
భర్త నరేష్ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య పూలమ్మ
సాక్షి, మహబూబాబాద్ : ఆర్టీసీ సమ్మె ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్నాలు, దీక్షలతో ఏమీ కాదని.. ప్రభుత్వం దిగి రావాలంటే తెలంగాణ ఉద్యమంలో జరిగినట్టు బలి దానం చేసుకోవాల్సిందేనని నమ్మి ప్రాణాలర్పించాడు. ఆర్టీసీ కుటుంబాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని, ఆర్టీసీలో చివరి బలిదానం తనదే కావాలని పేర్కొంటూ బలవంతంగా తనువు చాలించాడు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి, సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌లకు మహబూబాబాద్ డిపో డ్రైవర్ ఆవుల నరేష్(48) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నరేష్ పురుగుల మందు తాగిన సంగతిని ఆయన పెద్ద కుమారుడు శ్రీకాంత్ గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ నరేష్ కన్నుమూశాడు. డ్రైవర్ బలి దానం విషయం తెలియగానే ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీలు, కుల, విద్యార్థి సంఘాల నేతలు ఆస్పత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహన్ని డిపోకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు వారు పోలీసులను తప్పించుకొని స్టెచర్‌పై నరేష్ మృతదేహాన్ని ఉంచి ‘నీ మరణం వృథా కానివ్వం..’ అని నినాదాలు చేసుకుంటూ బస్సు డిపోకు తీసుకెళ్లారు.
మధనపడుతూ మృత్యుఒడిలోకి...
ఆర్టీసీ సమ్మె ప్రారంభం నుంచీ నరేష్ చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆక్టోబర్ 5న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నాడు. అనంతరం అక్టోబర్ 29న మరో 2 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోవడానికి సిద్ధపడినట్టు ఆ లేఖ ఆధారంగా తేలింది. తన ప్రాణత్యాగంతోనైనా ఆర్టీసీ సమస్యకు పరిష్కా రం లభించాలని సీఎంను ఉద్దేశించి రాసిన లేఖలపై మంగళవారం మరోసారి రాసుకున్నాడు. అనంతరం బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎల్లంపేటలో అంత్యక్రియలు
నరేష్‌ది సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరుట్ల. అత్తగారి ఊరైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఎల్లంపేటలో స్థిరపడ్డాడు. అతడి మృతదేహాన్ని ఎల్లంపేటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని, నివాళులు అర్పించారు. అంతకుముందు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ అశ్వత్థామరెడ్డిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఉన్నతాధికారుల సూచనతో మహబూబాబాద్ వెళ్లడానికి అంగీకరించారు.
బీజేపీ వర్సెస్ కమ్యూనిస్టులు
మృతుడు నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్టీసీ జేఏసీ, ఆఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. దీంతో అతడి కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం, డబుల్ బెడ్‌రూం ఇల్లు, మూడు ఎకరాల భూమి, నిబంధనల మేరకు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని శవపంచనామాకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించా రు. అప్పుడే అక్కడకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి తదితరులు.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచేవరకు మృతదేçహాన్ని కదలనివ్వమని ధర్నా నిర్వహించారు. అధికారులతో జరిపిన చర్చల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సైతం ఉన్నారని, ఇప్పుడొచ్చి రాజకీయాలు చేయటం సరికాదని సీపీఐ, సీపీఎం, ఇతర విపక్షాలు పేర్కొన్నాయి. బీజేపీ, కమ్యూనిస్టుల మధ్య గొడవకు దారితీసింది. పోలీ సులు రంగప్రవేశం చేసి బీజేపీ శ్రేణులను అరెస్టు చేశారు.