సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. సమ్మె చట్టవిరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాల గురించి సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ తన వాదనలు వినిపించారు. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు... కాబట్టి ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇందుకు బదులుగా... ‘ కొంత మంది సమ్మె ఇల్లీగల్ అని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. మరికొంత మంది ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందో.. లేదో చెప్పట్లేదు. కోర్టు పరిధి దాటి మేము ఆదేశాలు ఇవ్వలేము’ అని న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment