బస్సుకు బాదైంది! చికిత్సకు వేళైంది | TSRTC Buses Repair all Depots In Hyderabad | Sakshi
Sakshi News home page

బస్సుకు బాదైంది! చికిత్సకు వేళైంది

Published Sun, Dec 1 2019 8:24 AM | Last Updated on Sun, Dec 1 2019 8:24 AM

TSRTC Buses Repair all Depots In Hyderabad - Sakshi

కుషాయిగూడ డిపోలో బస్సులను మరమ్మతులు చేస్తున్న దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: సిటీ బస్సుకు పెద్ద కష్టం వచి్చంది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఆర్టీసీ కారి్మకుల సమ్మెతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం మెకానిక్‌లను నియమించకపోవడంతో ఆర్టీసీ సిటీ బస్సుల బతుకు గ్యారేజీ అయింది. ప్రైవేట్‌ డ్రైవర్లు బస్సులను ఇష్టానుసారంగా నడపడం.. వాటి బాగోగులు పట్టించుకోకపోవడంతో సమ్మె విరమించాక చూస్తే సగానికి పైగా బస్సులు పాడైపోయి రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొంది. కొన్నింటికి టైర్లు దెబ్బతిన్నాయి. విడిభాగాలు ఊడిపోయాయి. కొన్నింటిలో గ్రీజ్, ఇంజిన్‌ ఆయిల్‌ లేకుండా పోయింది. కారి్మకులు విధులకు హాజరైనాదెబ్బతిన్న బస్సులు రోడ్డెక్కించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు గ్రేటర్‌లోని 29 డిపోల్లో సగం బస్సులకు మరమ్మతులు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు మాత్రం సుమారు 600 బస్సులకు మర్మతులు అవసరమున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అన్ని డిపోల్లో బస్సుల నిర్వహణ నాలుగు దశల్లో ఉంటుంది.

మెకానిక్‌లు ప్రతి బస్సుకు రోజువారీ తనిఖీ చేస్తారు. ఈ తనిఖీల్లో డ్రైవర్ల ఫిర్యాదుల ఆధారంగా చిన్న చిన్న మరమ్మతులు చేస్తారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సుల్లో ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులే ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో 3,750 బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని స్పేర్‌లో ఉంచి ప్రతిరోజు 3500 బస్సులను నడుపుతారు. ఒక్కో డిపోలో కనిష్టంగా 85 నుంచి గరిష్టంగా 130 బస్సుల వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని డిపోల్లో 10 బస్సులకు మరమ్మతులు చేపట్టవలసి ఉండగా కొన్ని డిపోల్లో 40 బస్సుల వరకు మరమ్మతులకు గురయ్యాయి. ‘అప్పటికప్పుడు రిపేర్‌ చేసి పంపించే వాటిని పంపిస్తున్నాం. 10 శాతం మాత్రం విడిభాగాలు లేక గ్యారేజీల్లో ఉన్నాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సమ్మె నేపథ్యంలో బస్సుల స్థితిగతులపైన ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వివిధ డిపోల్లో బస్సుల తీరుపై ప్రత్యేక కథనం.  


జీడిమెట్లలో 50 శాతం షెడ్డుకే.. 
జీడిమెట్ల: ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినప్పటికీ జీడిమెట్ల డిపోలో చాలా బస్సులు మొరాయించడంతో రోడ్డెక్కలేదు. డిపోలో మొత్తం 147 బస్సులుండగా శనివారం 70కి పైగా బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు ఇష్టానుసారం బస్సులు నడపడం కారణమైంది. జీడిమెట్ల డిపోలో మరమ్మతుల విభాగంలో 50 మంది మెకానిక్‌లు విధులు నిర్వహిస్తున్నా స్పేర్‌ పార్ట్స్‌ అందుబాటులో లేక బస్సులు రిపేర్లు సాగడం లేదు.
 

కూకట్‌పల్లిలో 30 శాతానికి పైగా.. 
మూసాపేట: కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోలో మొత్తం 131 బస్సులుండగా శుక్రవారం 86 బస్సులను మాత్రమే తిప్పారు. అంటే 30 శాతం పైగా బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. శనివారం కొన్ని బస్సులకు రిపేర్లు చేసి పరిశీలించిన అనంతరం 100 బస్సులను తిప్పారు. మిగిలిన 31 బస్సులు గ్యారేజీలోనే ఉన్నాయి. దీంతో బస్సులు లేని డ్రైవర్లు, కండక్టర్లు బస్టాప్‌ల వద్ద ప్రయాణికులను వరుస క్రమంలో ఎక్కించడం, బస్సులను బస్సు బేల్లో నిలిపే పనుల్లో నిమగ్నమయ్యారు. సమ్మెలో కాలంలో తాత్కాలిక డ్రైవర్ల చేసిన చిన్నచిన్న పొరపాట్లతో ఇంజన్‌ పాడయ్యే సమస్యలు తలెత్తాయి. ఇంజన్‌ ఆయిల్‌ చెక్‌  చేసుకోకపోవటం, వాటర్‌ లేకపోవటంతో, గ్రీజ్, టైర్లలో గాలి చెక్‌ చేయకపోవటంతో అవి మేజర్‌ సమస్యలుగా మారాయి. దీంతో కూకట్‌పల్లి డిపోలో డిపోలో 78 మంది మెకానిక్‌లు రేయంబవళ్లు బస్సుల మరమ్మతులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అవసరమైన విడిభాగాలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. చేసేది లేక బాగా పాడైన బస్సులో బాగున్న పార్టులను మరో బస్సుకు బిగించి తాత్కాలిక పనులు చేస్తున్నారు.
 

పికెట్‌ డిపోలోనే మేజర్‌.. 

మారేడుపల్లి: డిపోలో ఉన్న మొత్తం 64 బస్సులను తెలంగాణ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడుపుతున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 280 మంది ఉద్యోగులున్నారు.  సమ్మె కాలంలో 40 బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో జిల్లాలకు నడిపారు. సమ్మె కాలంలో 21 బస్సులు ప్రమాదాలకు గురికాగా, ఒక్క బస్సు పూర్తిగా ధ్వంసమవడంతో స్క్రాప్‌కు తరలించారు.  

  • వజ్ర బస్సులను నడపకపోవడంతో ఏసీ, బ్యాటరీ తదితర సమస్యలు తలెత్తాయి. దీంతో ఇతర బస్సులతో పాటు వజ్ర బస్సులకు కూడా రిపేర్‌ చేస్తున్నారు.  
  • డిపోలో బస్సుల సంఖ్య: 64 
  • మరమ్మతులకు గురైనవి: 30 
  • తాత్కాలిక డ్రైవర్లు నడిపినవి: 40 
  • వీటిలో పాడైపోయినవి: 20 
  • స్క్రాబ్‌కు తరలించినవి: 1 

కంటోన్మెంట్‌ డిపోలో.. 
మారేడుపల్లి: ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంతో వారు బస్సులను ఇష్టానుసారంగా నడపారు. దీంతో చాలా బస్సులు ఇప్పుడు షెడ్డుకే పరిమితమయ్యాయి. దీంతో విధుల్లోకి చేరిన ఆర్టీసీ రెగ్యులర్‌ మెకానిక్‌లు వాటి మరమ్మతు పనుల్లో బిజీ అయ్యారు. కంటోన్మెంట్‌ డిపోలో మొత్తం 137 బస్సులున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లతో పాటు మొత్తం 857 మంది సిబ్బంది ఉన్నారు. సమ్మె కాలంలో ఈ డిపో నుంచి ప్రతిరోజు 50 బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించారు. సమ్మె విరమణ తర్వాత వాటిని పరిశీలిస్తే.. మొత్తం 50 బస్సుల్లో 20 పూర్తిగా పాడైపోయి గ్యారేజీకే పరిమితమయ్యాయి. దీంతో 99 మంది మెకానిక్‌లు గ్యారేజీలో బస్సుల మరమ్మతు పనుల్లో బిజీ అయ్యారు.  

  • కంటోన్మెంట్‌లో బస్సులు: 137 
  • మరమ్మతుకు గురైనవి: 45 
  • తరచుగా రిపేర్‌కు వస్తున్నవి: 5 
  • తాత్కాలిక డ్రైవర్లు నడిపినవి: 50 
  • వీటిలో మరమ్మతులకు వచి్చనవి: 20 
  • మిధానిలో 60/95 రిపేర్‌ 

సంతోష్‌నగర్‌: మిధాని డిపోలో మొత్తంలో 95 బస్సులుండగా.. వాటిలో 30 బస్సులకు క్లచ్, గేర్‌ బాక్స్, బ్రేక్, బ్యాటరీ తదితర సమస్యలతో గ్యారేజీలోనే ఉన్నాయి. పూర్తిగా పాడైపోయిన మరో 10 బస్సులను హకీంపేట్‌ డిపోకు పంపించామని డిపో మేనేజర్‌ కిషన్‌ రావు తెలిపారు.  

  • డిపోలో మొత్తం బస్సులు: 95 
  • పాడైపోయినవి: 30 
  • ఫిట్‌నెస్‌ లేనివి: 20 
  • తరుచూ మరమ్మతులకు
  • గురవుతున్నవి: 10  ఐటీ కారిడార్‌లోనూ అంతే..

రాయదుర్గం/మియాపూర్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ఆర్టీసీ డిపో, మియాపూర్‌లోని డిపో–1,2ల్లో కారి్మకులంతా శనివారం విధుల్లో చేరారు. బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌సీయూ డిపో 

  • మొత్తం బస్సులు: 81 
  • నడిచినవి: 75 
  • పాడైనవి: 6 మియాపూర్‌ డిపో–1 
  • మొత్తం బస్సులు: 129 
  • నడిచినవి: 119 
  • పాడైనవి: 10 
  • తరచూ రిపేర్‌కు వచ్చేవి: 2 

మియాపూర్‌–2 

  • మొత్తం బస్సులు: 139 
  • సమ్మె కాలంలో నడిచినవి: 129 
  • పాడైపోయినవి: 10 
  • తరచూ రిపేర్‌: 2 సగం బస్సులు షెడ్డులో..

చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా డిపోలో సమ్మె కాలంలో ప్రైవేట్‌ డ్రైవర్లు నడపడంతో బస్సులు పెద్ద ఎత్తున మరమ్మతులకు గురయ్యాయి. మూడు రోజుల క్రితం మెకానిక్‌లు విధుల్లోకి చేరి అనంతరం బస్సుల మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు. పాతకాలం బస్సులు కావడం.. తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో బస్సులు చితికిపోయాయని మెకానిక్‌లు వాపోతున్నారు.  

ఫలక్‌నుమా డిపో 

  • మొత్తం బస్సులు: 105 
  • మరమ్మతులకు గురైనవి: 40 
  • ఫిట్‌నెస్‌ లేనివి: 30 

ఫరూఖ్‌నగర్‌ డిపో 

  • బస్సుల సంఖ్య: 65 
  • మరమ్మతుల్లో ఉన్నవి: 30 
  • ఫిట్‌నెస్‌ లేనివి: 20 

దిల్‌సుఖ్‌నగర్‌ సిటీ డిపోలో 

చెతన్యపురి/హయత్‌నగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌ సిటీ డిపోలో 101 బస్సులు, 15 అద్దెవి ఉన్నాయి. కండక్టర్లు 281, డ్రైవర్లు 250 మంది, గ్యారేజ్‌ విభాగంలో 72 మంది ఉన్నారు. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్ల తీరుతో 30 బస్సులు రిపేర్‌కు వచ్చాయి. మరో రెండురోజుల్లో వీటికి మరమ్మతులు చేసిన రోడ్డెక్కించేందుకు కృషి చేస్తున్నారు.

హైదరాబాద్‌–2లో ఇలా..
దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్‌–2 డిపోలో 80 ఆర్‌టీసీ, 30 అద్దె బస్సు ఉన్నాయి. సమ్మె కాలంలో రెండు బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. కారి్మకులు తిరిగి విధుల్లో చేరటంతో గతంలో తిరిగిన అన్ని రూట్లలో పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నారు. హయత్‌నగర్‌–1 డిపోలో మొత్తం 142 బస్సుల్లో 24 రిపేరుకు రాగా 12 బస్సులను శుక్రవారం బాగుచేసి పంపారు. హయత్‌నగర్‌–2 డిపోలో మొత్తం 95 బస్సుల్లో 20 బస్సులు పాడైపోయాయి.  

కుషాయిగూడ డిపో 
ఏఎస్‌రావునగర్‌: కుషాయిగూడ డిపోలో మొత్తం 150 బస్సులు ఉన్నాయి. ఇందులో 129 ఆర్టీసీ బస్సులు కాగా 21 అద్దె బస్సులు. 340 మంది డ్రైవర్లు, 304 కండక్టర్లు, 75 మంది మెకానిక్‌లు పనిచేస్తున్నారు. మొత్తం బస్సుల్లో తరచూ 16 బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయి. నాలుగు బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండా ఉన్నాయి.  
చెంగిచర్ల డిపో 
బోడుప్పల్‌: ఈ డిపోలో మొత్తం 127 బస్సులుండగా వాటిలో 121 ఆర్టీసీకి చెందినవి. సమ్మె కాలంలో తిరిగిన బస్సుల్లో 40 పాడైపోయాయి. వీటిలో 30 బస్సులకు శుక్రవారం రిపేర్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement