సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్‌బండ్ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్ ...డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన రక్షణ వలయాలను దాటుకుని ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ....పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.
ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొడతాం..
మరోవైపు చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ... అరెస్ట్‌ల ద్వారా ఉద్యమాలను అణచలేరన్నారు. మిలియన్ మార్చ్‌తోనే కేసీఆర్ పతనం ప్రారంభం అయిందని, ప్రగతి భవన్ గడీలను బద్దలు కొడతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పలుచోట్ల పోలీసులతో కార్మికులు, జేఏసీ నేతలు వాగ్వివాదానికి దిగారు.
మీ ఆస్తులు అడగటం లేదు....
తాము ప్రభుత్వ ఆస్తులను రాసివ్వమని అడగటం లేదని, న్యాయమైన డిమాండ్లు సాధన కోసమే సమ్మెకు దిగామని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తమకు జీతాలు లేవని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తే... బిడ్డలను ఇలాగేనా చూసేది అంటూ ప్రశ్నించారు. పిల‍్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన‍్నామని, తాము ఎలా బతకాలంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment