
సాక్షి, హైదరాబాద్ : సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా తిరిగి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ శనివారం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ప్రకటించిన డెడ్‌లైన్ నేపథ్యంలో.. ఓ ఆర్టీసీ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరాడు. ఉప్పల్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం డిపో మేనేజర్‌కు లేఖ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తను సమ్మె విరమించి బేషరతుగా విధుల్లో చేరుతున్నట్టు కృష్ణ పేర్కొన్నారు.
కాగా, కేసీఆర్ ప్రకటించిన డెడ్‌లైన్ తర్వాత విధుల్లో చేరిన.. మొదటి వ్యక్తిగా కృష్ణ నిలిచారు. మరోవైపు కేసీఆర్ చేసిన ప్రకటనపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగం తీసేసే అధికారం సీఎంకు లేదని అన్నారు. కార్మికులు అందరు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment