
కాంగ్రెస్ పిచ్చెత్తినట్లు మాట్లాడుతోంది
హోంమంత్రి నాయిని విమర్శ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపడుతున్న కార్యక్రమాలను చూసి కాళ్ల కింద భూమి కదిలిపోతున్న కాంగ్రెస్ పిచ్చెత్తినట్లు మాట్లాడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమ్మూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, చందూలాల్‌లతో కలిసి ఆయన గురువారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు సీఎంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, అడ్డగోలుగా, ఇష్టమున్న రీతిలో మాట్లాడడం ఆపకపోతే బాగుండదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెల్లని రూపాయి, దానికి విలువ లేదని, ప్రజలు ఎప్పుడో ఆ పార్టీని పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించారు. నగరంలో పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వాలని, అవసరమైన చోట ఇళ్లు కట్టివ్వాలని ఆల్ పార్టీ మీటింగులో తీసుకున్న నిర్ణయమని వివరించారు.
కాంగ్రెస్ నేతలు ఇళ్ల నిర్మాణం విషయంలో వర్సిటీ విద్యార్ధులను రెచ్చగొడుతున్నారని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కబ్జాలు చేసి, పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టామని, గ్రేటర్ ఎన్నికల కోసం కాదని మహమ్మూద్ అలీ తెలిపారు.