ఆర్టీసీలో రిటైర్మెంట్ వయస్సు ఇక 60 ఏళ్లకు పెంపు | Telangana Government has raised the R.T.C retirement age - Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఇక 60 ఏళ్లు

Published Thu, Dec 26 2019 3:20 AM | Last Updated on Thu, Dec 26 2019 10:54 AM

TSRTC Employees Retirement Age Raised To 60 years - Sakshi

ఆర్టీసీపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు శుభవార్త. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయసును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బుధవారం ఆర్టీసీపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్టీసీలో కార్గో, పార్సిల్‌ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలన్నారు.

ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకు రవాణా..
‘ఆర్టీసీ బస్సులు ప్రతీరోజు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలను చుట్టి వస్తున్నాయి. లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అదే మాదిరిగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ మారుమూల ప్రాంతానికైనా సరుకు రవాణా చేయాలి. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ఇకపై కచ్చితంగా ‘ఆర్టీసీ కార్గో అండ్‌ పార్సిల్‌ సర్వీస్‌’ద్వారానే చేస్తాం. దీనికి సంబంధించి అన్ని శాఖలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తాం. 

బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాండీ షాపులకు మద్యం, ఆస్పత్రులకు మందులు ఇలా ప్రభుత్వపరంగా జరిగే ప్రతీ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేటట్లు చూస్తాం. ప్రజలు తమ సరుకులను రవాణా చేయడానికి ఇప్పటిదాకా ప్రైవేటు ట్రాన్సుపోర్టును ఉపయోగిస్తున్నారు. ఇకపై ఆర్టీసీలోనే తమ సరుకును రవాణా చేసేలా ప్రోత్సహించాలి. నగరాలు, పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాలకు సరుకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఆర్టీసీ బస్సు పోని ఊరంటూ లేదు. ప్రతీ మారుమూలకూ పోతోంది. ఆర్టీసీ సురక్షితం అనే పేరుంది. కాబట్టి సరుకు రవాణా విభాగాన్ని పటిష్టపరిస్తే ప్రజలు తమ సరుకులను కచ్చితంగా ఆర్టీసీ ద్వారానే రవాణా చేస్తారు. 

కేవలం రాష్ట్ర పరిధిలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే ముంబై, భివండి, షోలాపూర్, నాగ్‌పూర్, జగ్దల్‌పూర్‌ తదితర ప్రాంతాలకూ సరుకు రవాణా చేయాలి. సరుకు ఎగుమతి, దిగుమతి కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో చాలా చోట్ల స్టాక్‌ పాయింట్లు పెట్టాలి. సరుకు రవాణా ఎక్కువ చేయగలిగితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, ఆర్టీసీకి లాభాలు వస్తాయి. ఆర్టీసీ లాభాల బాటన పయనిస్తే ఉద్యోగులకు బోనస్‌ కూడా ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది. సరుకు రవాణా విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వాలి. సరుకు రవాణాకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలి..’అని సీఎం వివరించారు.

డిపోల వారీగా ఉన్నతాధికారుల సమావేశాలు.. 
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎంప్లాయీ వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. బోర్డు కూర్పుకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు.. మొత్తం 202 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బీసీలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలుంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు. 

బోర్డు సమావేశం డిపో పరిధిలో వారానికోసారి, రీజియన్‌ పరిధిలో నెలకోసారి, కార్పొరేషన్‌ పరిధిలో మూడు నెలలకోసారి జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను పరిష్కరిస్తారు. ఆర్టీసీని కాపాడడానికి, లాభాల బాట పట్టించేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఉద్యోగులు కూడా తగిన స్ఫూర్తితో, చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాబోయే పది రోజుల పాటు ఆర్టీసీ ఈడీలు, ఉన్నతాధికారులు డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి, ఎక్కడికక్కడ తగిన వ్యూహం రూపొందించాలన్నారు. 

హైదరాబాద్‌లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నై, నాగ్‌పూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని సూచించారు. వివాహాలు, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని చెప్పారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ పాల్గొన్నారు. కాగా ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో శామీర్‌పేట డిపోలో శుక్రవారం వనభోజనాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని హకీంపేట డిపో మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి బుధవారం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement