మహిళా కండక్టర్ల కంటతడి.. | TSRTC Strike: Call Off Strike But Management Talks Tough | Sakshi
Sakshi News home page

నిరసనలు.. కన్నీళ్లు.. అరెస్టులు

Published Wed, Nov 27 2019 2:48 AM | Last Updated on Wed, Nov 27 2019 11:36 AM

TSRTC Strike: Call Off Strike But Management Talks Tough - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె విరమించినందున తమను విధుల్లోకి తీసుకోవాలంటూ మంగళవారం సూర్యోదయానికి ముందే వచ్చి డిపో గేట్ల వద్ద ఎదురుచూసిన కార్మికులకు చివరకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున తాము విధుల్లోకి తీసుకోబోమని డిపో మేనేజర్లు తెగేసి చెప్పటంతో వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ముఖ్యంగా మహిళా కండక్టర్లు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. 2 నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, కుటుంబం గడవటమే కష్టంగా ఉన్నందున కనికరించాలంటూ కాళ్లావేళ్లా పడ్డా అధికారులు స్పందించని దుస్థితి ఎదురైంది. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్దే పడిగాపులు కాశారు. కొందరు ఆవేదనతో ఆవేశానికిలోనై అధికారులతో వాదనకు దిగారు. వారు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని చివరకు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పిల్లలతో వచ్చిన కొందరు మహిళా సిబ్బందిని పోలీసులు అలాగే స్టేషన్లకు తరలించారు. ఇలాగే వ్యవహరిస్తే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.

ఉదయం 6గంటలకే..
రికార్డు స్థాయిలో 52 రోజులపాటు నిర్వహించిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లాల్సిందిగా జేఏసీ నేతలు సూచించారు. దీంతో చాలా డిపోల వద్ద ఉదయం 5 గంటలకే కార్మికుల రాక మొదలైంది. సమ్మెను విరమించినా, కోర్టులో కేసు తేలే వరకు విధుల్లోకి తీసుకోవటం సాధ్యం కాదని సోమవారం రాత్రే ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎవరినీ డిపోల్లోకి కూడా రానీయొద్దని, విధుల్లో చేరతామంటూ ఇచ్చే లేఖలు కూడా తీసుకోవద్దంటూ అధికారుల నుంచి డిపో మేనేజర్లకు రాత్రే ఆదేశాలు అందాయి. 

మూకుమ్మడిగా కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు భద్రత ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. దీంతో డిపో మేనేజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి డిపోలు, బస్టాండ్ల వద్ద భద్రత కల్పించాల్సిందిగా కోరారు. దీంతో అన్ని చోట్లకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం వచ్చే కార్మికులు డిపోల వద్దకు చేరుకోకుండా ముందే అడ్డుకున్నారు. తాము గొడవ చేయటానికి రాలేదని, తాము సమ్మెలోనే లేమని, డిపో మేనేజర్లను కలసి డ్యూటీ కేటాయించాలని కోరుతామని అడిగినా పోలీసులు వినిపించుకోలేదు. 

దీంతో పలు డిపోల్లో మహిళా సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని చోట్ల పోలీసులతో కార్మికులు వాదనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేదాకా తాము చేసేదేమీ లేదని డిపో మేనేజర్లు స్పష్టం చేయటంతో వారు నిరాశతో వెనుదిరిగారు. బుధవారం ఉదయం కూడా కార్మికులంతా డిపోల వద్దకు వెళ్లి డ్యూటీలు వేయాలని కోరాల్సిందిగా జేఏసీ నేతలు మంగళవారం సూచించారు. పోలీసులు అరెస్టు చేసినా వెనుకంజ వేయొద్దని చెప్పారు.

రాజధానిలో ఇలా..
బస్‌భవన్, మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లు, అన్ని డిపోల వద్ద 144 సెక్షన్‌ విధించారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుంచే పోలీసులు డిపోలను తమ స్వాధీనంలోకి తీసుకొని కార్మికులు డిపోల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ముషీరాబాద్, రాణీగంజ్, మియాపూర్, హెచ్‌సీయూ, ఫలక్‌నుమా, ఫారూక్‌నగర్, ఉప్పల్, చెంగిచెర్ల, కుషాయిగూడ, కంటోన్మెంట్, పికెట్, దిల్‌సుఖ్‌నగర్, బర్కత్‌పురా, కాచిగూడ, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, జీడిమెట్ల, తదితర అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

వందలాది మంది కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బందిని అరెస్టు చేశారు. మేడ్చల్‌ డిపోలో కార్మికులు పోలీసులను ప్రతిఘటించారు. మహిళా కండక్టర్లు కన్నీటి పర్యంతమయ్యారు. జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్‌లో పోలీసుల భద్రతా చర్యల వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు, ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడంతో ప్రయాణికులు బస్‌స్టేషన్లకు వెళ్లలేకపోయారు. కాగా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో సుమారు 1,500 బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు.

జిల్లాల్లో ఇలా..
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటల నుంచి డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ విధించారు. డిపోల ముందుకు వచ్చిన కార్మికులతో పాటు పరిసరాల్లో గుంపులుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను గుర్తించి స్టేషన్‌లకు తరలించారు. మహిళా కండక్టర్లను సైతం పోలీసులు వదల్లేదు. ఉదయం 6.30 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన భోజన వసతి కల్పించలేదని, దీంతో మధుమేహ వ్యాధి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అయ్యా క్షమించండి!
‘మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి అద్దే. ఇతర అవసరాలకు డబ్బులు లేక కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. అయ్యా కేసీఆర్‌ సార్‌ తప్పయ్యింది.. మరో సారి సమ్మె చెయ్యం.. నువ్వు చెప్పినట్టే వింటాం’అంటూ ఆర్టీసీ కార్మికులు నిజామాబాద్‌ డిపో మేనేజర్‌ కాళ్లపై పడి వేడుకున్నారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్‌ డిపో–1, నిజామాబాద్‌ డిపో–2లకు కార్మికులు ఉదయం 5 గంటలకు విధుల్లో చేరడానికి వచ్చారు. కార్మికులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డిలో 120 మంది, బాన్సువాడలో 80, బోధన్‌లో 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

కాంగ్రెస్‌ కార్యాలయంపైకి ఎక్కి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆరు డిపోల వద్ద కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కార్మికులు, పార్టీల నేతలు ఖమ్మం బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మహిళా కండక్టర్లు, కార్మికులు ఖమ్మంలోని కాంగ్రెస్‌ కార్యాలయంపైకి ఎక్కి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

ముగ్గురికి అస్వస్థత..
కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని 10 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మంగళవారం ఉదయం 5 గంటల నుంచే డిపోల వద్దకు చేరి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళనలు నిర్వహించారు. దీంతో జిల్లా ఆర్టీసీ జేఏసీ నేతలు, దాదాపు 300 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఆర్టీసీ కార్మికులు కిష్టయ్య, జీఎస్‌ రెడ్డి, పద్మలు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, మంథని డిపోల వద్ద కూడా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.

అరెస్టుల పర్వం..
మహబూబ్‌నగర్‌ రీజియన్, ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని అన్ని డిపోల్లో ఉదయం విధుల్లో చేరడానికి యత్నించిన కార్మికులు పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ రీజియన్‌లో 835 బస్సులకుగాను 655 బస్సులు నడిచాయి. సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న భీమ్‌లాల్‌ అనే కండక్టర్‌ విధుల్లో చేరడానికి ఉదయమే డిపోవద్దకు వచ్చాడు. పోలీసులు అరెస్టు చేసి ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అకస్మాత్తుగా అతను కిందపడిపోవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీపీ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. జహీరాబాద్, సిద్దిపేట, హుస్నాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట డిపోల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. యాదగిరిగుట్ట డిపోవద్ద 85 మంది కార్మికులను అరెస్ట్‌ చేశారు. కోదాడ, సూర్యాపేట డిపోలకు చెందిన సుమారు 200 మంది కార్మికులతో పాటు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి
సమ్మె విరమించినా ఆర్టీసీ కార్మికులను అధికారులు విధులకు అనుమతించట్లేదని మనస్తాపం చెంది ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడ్‌కు డ్రైవర్‌ కర్ణం రాజేందర్‌ (52) సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

మాకు ఇవ్వండి.. ఆర్టీసీని నిలబెడతాం: జేఏసీ
విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్టు చేయటాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. నెలన్నర ముందే సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించకుండా కాలయాపన చేసి, సమ్మెలోకి వెళ్లేలా చేసి ఇప్పుడు నెపాన్ని కార్మికులపై నెట్టడం సరికాదని జేఏసీ మండిపడింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలేవీ సరి కావని, ఆర్టీసీ నిర్వహణ కష్టమని చెప్పటం తప్పేనని పేర్కొంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన రీయింబర్స్‌ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ, నష్టాల రూట్లలో పన్ను మినహాయింపు ప్రకటించి తమకు అప్పగిస్తే ఆర్టీసీని కాళ్లమీద నిలబడేలా చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళవారం జేఏసీ నేతలు సమావేశమై కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవటాన్ని ఖండించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement