లాల్లో టీడీపీ మెజారిటీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగలిగింది. వైఎస్సార్‌జిల్లాలో 7, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 4, చిత్తూరు, తూర్పుగోదావరిలలో 3 చొప్పున, నెల్లూరులో 2, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలుజిల్లాల్లో ఒకొక్కటి చొప్పున మండలపరిషత్తుల అధ్యక్ష స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో అత్యధికం టీడీపీ కుట్రలు, కుయుక్తుల కారణంగానే వాయిదాపడ్డాయని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. అనేకచోట్ల తాము గెలవలేమని సభ్యులను హాజరుకాకుండా చేసిన ఆ పార్టీ నేతలు కోరం లేదన్న సాకుతో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమస్యలపై దృష్టి సారించండి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నగరపాలక, పురపాలక ఎన్నికల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా గెలుపొందిన టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పారదర్శక పాలనతో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.