సాక్షి, కరీంనగర్ : ఆర్టీసీ డ్రైవర్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరపల్లికి తరలి వస్తున్నవారిని నియంత్రించేందుకు రోడ్లపై పోలీసులు భారీ గేట్లను అమర్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యకతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసుల నిర్భందం ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటు పోలీసులకు ఇటు కార్మికులకు వాగ్వాదం నెలకొంది. దీంతో కరీంనగర్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఇక డ్రైవర్ బాబు నివాసం వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. అలాగే కోదండరాంతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు వామపక్ష నేతలు అక్కడకు చేరుకున్నారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకు చేరుకుంది. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన సకల జనుల సమరభేరిలో కరీంనగర్–2 డిపోకు చెందిన డ్రైవర్ నంగునూరి బాబు (54) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతదేహంతో ఎంపీ బండి సంజమ్, కార్మికులు రాత్రంతా జాగరణ చేయగా, పొలిటికల్ జేఏసీ ఇచ్చిన కరీంనగర్ నగర బంద్ కొనసాగుతోంది. కరీంనగర్‌లో విద్యసంస్థల బంద్‌కు ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధి సంఘాల మద్దతు తెలిపాయి. అలాగే ఛలో కరీంనగర్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చారు.
పోలీసులు బాబు మృతదేహాన్ని స్వగ్రామం కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లికి గురువారం వేకువజామున తరలించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచే వరకు బాబు అంత్యక్రియలు నిర్వహించబోమని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించడం, వివిధ పార్టీల నాయకులు మృతదేహం వద్దే బైఠాయించడం, పరామర్శకు వచ్చిన కరీంనగర్–2 డిపో మేనేజర్ మల్లేశంను కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాల మొహరింపుతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
హైడ్రామా మధ్య మృతదేహం తరలింపు
నంగునూరి బాబు మృతదేహాన్ని హైడ్రామా మధ్య గురువారం వేకువజామున ఆరెపల్లికి తరలించారు. బాబు మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టనున్నారనే సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఆర్టీసీ జేఏసీ, పోలీసుల మధ్య దోబుచులాట నెలకొంది. బాబు మృతదేహంతో బస్టాండ్‌లో ధర్నా నిర్వహించాలని జేఏసీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని శనిగరం, బెజ్జంకి క్రాస్‌రోడ్, గుండ్లపల్లి టోల్‌ప్లాజా, ఎల్‌ఎండీ కాలనీ, అల్గునూర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తాల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి భౌతికకాయాన్ని తీసుకొచ్చే క్రమంలోనే కార్మిక నాయకుల వాహన శ్రేణిని వెంబడిస్తూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్ బైపాస్ రోడ్‌కు చేరుకున్నారు. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో జేఏసీ నేతల వాహనాలను అడ్డగించి అదుపులోకి తీసుకుని పీటీసీ సెంటర్‌కు తరలించారు. డ్రైవర్ బాబు మృత దేహంతో ఉన్న అంబులెన్స్‌ను ఆరెపల్లిలోని ఆయన నివాసానికి తరలించారు.
బాబు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న ఎంపీ సంజయ్
ఉదయం నుంచే అరెస్టుల పర్వం..
బాబు హఠాన్మరణం పట్ల ప్రభుత్వ వైఖరే కారణమని నిరసిస్తూ గురువారం బంద్‌కు పిలుపునివ్వగా.. ఉదయం నుంచే పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి ఆధ్వర్యంలో బస్‌డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ శ్రేణులు బస్టాండ్‌లోకి చోచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, సీపీఐ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేదారి మాట్లాడుతూ బాబు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, గుండేటి వాసుదేవ్, కొమురయ్య, పైడిపల్లి రాజు, సదాశివ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కళ్యాడపు ఆగయ్య, నాయకులు ఉదయం బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు.
భారీ బందోబస్తు..
ఆరెపల్లి గ్రామంలో ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, కార్మికులు వందలాది మంది రావడంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి కమిషనరేట్ల పరిధి నుంచి పోలీసు బలగాలను రప్పించారు. కరీంనగర్ అడినషల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు పార్థసారధి, అశోక్‌లతోపాటు సీఐ తుల శ్రీనివాస్‌రావు, విజయ్‌కుమార్, దేవారెడ్డి, విజ్ఞేశ్వరరావు, మరో 20 మంది సీఐలతోపాటు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఆరెపల్లి గ్రామ మొదలు నుంచి ప్రతీ గల్లీలో పోలీసుల పహారా చేపట్టారు.
పర్యవేక్షించిన ఇన్‌చార్జి సీపీ
పరిస్థితిని కరీంనగర్ ఇన్‌చార్జి కమిషనర్ సత్యనారాయణ, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పర్యవేక్షించారు. బాబు ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ పోలీసులను ఆదేశించారు.
ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులు
పోలీసులు బుధవారం రాత్రి నుంచి పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు బాబు ఇంటి వద్దకు వచ్చి చర్చలు జరిపి వరకు మృతదేహం కదిలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు ఏమీ చేయలేని పరి స్థితి నెలకొంది. అరెస్టు చేస్తే మరో వైపు దారి తీస్తే తలనొప్పిగా మారుతుందనే ఆలోచనలో ఉన్నారు. రాజకీయ నాయకులతో మాట్లాడిన ససేమిరా అంటున్నారు. వర్షం పడినా నాయకులు అక్కడి నుంచి కదలడం లేదు. పోలీసులు కూడా రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది.
టిఫిన్, భోజనం ఏర్పాట్లు...
ఉదయం నుంచి బాబు మృతదేహం వద్దనే ఆర్టీసీ కార్మికులు, మృతుడి బంధువులు ఉండడంతో టిఫిన్, భోజనం, మంచినీటి వసతి ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు బాబు ఇంటి వద్దనే సమ్మె కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.
‘చలో కరీంనగర్’కు తరలిరండి
బాబుకు ప్రభుత్వం పక్షాన సహాయం అందించడంతోపాటు ఆర్టీసీ జేఏసీని సత్వరమే చర్చలకు పిలువాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ జిల్లా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని పది డిపోల కార్మికులు ఉదయం పెద్ద సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చి చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు జరుపకుండా నిరవధిక ధర్నాలో పాల్గొనాలని కోరింది.
బంద్‌కు మద్దతు
శుక్రవారం నాటి కరీంనగర్ పట్టణ బంద్‌కు టీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు జక్కుల మల్లేశం, ఎంపీ రెడ్డి, మనోహర్, ఎస్‌కె రాజు తెలిపారు. ట్రస్మా జిల్లా శాఖ ప్రైవేట్ విద్యాసంస్థలకు ముందస్తుగానే సెలవు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment