వచ్చే రెండేళ్లలో ఏం చేద్దాం!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
► నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
► రాష్ట్రావతరణ వేడుకలు, సంస్థాగత అంశాలపై చర్చ
► ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీపైనా స్పష్టత
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న రెండేళ్లలో ఏ లక్ష్యాలతో పనిచేయాలి, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా ఎలా తీసుకువెళ్లాలి అన్న అంశాలపై వివరించనున్నారు. ఇందుకు శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసన సభ, పార్లమెంటరీ పక్షాలు భేటీ కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు.
పార్టీ సభ్యత్వాలు, సంస్థాగత కమిటీలపై సమగ్ర చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే ఎజెండా సిద్ధం చేశారు. మూడేళ్లుగా రాష్ట్రంలో చేపడుతున్న పథకాల ఫలితాలను మదింపు చేస్తూనే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమీక్ష జరపనున్నారు.
గత నెలలోనే పార్టీ 16వ ప్లీనరీ, ఆవిర్భావ సభ నిర్వహించిన పార్టీ నాయకత్వం ఇంకా కమిటీల ఎంపికను మాత్రం పూర్తి చేయలేదు. రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్.. పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ, జిల్లాల్లో నియోజకవర్గ కమిటీలను నియమించాల్సి ఉంది. దీంతోపాటు ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.
సర్వే ఫలితాలపై ఉత్కంఠ
ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి సీఎం కేసీఆర్ సర్వే చేయిస్తున్నారు. ఇప్పుడు మూడో సర్వే రిపోర్టు కూడా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సమావేశంలో సర్వే వివరాలు బయటపెడతారని అభిప్రాయపడుతున్నారు.
గత సర్వేల్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, చందూలాల్, పద్మారావు పనితీరు సరిగా లేదని తేలింది. వీరితోపాటు ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, పుట్టా మధు, రేఖానాయక్, భాస్కర్‌రావు, మదన్‌లాల్, ప్రశాంత్ రెడ్డి, సంజీవరావు, రాజేందర్ రెడ్డి, రెడ్యానాయక్, కొండా సురేఖ, మనోహర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, షకీల్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. దీంతో ఈసారి సర్వే ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.