కేబినెట్‌ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం... | TSRTC Employees Hopes On KCR Cabinet Meeting | Sakshi
Sakshi News home page

నేడే భవితవ్యం!  

Published Thu, Nov 28 2019 3:20 AM | Last Updated on Thu, Nov 28 2019 1:52 PM

TSRTC Employees Hopes On KCR Cabinet Meeting - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మెరుగైన ప్రజా రవాణా సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీకి కొత్త రూపు ఇవ్వనుంది. 52 రోజులపాటు కొనసాగిన సమ్మె, 30 మందికిపైగా కార్మికుల మృతి, తాత్కాలిక సిబ్బంది బస్సులు నడుపుతున్న సమయంలో జరిగిన ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడం వంటి పరిణామాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండటం, పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నందున వారి భవితవ్యాన్ని తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో రెండు రోజులపాటైనా సరే మంత్రివర్గ భేటీ నిర్వహించి ఈ విషయాన్ని తేల్చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కేబినెట్‌ సమావేశం కొనసాగుతుందని, ఈ భేటీలో ఆర్టీసీ అంశం పూర్తిగా తేలని పక్షంలో శుక్రవారం కూడా సమావేశం కొనసాగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కార్మికులు మంచివారేనని, ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులూ కష్టపడే తత్వమున్నవారేనని, కానీ కార్మిక సంఘాల నేతలే వారిని చెడగొడుతున్నారంటూ ముఖ్యమంత్రి గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కార్మిక సంఘాల నేతల వల్లే ఆర్టీసీ పాడైందన్న తరహాలో మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా జేఏసీ నేతలే సమ్మె విరమించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరినా అది సాధ్యం కాదంటూ ఎండీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా కార్మికులు తెల్లవారక ముందే డిపోల వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీంతో వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గ భేటీలో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి మదిలో ఏ నిర్ణయముందనే విషయంలో మంత్రులు, అధికారులకూ స్పష్టత లేదు. కావాల్సిన సమాచారాన్ని కేబినెట్‌ భేటీ నాటికి సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి మంగళవారం అధికారులను ఆదేశించడంతో వారు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ పనిలోనే తలమునకలయ్యారు. 

ప్రైవేటు పర్మిట్ల కేటాయింపులో వేచి చూసే ధోరణి? 
ప్రస్తుతం ఉన్న రూపుతో ఆర్టీసీని నడపడం సాధ్యం కాదని, సగం బస్సులను తొలగించి వాటి స్థానంలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామని సీఎం ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ల పర్మిట్లు ఇవ్వాలని గత కేబినెట్‌ భేటీలో చేసిన తీర్మానానికి హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ఇక నోటిఫికేషన్‌ వెలువడటమే తరువాయి అనే పరిస్థితి నెలకొంది. గురువారం దీనిపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ముందుగా అనుకున్నట్లుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయిస్తే రవాణాశాఖ వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించి రవాణాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు కాకుండా కొంతకాలం తర్వాతే ముందుకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు సీఎం ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేబినెట్‌లో లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైకోర్టు సూచన మేరకు కార్మికుల సమ్మెకు సంబంధించిన కేసును లేబర్‌ కోర్టుకు బదిలీ చేసే అంశంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. 

వీఆర్‌ఎస్‌కు రూ. 5 వేల కోట్లు కావాలి... 
ఒకవేళ 5,100 ప్రైవేటు బస్సులు రంగంలోకి దిగితే ఆర్టీసీ సగానికి సగం కుంచించుకుపోనుంది. ప్రస్తుతం ఉన్న రూట్ల ప్రకారం దాని పరిధిలో 5,300 బస్సులు మాత్రమే మిగులుతాయి. 49,700 (300 మంది ఇప్పటికే చేరారు) మంది ప్రస్తుత కార్మికుల్లో కనీసం 20 వేల మంది ‘అదనం’గా మిగిలిపోతారు. వారిని కచ్చితంగా వీఆర్‌ఎస్‌ ద్వారానో, సీఆర్‌ఎస్‌ (కంపల్సరీ రిటైర్మెంట్‌) ద్వారానో తప్పించాల్సి ఉంటుంది. దీని పరిధిలోకి 50 ఏళ్లు పైబడిన వారిని తెచ్చే అవకాశం ఉంది. దీన్ని అమలు చేయాలంటే కనీసం రూ. 5 వేల కోట్లు అవసరమని అధికారులు లెక్కలేశారు. ఇంత మొత్తం భరించడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారనుంది. అయితే వచ్చే నాలుగైదేళ్లలో భారీ సంఖ్యలో కార్మికులు రిటైర్‌ అవుతుండటంతో ఒకవేళ అప్పటివరకు ఈ ప్రక్రియ ఆగితే ప్రభుత్వానికి వీఆర్‌ఎస్‌ బాధ ఉండదు. 

ఆస్తులమ్మితే తప్ప..... 
ఆర్టీసీ అధీనంలో పెద్ద మొత్తంలో ఖాళీ భూములున్నాయి. వాటిల్లో చాలా వరకు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని అమ్మితేగానీ వీఆర్‌ఎస్‌ అమలుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వానికి సమకూరవు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేస్తున్నది ఇలాంటి కసరత్తే. ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు పూర్తి వివరాలను సిద్ధం చేశారు. అయితే గురువారం జరిగే కేబినెట్‌ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక టికెట్ల ధరలను ఏటా పెంచేలా ఓ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుపైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు కార్మికులను ఒకవేళ విధుల్లోకి చేర్చుకుంటే భవిష్యత్తులో సమ్మెలు, యూనియన్‌ సభ్యత్వం లేకుండా పకడ్బందీ షరతులు విధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహరాన్ని ఈ భేటీలో తేలుస్తారా లేదా సమగ్ర నివేదిక అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. అధికారులు మాత్రం ఆర్టీసీకి సంబంధించి.. కార్మికులు, వారి వయసులు, అప్పులు, ఆస్తులు, డిపోలు, వాటి పరి«ధిలో బస్సులు, వాటి కండిషన్, వేరే రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి, ఒక్కో బస్సు ఖరీదు వంటి వివరాలతో సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement