కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.30కి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనలో 94 సబ్సిడీ గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని తాడ్వాయి నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లలితాపూర్‌కు ఏడు యూనిట్ల (147) సబ్సిడీ గొర్రెలను డీసీఎం వ్యానులో తరలిస్తున్నారు.
ఈ క్రమంలో కరీంనగర్ నుంచి మహారాష్ట్ర వైపు గ్రానైట్‌లోడ్‌తో వెళ్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ మోహన్‌రావు పేట శివారులో డీసీఎంను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా వ్యాన్ వెనక వస్తున్న ఓ సైకిల్, ద్విచక్రవాహ నాన్ని ఢీకొంది. ఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటాపూర్‌కి చెందిన దుర్గం బాలాగౌడ్ (60), కోరుట్లకు చెందిన అబ్దుల్ ఖాదర్ (41) అక్కడికక్కడే మృతిచెందారు. లారీ బలంగా ఢీకొనడంతో డీసీఎంలో ఉన్న 94 సబ్సిడీ గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
వ్యానులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ తీవ్రం గా గాయపడడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ సునీల్‌దత్, మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై మధుకర్ సంఘటన వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్పందించిన 1962
ప్రమాదంలో 94 గొర్రెలు మృతిచెందగా మిగిలిన గొర్రెలకు గాయాలయ్యాయి. గాయపడ్డ గొర్రెలకు జగిత్యాల జిల్లాకు చెందిన మొబైల్ వెటర్నరీ క్లినిక్ (1962) వాహనం సమయానికి చేరుకుని వైద్యం అందించింది. అనంతరం వాటిని మానకొండూరుకు పంపినట్లు టీం మెంబర్లు అన్వేష్, గంగాధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment